Facebook Twitter
ఈకలకు వచ్చిన కళ్ళు..

ఈకలకు వచ్చిన కళ్ళు..

 


అనగనగా ఒక పక్షి రాజ్యం ఉండేది. ఆ రాజ్యానికి రాజు నెమలి. అప్పట్లో నెమలి ఈకల మీద ఇంత చక్కని కళ్ళు ఉండేవి కావు. అయినా కూడా అది చూసేందుకు బాగానే ఉండేది. రాజ్యంలోని పక్షులన్నీ రోజంతా బాగా కష్టపడి తమ తమ చేన్లలో పంటలు పండించేవి. అందరూ ఆనందంగా నివసించేందుకు అవసరమైనన్ని గింజల్ని సంపాదించేవి. ఒకసారి సూర్య భగవానుడికి ఒక అనుమానం వచ్చింది: 'భూలోకంలో ఇన్ని రాజ్యాలు ఉన్నాయి కదా, ఎక్కడైనా మంచితనం అనేది ఉన్నదా?' అని.

 

అందుకని ఆయన మారువేషం వేసుకొని, ఈ ప్రపంచంలోని అన్ని రాజ్యాలూ తిరిగి, అక్కడి ప్రజల్ని, రాజుల్ని పరీక్షిద్దామని బయలుదేరాడు. కానీ ఏ రాజ్యంలో చూసినా అక్కడి ప్రజలలో గాని, రాజుల్లో గానీ ఎక్కడా మంచితనం కనబడలేదు సూర్యభగవానుడికి. అట్లా తిరుగుతూ తిరుగుతూ నిరాశపడి, చివరికి మన పక్షి రాజ్యం చేరుకున్నాడు ఆయన.‌

 

రాజ్యంలోకి అడుగు పెట్టిన వెంటనే అనిపించింది: "ఇక్కడ ఎవరికో ఒక్కరికి మంచితనం ఉంది ఖచ్చితంగా!" అని. కానీ ఆ మంచివాళ్ళెవరో కనుక్కునేదెట్లా? అందుకని ఆయన మళ్ళీ వేషం మార్చాడు. ఈసారి ఆరోగ్యం బాగా లేని పక్షిగా మారాడు. ఇంద్రుడికి చెప్పి, ఒక పెద్ద గాలి వానను కూడా తెప్పించాడు. ఆ పైన ఆయన "తుఫాను వస్తోంది- తల దాచుకునేందుకు కొంచెం తావు ఇవ్వండి తల్లీ!" అంటూ గూడు-గూడు తిరిగాడు.

 

కొత్త పక్షిని చూడగానే రాజ్యంలోని పక్షులన్నీ‌ తలుపులు వేసేసుకున్నాయి. "మా ఇల్లు చిన్నది" అని ఒకటి అంటే, "పిల్లలు నిద్రపోతున్నారు" అని ఒకటి అన్నది- తప్పిస్తే, "లోపలికి రా, పర్లేదు" అని ఏ పక్షీ అనలేదు. "అన్ని గూళ్ళూ తిరిగేసాను- ఇప్పుడు ఇక మిగిలింది నెమలి ఒక్కటే"అని, సూర్యభగవానుడు నెమలి దగ్గరికి వచ్చాడు. రాజభవనం దగ్గరికి చేరుకున్నాడో లేదో, నెమలి తనంతట తానే ఆయన్ని లోపలికి పిల్చి, తల తుడుచుకునేందుకు తువ్వాలు ఇచ్చింది. "ఇంత గాలివానలో బయటికి ఎందుకు వచ్చావు?" అని అడిగి, "ఈ పక్షికి భోజనం ఏర్పాట్లు, పడక ఏర్పాట్లు చేయండి; డాక్టరుగారిని ఒకసారి వచ్చి చూడమనండి" అని ఆదేశించింది పనివాళ్లను. 

 

అప్పుడు సూర్యభగవానుడు తన సొంత రూపం ధరించి "ఓ నెమలీ! ఇప్పటి వరకూ నేను ప్రపంచంలోని అన్ని రాజ్యాలూ తిరిగాను. ప్రతిచోటా సమస్యల్లో ఉన్న పౌరుల వేషం వేసాను. రాజ్యంలో ఎవరైనా అట్లాంటివాళ్లని 'గమనిస్తారా, పట్టించు-కుంటారా, కొంచెమైనా కాపాడతారా' అని పరీక్షించి చూసాను. ఎవ్వరూ పట్టించుకో-లేదు. ప్రతివాళ్ళూ "మేం చాలా కష్టాల్లో ఉన్నాం; మా సమస్యలే తీర్చేవాళ్ళు లేరు" అనుకుంటూ తమలో తాము మునిగి ఉన్నారు కానీ, ఇతరుల బాధల పట్ల కరుణను వ్యక్తం చేసిన వాళ్ళు లేరు.


నాకు నిన్ను చూస్తే చాలా గర్వంగా అనిపించింది. రాజుగా నువ్వు నీ బాధ్యతని విస్మరించటం లేదు. నీకేదైనా వరం ఇవ్వాలని ఉంది. ఏం కావాలో కోరుకో!" అన్నాడు. నెమలి ఆయనకు నమస్కరిస్తూ "స్వామీ! నాకు వేరే ఏ కోరికా లేదు- నా రాజ్యంలో ఎవరికీ‌ కష్టం కలగకుండా చూసుకోవటం తప్ప. అయితే నాకున్న ఈ రెండు కళ్ళూ సరిపోవట్లేదు ఇంత పెద్ద రాజ్యాన్ని పరిపాలించటానికి. అదొక్కటే నాకు కనిపించే వెలితి" అన్నది.

 

సూర్యభగవాడు "ఓ! సరే! ఇదిగో తక్షణం నీ ఈకల మీద కళ్ళు ప్రసాదిస్తున్నాను. నీ రెండు కళ్ళతో నువ్వు ప్రపంచాన్ని చూస్తావు; అదే సమయంలో నీ‌ ఈ వెయ్యీ కళ్ళనీ ప్రపంచం చూస్తుంది. నీ ఈకలకున్న ఈ కళ్ళు పక్షులకు ఆదర్శంగా నిలుస్తాయి" అని మాయమైపోయాడు. అట్లా వచ్చాయి, నెమలి ఈకలకు ఇంత చక్కని కళ్ళు!

కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో