Facebook Twitter
వెంగళప్ప భార్య

వెంగళప్ప భార్య

అనగనగా ఒక ఊళ్ళో ఓ వెంగళప్ప ఉండేవాడు. ఏవేవో కబుర్లు చెప్పి అందరినీ నవ్విస్తూ, తనూ నవ్వుతూ ఉండే వెంగళప్ప అంటే పడి చచ్చేవాళ్ళు ఊళ్ళోని కుర్రకారు. ఎనభై ఏళ్లకు పైబడ్డా వెంగళప్పలోని ఉత్సాహం, హాస్యం ఏమాత్రం తగ్గలేదు మరి. ఒకసారి అట్లా చుట్టూ చేరిన కుర్రవాళ్ళకు తను సొంతగా చేసిన 'టీ' తెచ్చి ఇస్తుంటే ఓ కుర్రవాడు అడిగాడు- "తాతా! ఇన్నేళ్ళుగా నువ్వు మాకందరికీ ఇన్నిన్ని సంగతులు చెబుతున్నావు. అయితే మొహమాటం కొద్దీ ఇంతకాలంగా మేం ఎవ్వరమూ అడగని ప్రశ్న ఒకటుంది- 'నీదంటూ ఒక కుటుంబం ఎందుకు లేదు? నీ భార్య ఏమైంది? నీ పెళ్ళి ఎలా జరిగింది? ఇప్పుడైనా చెప్పు!'అని. 

"ఓ, దానిదేముంది, చెబుతాను- ఐతే ఆది చాలా పెద్ద కథ!"అని మొదలెట్టాడు వెంగళప్ప. "ఒకసారి నా చదువు పూర్తై, పనిలో చేరాక- మీ అంత వయస్సులో ఉన్నప్పుడు- పెళ్ళి చేసుకోవాలని చాలా గట్టిగా అనుకున్నాను. "ఎలాంటి భార్య కావాలి? ఆ అమ్మాయి ఎలా ఉండాలి? ఏ ప్రాంతపు మనిషి అయి ఉండాలి?..." అని రకరకాలుగా ఆలోచించాను.. "అమ్మాయి సన్నగా, నాజూకుగా ఉండాలి; పొడుగ్గా ఉండాలి కూడాను- ఆమె నల్లటి కళ్లు విశాలంగా, నక్షత్రాల్లా మిల మిలా మెరుస్తూ ఉండాలి. ఆమె చర్మం ఎలాగైనా తెల్లగా ఉండాల్సిందే; దాంతో పాటు పొడవాటి జుట్టూ ఉండాలామెకు. 

 

బాగా చదువుకొని ఉండాలి; సంగీతం వచ్చి ఉండటమే కాక ఒకటో రెండో సంగీత సాధనాలు వాయించగలిగి ఉండాలి- సాయంత్రం వేళల్లో నేను అలా కూర్చొని ఉంటే నేపధ్యంలో‌ సంగీతం వాయించేట్లుండాలన్నమాట! ఇక ఆమె మంచి వంటకత్తె కూడా అయి ఉండాలి కదా, లేకపోతే నాకు వంట ఎలాగ?! ఇంకా ఆమె వంశం గొప్ప పేరెన్నిక గన్న వంశం అయిఉండాలి. ఆమె ఎక్కువ సీరియస్‌గా ఉండకూడదు; పెద్దలంటే గౌరవం, మర్యాద ఉండాలి. ఆమె ముక్కు మరీ‌ పెద్దగా ఉండకూడదు- ఇంకా ఆమెకు సొంత తెలివితేటలు ఉండాలి- ఎప్పుడూ ఇతరులకు లోబడి ఉంటే ఎలాగ..? నాకు కాబోయే భార్య సకల సద్గుణ సంపూర్ణ అయి ఉండాలి" "అట్లా అన్నీ ఆలోచించాక, నేను నా గుర్రాన్నెక్కి బయలుదేరాను- దేశమంతటా తిరిగి, నాకు కాబోయే భార్యను వెతుకుదామని. 

