కొందరి పలకరింతతో మనసంతా
పులకరింత ఒళ్ళంతా జలదరింత
కొందరి మాటలు
చాకులు బాకులు తుపాకులు
కొందరి మాటలు
ఆకులు పూరేకులు మైసూర్ పాకులు
కొందరి మాటలు గులాబిపూలలా
మనసును పరవశింపచేస్తాయి
కొందరి మాటలు గులాబిముల్లులా
గుట్టుగా గుండెల్లో గుచ్చుకుంటాయి
కొందరి మాటల్లో చిమ్మచీకటి
కొందరి మాటల్లో నిండు పున్నమి
కొందరి మాటలు కమ్మని వంటలు
కొందరి మాటలు గుండెల్లో మంటలు
కొందరు మాటలతో కోటలు కడతారు
కొందరు మాటలతో పూలబాటలు వేస్తారు
కొందరు మాట్లాడితే తేనె త్రాగినట్లుంటుంది
కొందరు మాట్లాడితే
తేనెటీగలు చుట్టిముట్టి కుట్టినట్లుంటుంది
కొందరి మాటల్లో
నీతి నిజాయితీ నిండిఉంటాయి
కొందరి మాటలు ఎప్పుడూ
నిప్పు కణికల్లా మండుతూనెవుంటాయి
కొందరి మాటలు
పూలతోటలు ముత్యాల మూటలు
కొందరి మాటలు వట్టికోతలు కారుకూతలు
కొందరి మాటలు
హరివిల్లులు విరిజల్లులు
కొందరి మాటలు
కంట్లో నలుసులు కాళ్ళోముళ్ళులు
కొందరి మాటలు తేనెపూసిన కత్తులు
కొందరి మాటలు పరిమళించే పూలగుత్తులు
కొందరి మాటలు
కోడికూతలై ప్రజలను మేలుకొల్పుతాయి
కొందరి మాటలు గుండెను కోతకు గురిచేస్తాయి
కొందరు మాట్లాడితే
చెవిలో చక్కెర పోసినట్లుంటుంది
కొందరు మాట్లాడితే చెంపకేసి కొట్టాలనిపిస్తుంది
కత్తితో పొడవాలిపిస్తుంది కాల్చి చంపాలనిపిస్తుంది
మన మాటే మంత్రమైతే మంత్రదండమైతే
ఇక బ్రతుకు అండపిండబ్రహ్మాండమే సందేహం లేదు



