Facebook Twitter
కొబ్బరి చిప్ప మీద శతకం!!!


కొబ్బరి చిప్ప మీద శతకం!!!

 

 

సాహిత్యాన్ని సృజించే మనసు ఉండాలే కానీ... ఏ అంశం మీదయినా రచన చేయవచ్చు. ‘కాదేదీ కవితకనర్హం’ అంటూ కొందరు చిన్నచూపు చూడవచ్చుగాక! కానీ పెద్దమనసు ఉంటే కొబ్బరి చిప్ప మీదైనా శతకం రాయవచ్చు. అందుకు ఉదాహరణగా వావిలికొలను సుబ్బారావుగారు రాసిన ‘టెంకాయచిప్ప శతకం’ గురించి చెప్పుకోవచ్చు. తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత భద్రాచలం తెలంగాణలో చేరింది. దాంతో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒంటిమిట్టలోని రామాలయానికి ఒక్కసారిగా ప్రాధాన్యత పెరిగిపోయింది. నిజానికి ఒంటిమిట్టకు ఇలాంటి ఒడిదొడుకులు కొత్తేమీ కాదు! రాములవారు సేదతీరిన ప్రాంతమని చెప్పుకొనేటప్పటికీ, విజయనగర రాజుల చొరవతో కానీ ఇది వెలుగులోకి రాలేదు. ఆ సమయంలో ఒంటడు, మిట్టడు అనే ఇద్దరు ఈ ఆలయాన్ని పునరుద్ధరించే కార్యాన్ని తలకెత్తుకోవడంతో ఈ ప్రాంతానికి ‘ఒంటిమిట్ట’ అన్న పేరు స్థిరపడిపోయింది.

విజయనగర రాజుల పాలన తర్వాత మళ్లీ ఒంటిమిట్ట ప్రాభవం తగ్గసాగింది. గుడి పేరున ఉన్న మాన్యాలు అన్యాక్రాంతమైపోయాయి. దాంతో రాములవారి భక్తుడైన వావికొలను సుబ్బారావు, ఆలయాన్ని మళ్లీ పునరుద్ధరించే బాధ్యతను తలకెత్తుకున్నారు. సుబ్బారావుగారు సామాన్యుడేమీ కాదు! మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజిలో తెలుగు పండితునిగా పనిచేశారు. వాల్మీకి రామాయణాన్ని తెలుగులోకి ఛందోబద్ధంగా అనువదించారు. అందుకనే ఆయనను ‘ఆంధ్ర వాల్మీకి’ అని పిలుస్తారు. గిడుగు రామ్మూర్తి పంతులు ఆధ్వర్యంలో వ్యవహారిక భాష ఉద్యమం జరుగుతున్నప్పుడు, సుబ్బారావుగారు ఆ ఉద్యమాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.

సుబ్బారావుగారు రాయలసీమకు చెందినవారు కాబట్టి, ఆ ప్రాంతంలోని ఒంటిమిట్ట రాముడిని ఇష్టదైవంగా భావించేవారు. ఆ రాముని ఆలయానికి పునర్వైభవం తీసుకురావాలని అనుకున్నారు. ఆలోచన బాగానే ఉంది, కానీ దానికి డబ్బు ఎలా! అందుకు సుబ్బారావుగారు ఓ టెంకాయచిప్పను చేతపట్టుకుని ఆంధ్రదేశమంతటా తిరగడం మొదలుపెట్టారు. అంతటి మహాపండితుడు రాములవారి కోసం బిచ్చమెత్తడం చూసి, ఎదుటపడిన ప్రతివారూ ఎంతోకొంత విరాళాన్ని అందించారు. అలా పోగైన విరాళంతో ఆలయంలోని విమానగోపురం, రథశాల వంటి నిర్మాణాలతో పాటు ధూపదీపనైవేద్యాలకు లోటు రాకుండా చూశారు.

మొత్తానికి వావికాలను సుబ్బారావుగారు తల్చుకున్న కార్యం పూర్తయ్యింది. అందుకోసం తనకు సాయపడిన టెంకాయ చిప్ప పేరుతో ఒక శతకాన్ని రాయాలనుకున్నారు. దాంతో
ఆంధ్రవాల్మీకి హస్తంబు నందు నిలిచి
రూప్యములు వేన వేలుగా ప్రోగు చేసి
దమ్మిడైనను వానిలో దాచుకొనక
ధరణి జాపతి కర్పించి ధన్యవైతి
కలదె నీకంటె గొప్ప టెంకాయచిప్ప!
... అంటూ శతకాన్ని మొదలుపెట్టారు. ఆపై తను ఒంటిమిట్ట ఆలయాన్ని బాగుచేయడం కోసం ఎంత శ్రమించానో వర్ణిస్తూ, ఆ రాముని గొప్పదనాన్ని వివరిస్తూ, మధ్యమధ్యలో కాస్త తాత్వికతను జోడిస్తూ... 201 పద్యాలతో శతకాన్ని పూర్తిచేశారు.
వావికొలను సుబ్బారావుగారు ఆ తర్వాతకాలంలో వాసుదేవస్వామిగా మారి సీతాదేవి చరిత్రము, శ్రీకృష్ణ తత్వము, వాసుదేవ కీర్తనలు... లాంటి గ్రంథాలెన్నో రాశారు. దురదృష్టం ఏమిటంటే... ఏ ఒంటిమిట్ట ఆలయం కోసమైతే ఆయన అంతగా పాటుపడ్డారో, ఆ ఆలయంలోకే ఆయనకు ప్రవేశం లేకుండా చేశారట కొందరు.

- నిర్జర.