 

'నా కలల రాణి, పరిపూర్ణ సులక్షణ- ఎక్కడో ఉండి ఉంటుంది; నాకోసమే ఎదురు చూస్తూ ఉంటుంది" అని నాకు చాలా గట్టిగా అనిపించింది. నేను ఆగిన మొదటి పట్టణంలోనే ఒక అమ్మాయి కనిపించింది నాకు. అద్భుతమైన అందం! నల్ల కలువల్లాంటి కళ్ళు. ఎత్తుగా, చాలా తెల్లగా ఉంది. గొప్ప వంశంలో పుట్టింది, చాలా ఆకర్షణీయంగా ఉందామె-" "ఓహో!" సంతోషంగా అరిచారందరూ. "మొత్తానికి త్వరగానే దొరికిందన్నమాట!" అని. "అయ్యో, అట్లాంటిదేం లేదు. ఆమెకు సంగీతమే రాదు! నిజానికి, ఆమె ముక్కు కూడా కొంచెం దుబ్బగానే ఉండింది.." "అందుకని నేను మరో పట్టణానికి వెళ్ళాను. అక్కడున్న మిత్రులు కొందరు నన్ను మరో కుటుంబానికి పరిచయం చేశారు- చాలా గొప్ప కుటుంబం, చక్కని అందమైన కూతురు! ఆమె ఎంత చక్కగా ఉందంటే, ఎంత ఉన్నతమైన ప్రవర్తన- చెప్పలేం. ఇక సంగీతం అయితే, ఆమెకు దేవుడిచ్చిన వరమే! అన్నిటినీ మించి, ఆమె తల్లిదండ్రులు నాకు పూర్తి భరోసా ఇచ్చారు- ఆమె అద్భుతమైన వంటగత్తె కూడా! 

 

"భలే భలే!" చప్పట్లు చరిచారు కుర్రవాళ్ళు "ఇంక ఏమైంది అప్పుడు?" "ఏమీ కాలేదు!" చెప్పాడు వెంగళప్ప- "ఆ అమ్మాయి, నిజానికి కొంచెం‌ దుబ్బగా ఉండింది- కొంచెం పొట్టిగా కూడా" "అయ్యో!" అన్నారంతా "మరి ఇంకేం చేశావు?" "ఏముంది, గుర్రమెక్కి బయల్దేరాను మళ్ళీ. ఈసారి మా సొంత ఊరుకెళ్ళాను. అక్కడ మా బంధువులు నన్నొక అద్భుతమైన యువతికి పరిచయం చేశారు- ఆమెను గురించి చెప్పాలంటే మాటలు చాలవు! ఏం అందం, ఏం చందం, ఏం వ్యక్తిత్వం! ఎంత చురుకుదనం, ఎంత ప్రశాంతత, ఎత్తుగా, హుందాగా, తెల్లగా దేవకన్యలాగా మెరిసిపోతూ! చక్కని సంగీతం, చదువు- నా భార్యలో నేను కోరుకునేవన్నీ ఉండినై ఆమెలో! ఎట్టకేలకు నాకు నేను మెచ్చిన యువతి ఎదురైంది! 

"అద్భుతం! అదృష్టం అంటే నీదే" అరిచాడో కుర్రాడు. కానీ‌ వెంగళప్ప ముఖం దిగాలుగా వేసుకొని కూర్చున్నాడు- ఇంకేమీ చెప్పలేదు. 
"ఏమైంది!? ఏమైందప్పుడు? చెప్పు, ఇట్లా ఆత్రంలో ముంచి వదిలేస్తే ఎలాగ?" రకరకాలుగా అరిచారు కుర్రాళ్లంతా. "కానీ ఏం చెప్పాలి, ఆమె కూడా తన కలల రాజు కోసం ఎదురు చూస్తున్నదట మరి!" అన్నాడు వెంగళప్ప, చల్లగా!

కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో