Facebook Twitter
జీవితాన్ని పుస్తకంలో చూపించిన - త్రిపురనేని గోపీచంద్‌

రచయిత, దర్శకుడు, హేతువాది... ఈ రంగాలలో ఏదో ఒక దానిలో ప్రతిభ కలిగి ఉండటమే గొప్పగా భావిస్తాము. అలాంటిది ఒకే వ్యక్తి ఈ మూడు రంగాలలో అడుగుపెట్టి తన ప్రతిభను నిరూపించుకోవడం ఏమంత తేలికైన విషయం కాదు. ఆ అసాధ్యాన్ని అలవోకగా సాధించినవాడు త్రిపురనేని గోపీచంద్.


త్రిపురనేని రామస్వామి చౌదరి గురించి తెలుగునాట తెలియంది ఎవరికి! కవిరాజుగా, తెలుగునాట హేతువాదానికి పునాదులు వేసిన ఉద్యమకారునిగా... రామస్వామి జీవితం ఓ సంచలనం. ఆ తండ్రికి తగ్గ తనయుడిగా త్రిపురనేని గోపీచంద్‌ ప్రస్థానం కూడా తెలుగు సాహిత్యంలో చిరకాలం గుర్తుంచుకోదగినదే! సెప్టెంబర్‌ 8, 1910 సంవత్సరంలో... కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు సమీపంలో అంగలూరు అనే చిన్న ఊరిలో జన్మించారు గోపీచంద్‌. అందరిలా బుద్ధిగా చదువుకుంటున్నా, తండ్రి నుంచి అలవర్చుకునే ప్రశ్నించే తత్వం మాత్రం మానలేదు. ఆ తత్వమే ఆయనలో అనేక ఆలోచనలకి, సంఘర్షణలకీ దారితీసింది. ఆ సంఘర్షణే అక్షరాలుగా మారి అద్భుతమైన రచనలుగా రూపుదిద్దుకున్నాయి.
గోపీచంద్‌ పుంఖానుపుంఖాలుగా రచనలు చేయలేదు. కానీ చేసిన కొద్దిపాటి రచనలూ సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచేలా ఉంటాయి. అసమర్థుని జీవితయాత్ర, పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా లాంటి రచనలైతే... తెలుగులో చదివితీరాల్సిన పుస్తకాల జాబితాలో ఎప్పుడో చేరిపోయాయి. తెలుగునాట ‘అసమర్థుని జీవితయాత్ర’ని తొలి మనో వైజ్ఞానిక నవలగా పేర్కొంటూ ఉంటారు. మనిషి లోతులను ఆ స్థాయిలో స్పృశించే స్థాయిలో మరో నవల ఇప్పటికీ రాలేదనే చెప్పవచ్చు.

 

‘సీతారామారావు జీవితం విచిత్రమైంది. ఉన్నత శిఖరాగ్రం నుంచి స్వచ్ఛమైన జలంతో భూమి మీద పడి మలినాన్ని కలుపుకొని, మురికికూపంలోకి ప్రవహించే సెలయేటిని జ్ఞప్తికి తెస్తుంది. తనలో వచ్చిన మార్పు ఆ సెలయేటికి తెలుసో తెలియదో మనకు తెలియదు. ఒకవేళ తెలిస్తే, తనలో వచ్చిన మార్పుకి ఆ సెలయేరు బాధపడుతూ ఉందో మనకు తెలియదు.’ అంటూ మొదలవుతుంది అసమర్థుని జీవితయాత్ర నవల. అలా సీతారామారావు అనే సదరు పాత్ర ఎలాంటిదో, దానికి తాను ఏ దిశను కల్పించదల్చుకున్నాడో తొలి పేరాలోనే చెప్పేస్తాడు రచయిత. అయితే ఆ పేరా కేవలం ఆరంభం మాత్రమే! ఒకపక్క సమాజ రీతిని విశ్లేషిస్తూ, మరోపక్క మనిషిలోని దౌర్బల్యాన్ని కళ్లకి కట్టినట్లు చూపిస్తాడు రచయిత. ఈ కథలో సీతారామారావు కేవలం ఒక వంక మాత్రమే! ఆ వంకతో ప్రతి పాఠకుడినీ తనలోకి తాను చూసుకునేలా, ఆత్మవిమర్శకి అద్దంలాగా తోస్తుంది ఆ నవల.


పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా నవలది మరో శైలి. అభ్యుదయ భావాలు ఉన్న కేశవమూర్తి అనే పాత్రని నాయకునిగా నిలుపుతుంది ఈ నవల. స్వార్థపూరితమైన వ్యక్తుల మధ్య అతని జీవిత పోరాటం ఎలా ఉందో విశదీకరిస్తుంది. ఈ నవలలో మార్క్సిస్టు భావజాలం పుష్కలంగా కనిపిస్తుంది. 1963లో దీనికి కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు కూడా లభించింది. ఆ బహుమతిని అందుకున్న తొలి తెలుగు నవలగా ఘనతని దక్కించుకుంది.


గోపీచంద్‌ రచనల్లో క్రమేపీ మార్క్సిస్టు ఉధృతి తగ్గి తత్వశాస్త్రం, మానవతావాదాలకు సంబంధించిన ప్రభావం కనిపించసాగింది. దీనికి ఎం.ఎన్‌.రాయ్‌, ఉన్నవ లక్ష్మీనారాయణ, అరవిందో తదితరుల ప్రభావం కారణం కావచ్చు. ఆ కారణంగానే ఆయన ప్రముఖ తత్వవేత్తల గురించి ‘తత్వవేత్తలు’ అనే గ్రంథాన్ని రాశారు. అయితే గోపీచంద్ ‘ఎందుకు?’ అని ప్రశ్నించడం మానుకుని, మూఢభక్తిని సైతం తత్వం అనుకునే స్థాయికి దిగజారాడన్న విమర్శలు లేకపోలేదు.


రచయితగా ఒక స్థాయిని అందుకున్న గోపీచంద్... సినిమారంగంలోకి కూడా ప్రవేశించారు. అక్కడ గోపీచంద్‌ కథ, మాటలు అందించిన సినిమాలు గొప్ప విజాయాన్ని సాధించాయి. చదువకున్న అమ్మాయిలు (మాటలు), గృహప్రవేశం (కథ) ఆయన కలంతో రూపుదిద్దుకున్నవే! అయితే ఆయన దర్శకత్వం వహించిన చిత్రాలేవీ విజయవంతం కాకుండానే కాలగర్భంలో కలిసిపోయాయి. సినిమారంగంలో పరాజయాలు చవిచూడటంతో అరవిందో ఆశ్రమానికి చేరి అక్కడి ఆధ్మాత్మికతతో కాస్త సేద తీరారు. తర్వాత తిరిగి జీవితంలో నిలదొక్కుకునేందుకు ఉపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వ సమాచార శాఖ డైరెక్టర్ గా, ఆకాశవాణి ఉద్యోగిగా బాధ్యతలు నిర్వహించారు.


నవలల్లోలాగానే నిజజీవితంలోనూ అనూహ్యమైన మలుపులు, ఉద్ధానపతనాలు చవిచూసిన గోపీచంద్‌... 52 రెండేళ్ల అతి చిన్న వయసులోనే లోకం నుంచి నిష్క్రమించారు. అయినా ఇప్పటికీ తెలుగునాట గొప్ప రచయితల జాబితాలో గోపీచంద్‌ పేరు ఠక్కున స్ఫురణకు వస్తుంది. అందుకే ఇన్నాళ్లు గడిచినా ఆయన సాహిత్యం అందుబాటులో ఉంది.

 

- నిర్జర.