Facebook Twitter
బొగ్గుల మనిషి

                                                      బొగ్గుల మనిషి

                                                
                                                                    1
రాత్రి వాన కురిసింది.

నేలంతా తడిసిపోయి అక్కడ క్కడా నీళ్లు నిలబడి ఉన్నాయి.

బయట దూరంగా సైకిల్ వస్తున్న చప్పుడు.

'ఎవరు?' కేక వినిపించింది లోపల్నుంచి.

'న్నా! నేను మార్కెట్ సందులో గుడ్డలు ఇస్త్రీ చేసే వెంకటేశు కొడుకును. మా నాయన పంపించినాడు బొగ్గులు కొనుక్కు రమ్మని!' చెప్పినాడు సైకిల్ ఆపి, స్టాండ్ వేస్తూ.

'నిన్ననేకదుబ్బీ.. మీ నయనొచ్చి తీసుకపోయింది. అప్పుడే అయిపోయినాయా... అయినా ఊరంతా విడిచిపెట్టి, ఊరి బయట ఉండే ఈ బట్టీల కాటికే రావాల్నా...' లోగా గదిలోంచి మంచం మీద పడుకునే దీర్ఘం తీసినాడు బొగ్గుల మనిషి.

' ఏమోన్నా! నాకు తెలీదు. రాత్రి వానకు బొగ్గులన్నీ తడిసిపోయినాయని చెప్పమన్నాడు' చేతి లోకి ప్లాస్టిక్ సంచి తీసుకుంటూ జవాబిచ్చాడు.

'బొగ్గులన్నీ బట్టి వేయకముందే కాంట్రాక్టర్ కు అమ్మేసినాము. దింట్లోయి అమ్మీతే వాడు మొత్తుకొని సస్తాడు.అని తన బాధ చెప్పుకుంటా...

' పదికి, ఇరవైకి అమ్మముబ్బీ. ఇంతకుముందు కూడా మీ నాయనకు చెప్పినానే.. మళ్ళా నిన్ను అంపించినాడు ' విసుక్కుంటా బయటికొచ్చినాడు బొగ్గుల మనిషి.

'ఏమోలేన్నా... ఈసారికి ఇయ్యి!' అని చేతిలోని చిల్లర డబ్బు బొగ్గులాయప్పకు ఇచ్చినాడు.

'ఈ చిల్లర కు ఏం వస్తాయి... ఏమిఇయ్యాల..' అని గొణుక్కుంటూ పక్కనున్న పార చేతిలోకి తీసుకున్నాడు. కొన్ని బొగ్గులు లాగి ప్లాస్టిక్ సంచి లోకి వేశాడు.

బయట ఆకాశం లో మళ్లీ మోడాలు కమ్ముకుంటున్నాయి.

గబగబా సైకిల్ తొక్కుకుంటూ ఆ అబ్బాయి వెళ్ళిపోయాడు.

                                      2

బయట రెండు  బొగ్గు బట్టీలు కనిపిస్తున్నాయి.

వాటిని వేయడానికి కంటే ముందే కాంట్రాక్టర్ దగ్గర అవసరానికి డబ్బులు

తీసుకుని అమ్మేయవలసి వచ్చింది.

కొండకు పోయినోళ్ళు తెచ్చిచ్చిన కట్టెలు, మొద్దులు అటువైపు ఇంకా ఉన్నాయి.

ఇంకో రెండు బట్టీలు వేయాల్సి ఉంది. ఈసారి ముహూర్తాలకు కూతురు పెళ్లి చేయాలని అనుకుంటున్నాడు బొగ్గుల మనిషి.

రైతులు ఎవరైనా తమ పొలాల దగ్గర ఉన్న 'సర్కారు తుమ్మ' ను అమ్మితే కొనుక్కోవాలని చూస్తున్నాడు. కానీ కుదరడం లేదు. దిగువ పల్లెకు అవతల ఎక్కడో బేరం మాట్లాడుకొని వచ్చాడు బట్టీల పనిచేసే రామాంజి.

తను కూడా వెళ్లి మాట్లాడవలసి ఉంది.

ఇంతకు ముందులాగా లేదు పరిస్థితి.

ఎప్పుడు ఎవరు వచ్చి పట్టుకుంటారో అర్థం కాకుండా ఉంది.

సర్కారు తుమ్మ చెట్లు కొట్టడానికి ముందు అనుమతి తీసుకోవాలని అంటున్నారు.

బొగ్గుల బట్టీలు వేసుకోవడానికి కూడా మరొక అనుమతి కావాలి.

బొగ్గుల రవాణాకు కూడా ఇంకొక అనుమతి కావాలి. ఫారెస్టు అధికారు లో,

విజిలెన్స్ అధికారులో ఎప్పుడు ఎవరొచ్చి ఏ అనుమతి పత్రం చూపించమంటారా రో

అని గుండెల్లో దడ పుడుతోంది. వారికి ఇవ్వాల్సిన మామూళ్ల సంగతి సరే సరి!

