ఓ కొత్త కోడలా !
అత్త చేతివంట చెత్తనకమ్మా !
ఓ గడుసరి అత్తా !
కొత్త కోడలి వంటకు
కోటి వంకలు పెట్టకమ్మా !
ఓ కొడుకా ! ఓ కూతురా !
నిన్న అమ్మవంట
అమృతం కన్న మిన్న
కానీ నేడు కమ్మగాలేదని
కసురుకోకండి !
కస్సుబుస్సుమనకండి!
కరుకుగా మాట్లాడకండి!
ఓ కోపిష్టి మొండిమొగుళ్ళారా !
భార్యల వంటకాలను
భరించలేమంటూ బజారు కెక్కకండి!
భార్యలను బాధపెట్టకండి!
కారం ఎక్కువని ఉప్పు తక్కువని
నిప్పు మీద పడ్డ ఉప్పులా
చిటపటలాడకండి చిరుకోపంతో
పటపటమని పళ్ళుకొరక్కండి!
ఎంతో ఆశపడి ఎంతో శ్రమపడి
ఎంతో ఇష్టపడి ఎంతో కష్టపడి
ఎంతో భ్రమపడి మెచ్చుకుంటారని
నిలబడి,గంటల తరబడి
వంటలు చేసే భార్యల
మనసులను గాయపరచకండి!
రైతులు పొలాల్లో
రేయింబవళ్ళు శ్రమించి
స్వేదాన్ని చిందించి
పచ్చని పంటలు పండిస్తారు
అమ్మైనా అత్తైనా
కొత్త కోడలైనా
వంటగదుల్లో బంధీలై
ఎంతో ఓర్పుతో ఓపికతో
విలువైన కాలాన్ని వెచ్చించి
తమ ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టి
తమకున్న నైపుణ్యాన్ని జోడించి
కమ్మగా వంటలు చేస్తారు
మన కడుపులు నింపుతారు
ఎప్పుడైనా ఏదైనా చిన్నపొరపాటు
జరిగితే సహనంతో సర్దుకుపోవాలి!
ఓ అతిథి దేవుల్లారా !
వివాహ వేడుకల్లో
వియ్యాలవారి విందులో
ఆశతో వడ్డించుకొని ఆకలిలేకున్నా
తినలేక వంటకాల్ని వృధా చేయకండి!
వీధిచివర అనాధలెందరో
విసిరేసిన విస్తరాకుల్లో ఎంగిలి
మెతుకులకోసం కుక్కలతో కుస్తీ
పడుతుంటారని గుర్తుంచుకోండి!
అన్నం పరబ్రహ్మస్వరూపమన్న
నగ్నసత్యాన్ని కలనైనా మరువకండి!



