Facebook Twitter
నిగ్గుతేలిన నగ్నసత్యాలు

అప్పుడప్పుడు రెండు
చిక్కు ప్రశ్నలేస్తారు కొందరు

విత్తు ముందా ?చెట్టు ‌ముందా ?
గుడ్డు ముందా? కోడి ముందా? అని
నిజానికి తరతరాల నుండి ఈ రెండు
నిగ్గుతేలని విచిత్రమైన వింత వివాదాలే
మేధావులు సైతం విప్పలేని చిక్కుముడులే

ఐతే మరికొన్ని చిక్కుప్రశ్నలివిగో
అబ్బాయిల్లో అమ్మాయిల్లో
ఆకు ఎవరు ? ముళ్ళు ఎవరు?
భూమి ఎవరు ? పండు ఎవరు?
అయస్కాంతమెవరు? ఇనుప ముక్కెవరు?

ఆకుమీద ముళ్ళు పడినా
ముళ్ళుమీద ఆకుపడినా
అడ్డంగా తిరిగేది ఆకే అంటారు
ఔను ఇది నిగ్గుతేలిన ఒక నగ్నసత్యమే

చెట్టునుండి పండిన పండు
నేలమీద పడడానికి కారణం
భూమి గురుత్వాకర్షణ శక్తే అంటారు
ఔను ఇది నిగ్గుతేలిన ఒక నగ్నసత్యమే

అమ్మాయిని అబ్బాయి ఆకర్షించినా
అబ్బాయి అమ్మాయిని ప్రేమించినా కాలు
జారితే కడుపుపండేది అమ్మాయికేనంటారు
ఔను ఇది నిగ్గుతేలిన ఒక నగ్నసత్యమే

అమ్మాయి అందం ఒక అయస్కాంతం
అబ్బాయి ఆఅందానికి ఇష్టపడి ఎరక్కపోయి
ఇరుక్కుపోయే ఒక ఇనుపముక్కంటారు
ఔను ఇది నిగ్గుతేలిన ఒక నగ్నసత్యమే

అబ్బాయి ప్రలోభాలకు లొంగి
ఆవేశంతో అన్నీ అర్పించుకొని
మోసగాళ్ళ వలల్లో జింకలా
చిక్కి విలవిలలాడినా
బ్రతుకు బలైపోయినా కానీ
ప్రతి ఇనుపముక్క
అయస్కాంతాన్ని ఆకర్షించినట్టే
అమ్మాయిల అందచందాలకు
అబ్బాయిలు ముమ్మాటికీ బానిసలే

నమ్మరాదు నమ్మరాదు నమ్మనేరాదు

అమ్మా నాన్నలు ఆశపడ్డారు కాబట్టే
ఆ యిద్దరు ప్రేమతో కలిశారు కాబట్టే
కనిపించని ఆదైవం కరుణించాడు కాబట్టే
వారి కడుపున మనం పుట్టాం కాబట్టే

ఈ లోకంలోకి అడుగు పెట్టాం కాబట్టే
బ్రతికి ఈ నేలమీద బట్టకట్టాం కాబట్టే
పరమాత్మనుండి పిలుపొచ్చింది కాబట్టే
కన్నుమూసి కట్టెగా మారాము కాబట్టే

ఆర్జించినవన్నీ వారికి వదిలిపెట్టాం కాబట్టే
అంగరంగ వైభవంగా ఊరేగిస్తున్నారు కట్టెలపై
కాలుస్తున్నారు గోతిలో పూడుస్తున్నారు ఆత్మకు
శాంతి కలిగేలా అంత్యక్రియలు చేస్తున్నారు

చలువరాతితో సమాధులు కడుతున్నారు
లేదంటే ఏ కాకులకో ఏ గద్దలకో విసిరేసేవారు
మానవత్వంలేని ఈ కన్నబిడ్డలు ఈ కఠినాత్ములు

నమ్మరాదు నమ్మరాదు నమ్మనేరాదు
కన్నబిడ్డలనైనా, కట్టుకున్న భార్యనైనా
స్నేహితులనైనా' శ్రేయోభిలాషులనైనా నా

అన్నవారినెవరినైనా, సొంత బంధువులనైనా

బంధాలేవైనా బ్రతికున్నంత వరకే, కరోనా
కాలంలో మరీదారుణం ఘోరాతి ఘోరం
ఎవరూ నీవారు కారు, ఏదీ నీ వెంట రాదన్నది
చరిత్ర చెబుతున్న ఓ పదహారణాల పచ్చినిజం

ఈ నేల మనందరికి ఒక అద్దె కొంప, కన్ను
మూయకతప్పదు కొంప ఖాళీ చేయకతప్పదు
రేపటి రోజున ఖాళీచేతులతో కాటికెళ్ళడం ఖాయం
ఇదంతా కనిపించని ఆకాలం చేసే గొప్పఇంద్రజాలం