' నువ్వు ఏమైనా చెప్పు. ఈసారి మాత్రం ముందుగా కాంట్రాక్టర్కు కొయ్య బొగ్గులు అమ్మేది వద్దని, అడ్వాన్సు తీసుకునేదే వద్దని ' రోజూ మొత్తుకుంటా చెప్తా ఉంది భార్య నాగులమ్మ.

బస్తా బొగ్గులు కాంట్రాక్టర్ కు అమ్మితే మూడొందలు ఇస్తాడు.

అదే బయట మార్కెట్లో అమ్ముకుంటే బస్తాకు ఐదొందలు దాకా వస్తాయి.

ఒక్కొక్క బట్టి కి కనీసం ఈసారైనా ముప్ఫయి బస్తాల బొగ్గు తీయాలని అనుకుంటున్నాడు.

ఒక ఆలోచన తర్వాత మరొకటి. ఇంకొకటి. వ్యవస్థలోని అవస్థ గుర్తొచ్చి

తనలో తానే నవ్వుకున్నాడు.

                                       3

ఎండొచ్చింది.

కూలోల్లందరూ  పనికి వచ్చారు.

ఈరోజు బట్టీలు వేసే పని ఉంది.

సర్కారు తుమ్మ కట్టెలు పల్లె నుంచి ఎద్దుల బండ్ల లో నిన్న సాయంత్రమే వచ్చాయి.

ఇక్కడ కనపడే రెండు బట్టీలు కూడా రామాంజినే వేశాడు. బాగా వచ్చాయి.

రెండు రోజుల్లో కాంట్రాక్టర్ వచ్చి వాటిని తీసుకెళ్తాను అన్నాడు. ఈ రోజు ఉదయం కూడా ఒకసారి ఫోన్ చేసి మాట్లాడాడు. అతను కోపిష్టి మనిషి. అతన్ని ఎంత త్వరగా వదిలించుకుంటే అంత మంచిది అనిపిస్తోంది. ఇప్పుడు కొత్తగా వేస్తున్న ఈ రెండు బట్టీలు మాత్రం అతనికి ఇవ్వకూడదని బలంగా అనుకుంటున్నాడు బొగ్గుల మనిషి.

రామాంజి హడావిడిగా కేకలు వేస్తూ పని చేస్తున్నాడు.

కట్టెలన్నీ సమంగా పేర్చుతున్నాడు .

గుండ్రంగా కట్టెలన్నీ సరిగ్గా కాలేటట్లు పేర్చడం రాకపోతే కష్టమవుతుంది. సగం మాత్రమే కాలిపోయి, మిగతా సగం కట్టెలుగానే ఉండిపోతాయి. అందుకే ఈ పని జాగ్రత్తగా చెయ్యాలి.

నాగులమ్మ టీ తెచ్చి కూలోల్లందరికీ ఇస్తోంది.

కట్టెలు పేర్చడం తో పాటు మధ్యలో గడ్డి కూడా కూర్చారు.

ఆ తర్వాత బట్టీల లోపలికి గాలి ప్రవేశించకుండా పైనంతా మట్టితో అలికారు.

సాయంత్రానికి అంతా పని పూర్తయింది.

పక్షులు గూళ్ళకు చేరుకుంటున్నాయి. చీకటైతాంది.

                                    4

పొద్దున్నే బయట ఏదో వాహనం వచ్చిన చప్పుడు .

తలుపు తట్టారు.

నిద్ర మొహం తో ఒళ్ళు విరుచుకుంటూ వెళ్లి తలుపు తీశాడు.

' రేయ్... ఈ బొగ్గుల మనిషి ఎవర్రా...' గదమాయించి అడుగుతున్నాడు వచ్చిన ఎత్తుటి వ్యక్తి .

'నేనే ...నేనేసార్' జవాబిచ్చాడు తడబడుతూ.

మళ్లీ అక్కడి నుంచి బొగ్గుల బట్టీల దగ్గరికి వెళ్ళాడు ఎత్తుటి వ్యక్తి .

ఏమి జరుగుతోందో అర్థం కావడం లేదు.

అప్పటికే అక్కడికి ట్రాక్టర్ వచ్చి ఆగి ఉంది.

అందులో నుంచి ఆరు  మంది కూలీలు దిగారు.

అక్కడున్న బొగ్గుల్ని సంచులకు ఎత్తి టాక్టర్ లోకి విసిరేస్తున్నారు.

కాసేపట్లో వాళ్ళు వచ్చిన పని పూర్తయింది.

ఆ వచ్చిన వాళ్ళు ఫారెస్ట్ అధికారులని చూస్తేనే అర్థమవుతుంది.

