Facebook Twitter
సకల సమస్యలకు పరిష్కారం ఆత్మ స్థైర్యం

 

క‌ష్టం వ‌చ్చిన‌ప్పుడు కుంగిపోతే ఆ స‌మ‌స్య తీర‌దు స‌రిక‌దా న‌లుగురికి లోకువ అవుతాం. క‌ష్ట‌స‌మ‌యంలోనే ఒక మ‌నిషిలో ధైర్యం..ఆత్మ‌స్థైర్యం ఏంటో బ‌య‌టికి వ‌స్తుంది. ప్ర‌తీ స‌మ‌స్య‌కి ప‌రిష్కారం ఉండితీరుతుంది. నెమ్మ‌దిగా ఆలోచిస్తే ప్ర‌తీ స‌మ‌స్య‌కి ప‌రిష్కారం ఉంటుంది..ఆత్మ‌స్థైర్యాన్ని ఎన్న‌డూ కోల్పొవ‌ద్దు.

ఓ రోజు ఒక వనం లో ఒక పాము చాలా హుషారుగా పాకుతూ, దొర్లుతూ  అటువైపుగా వెళ్తోంది.దాని హుషారుతనాన్ని చూసిన ఒక కోతి దాన్ని పట్టుకుంది. దాంతో ఆ  పాము కోతిని కాటు వేయబోయింది. 
భయంతో కోతి ఆ పాము పడగను గట్టిగా పట్టుకొని గట్టిగా అరవసాగింది.. చుట్టువున్న మిగతా కోతులన్నీ అక్కడకు వచ్చి పామును పట్టుకున్న కోతిని చూసి ఇలా అనుకున్నాయి. ఇక ఈ కోతి బ్రతకడం కష్టం..
కోతి పామును వొదిలితే కచ్చితంగా కాటు వేస్తుంది.దాని  దగ్గరికెళితే మనం కూడా పాము కాటుకు బలి కావాల్సిందే.మనం దూరంగానే ఉండటం మంచిది అని అన్ని కోతులు వెళ్లిపోయాయి.

దాంతో  తనవాళ్ళంతా తనని రక్షిస్తారేమో అని ఎదురుచూసిన ఆ కోతికి నిరాశే ఎదురయ్యింది.అలాగే భయంతో ఆ పాముని గట్టిగా పట్టుకుని కూర్చుంది. అదే సమయంలో అటువైపుగా ఒక ముని వెళుతూ  
కోతి ప‌రిస్థితిని అర్థం చేసుకుని కోతితో ఇలా అన్నాడు. నీ చేతిలోని పాము నువ్వు భయంతో గట్టిగా పట్టుకున్నప్పుడే ఊపిరి ఆడక చచ్చింది. వదిలేస్తే నిన్ను కాటు వేస్తుందని భయపడి ఇబ్బంది పడుతున్నావు. దాన్ని వదిలేయి  అన్నారు. ఆ ముని మాటలు విని కోతి ఆ పామును వదిలి ఒక్క గెంతుతో చెట్టు పైకి ఎక్కేసింది.

ఇందులోని నీతి ఏంటంటే.. నీకు కష్టం వచ్చినప్పుడు దాని గురించే ఆలోచిస్తూ భయపడుతూ ఉంటే ఆ కష్టం నిన్ను వదిలి పోదు.కష్టాన్ని దూరంగా విసిరేసి ఆ స‌మ‌స్య‌కి  పరిష్కారం వెతకాలి. అలాగే నువ్వు ఇబ్బందిలో ఉంటే నీ కుటుంబ సభ్యులు, బంధువులు, ఎవ్వరూ నిన్ను రక్షించడానికి   నీ కష్టం తీర్చడానికి ముందుకు రారు అని   గుర్తు పెట్టుకోవాలి. ఆ కష్టం తమను చుట్టుముడుతుంద‌ని భ‌య‌ప‌డి దూరంగా వెళ్ళిపోతారు.అందుకే ఎవ‌రైనా   కష్టం వచ్చినప్పుడు ఎవరి సహాయం కోసం చూడకూడదు. కష్టాన్ని భూతద్దంలో చూడకూడదు.ఆ కష్టాన్ని మంచి పరిష్కారంతో  తరిమికొట్టాలి. అప్పుడే ఎవ‌రైనా  ప్రశాంతంగా ఉండగలరు.. వారి  జీవితం సుఖమయం అవుతుందని గుర్తు పెట్టుకోవాలి.