' సార్ సార్... అవన్నీ కాంట్రాక్టర్ కు అమ్మేసిన బొగ్గులు. మీరు తీసుకపోతే నేను చేతినుంచి వాళ్లకు డబ్బులు వెనక్కి కట్టేయాలి. ఇంక బట్టీలు వెయ్యను. మా అమ్మ మీద ఒట్టు. సార్ సార్...' అతను బతిమాలు కుంటున్నాడు . కానీ వాళ్ళు వినలేదు.

పొగ లేపుతూ ట్రాక్టర్ ముందుకు కదిలింది.

అక్కడే నేలపైన బొగ్గుల మనిషి దిగులుగా కూర్చుండిపోయాడు.

ఇప్పుడు కాంట్రాక్టు వచ్చి అడిగితే ఏం చెప్పాలి ? ఇక తన సరుకు ట్రాక్టర్ బొగ్గుల్ని విడిపించుకోవడానికి ఫారెస్ట్ వాళ్ళ చుట్టూ తిరగాలి.

అనుకుంటేనే బాధగా ఉంది. తెలియకుండానే కనురెప్పల లోతుల్లో కన్నీళ్లు కదిలాయి.

అట్లా ఆలోచనల్లో మునిగిపోయాడు.

                                    5

కాసేపటి తర్వాత దూరంగా సైకిల్ వస్తున్న చెప్పుడు.

మార్కెట్ సందులో గుడ్డలు ఇస్త్రీ చేసే వెంకటేశు కొడుకు వస్తున్నాడు.

స్టాండ్ వెనక తెచ్చుకున్న ప్లాస్టిక్ సంచిని దులిపాడు.

దగ్గరగా వచ్చాడు. ఏదో అడుగుతున్నాడు.

'బొగ్గులు లేవు ' అని మాత్రం అన్నాడు బొగ్గుల మనిషి..

ముఖం దిగాలుగా పెట్టుకొని పోతూ పోతూ కాసేపు ఆగాడు ఆ అబ్బాయి.

ఏదో అడిగాడు. తను తలాడించాడు. తన చేతిలో కొంత చిల్లర పెట్టాడు.

బొగ్గు బట్టీలు దగ్గర అక్కడక్కడ పడి ఉన్న చిన్న చిన్న బొగ్గు తునకలను ఏరుకొని ప్లాస్టిక్ సంచిలో కట్టుకొని, సైకిల్ స్టాండ్ వెనకవైపు పెట్టుకొని వెళ్లిపోతున్నాడు.

కొంత దూరం ముందుకు వెళ్ళగానే ఎదురుగా బైక్ లో కాంట్రాక్టర్ వస్తున్నాడు.

ఆ అబ్బాయిని ఆపాడు. సంచి లోని బొగ్గులు తెరచి చూశాడు. ఏదో తిడుతున్నాడు.

సంచి లోని బొగ్గుల్ని విసురుగా లాక్కొని అక్కడే కింద పోయించాడు. జేబులోంచి చిల్లర తీసి వాడిచేతిలో పెట్టి ఇంకోసారి ఇటు రావద్దని చూపుడు వేలు చూపించి హెచ్చరించాడు.

సంచి బొగ్గులు పోతుంటేనే అంగీకరించని కాంట్రాకర్, మొత్తం బొగ్గుల సంచులన్నీ

ఫారెస్ట్ వాళ్లు వచ్చి ట్రాక్టర్ లో తీసుకు పోయారని తెలిస్తే ఇంకేం చేస్తాడో...?

కొన్ని ఎట్లా రాసిపెట్టి ఉంటే అట్లా జరుగుతాయి.

ఎదురుగా తనవైపుకు వేగంగా వస్తున్న కాంట్రాక్టు వైపు అలాగే  చూస్తుండిపోయాడు బొగ్గుల మనిషి. జరిగేది జరగక మానదు. మధ్యాహ్నం వెళ్లి అధికారులను కలిసి మాట్లాడుకోవాలి. తమ సరుకును విడిపించు కోవాలి.  ఇక ఎక్కువ రోజులు  ఈ బొగ్గుల బట్టీల పని చెయ్యడం సాధ్యం కాదు.   కష్టంగా కూడా ఉంది. కూతురి పెళ్లి  చేసేసిన తర్వాత,  పట్నానికి వెళ్ళిపోయి ఏదైనా కొత్త పని వెతుక్కోవాలి. మనసులో అనుకున్నాడు.

తనకు మాత్రం కళ్ళ నిండా కన్నీళ్లు పెట్టుకుని సైకిల్ పైన వెళ్తున్న మార్కెట్ సందులో గుడ్డలు ఇస్త్రీ చేసే వెంకటేశు కొడుకే పదే పదే గుర్తొస్తున్నాడు.
ఆకాశంలో నల్ల మబ్బులు కమ్ముకుంటున్నాయి.


                                                                              - డాక్టర్ వేంపల్లి గంగాధర్