TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
పరిపాలన
అనగనగా ఒక దేశంలో ప్రజలందరూ కలిసి తమను పరిపాలించుకోవడానికి ఒక ప్రభుత్వ విధానాన్ని తీసుకు తెచ్చుకున్నారు. అందులో నియమాలు నిబంధనలు హక్కులు విధులు చట్టాలు అన్నీ ఉన్నాయి. ఆ దేశంలో ఒక 100 వరకు రాజ్యాలు ఉన్నాయి. వంద రాజ్యాల్ని పాలకులు చూడటం చాలా కష్టంగా అనిపించింది. అందుకని ప్రతి రాజ్యానికి ఒక రాజును ఎన్నుకోమని, అలాగే వంద రాజ్యాలకి వంద మందిని ఎన్నుకోమని ఒక ప్రకటన వెలువడింది.
అలా వెలువడిన ప్రకటనలో ప్రతి రాజ్యంలోనూ కూడా నేను ఉంటాను అంటే నేనుంటానని చాలామంది పోటీకి వచ్చారు. పోటీకి వచ్చిన తర్వాత, అలా కాదు.. అది జనాభా ప్రాతిపదికన ఎన్నుకోవాలి, లేకపోతే అందరూ కలిసి ఎవరు రాజుగా ఉండాలనుకుంటున్నారో వాళ్లు తమస్థాయిలను బట్టి వాళ్ళు చేసేటటువంటి పనుల్ని బట్టి వారిని ఎన్నుకోవడం జరుగుతుంది. అనగా నేను ప్రజల కోసం చెరువుల తవ్విస్తానని ఒకరు, నేను ప్రజల కోసం రోడ్లు వేస్తానని ఒకరు, నేను ప్రజలకి ఆర్థికంగా లాభాలు చేకూరుస్తానని మరొకరు, నేను ప్రజలకు విద్యను అందిస్తాను అని ఇంకొకరు, నేను ప్రజలకు వైద్యాన్ని అందిస్తానని మరొకరు.. ఇలాగా రకరకాలుగా తమ అభిప్రాయాలు తెలియజేశారు.
అలాగే రాజ్యంలో ఎన్నికలు జరిగి వంద రాజ్యాలకి వంద మందిని ఎన్నుకోవడం జరిగింది. ఎన్నిక కాబడినవాళ్ళు ఎన్నిక కాబడిన తర్వాత తాము చేస్తామన్న పనులు మాని తమ స్వలాభం కోసం కోట్లాది రూపాయలు కూడపెట్టుకుని వందల ఎకరాలు భూములు స్వాధీనం చేసుకుని తాము చేస్తామన్న పనులు మర్చిపోయారు. ఇలా ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి అలా జరుగుతూనే ఉంది. వచ్చిన వాళ్ళు ఈవిధంగా అబద్ధపు వాగ్దానాలు, డాబు కబుర్లు చెప్పడం, తనని ఎన్నుకోడానికి ప్రజలకి అవి ఇవి ఇస్తానని చెప్పడం, తాత్కాలిక అవసరాలు తీర్చి ప్రజలను మభ్యపెట్టి పదవులు పొందడం.. అలా చేస్తూ ఉండేవారు. అయితే ఇలా కొన్నేళ్లు గడిచిన తర్వాత ప్రజలలో కొంత మార్పు వచ్చింది.
ప్రజలకు ఒక ఆలోచన వచ్చింది. అది ఏంటంటే ప్రజల్లో వంద రాజ్యాలకి ఎన్నుకోబడేవాళ్లు బాగా చదువుకుని ఉండాలి. ఏ ఉద్యోగం లేకుండా ఉండి ఆస్తిపాస్తులు లేని వారై ఉండాలి. వారి పదవీకాలం పూర్తి అయ్యేసరికి వారి జీతానికి సంబంధించిన ఆస్తులు తప్ప ఎలాంటి ఆస్తులు వారికి ఉండకూడదు. వారికే కాదు ముందుగా తెలుపబడినటువంటి విధంగా బంధువులకు గాని, వాళ్ళ కుటుంబ సభ్యులకి గాని, అంతకుమించి ఆస్తులు ఉండకూడదు. ఎన్నుకోబడినవారికి ఇచ్చే జీతం కూడా మామూలు జీతం కంటే ఎక్కువ ఇవ్వబడుతుంది. వీళ్ళు కేవలం ప్రజా సంక్షేమ దృష్టిలో పెట్టుకుని పని చేయాలి. అలా చేయటం వల్ల వీళ్ళు ఒక రూపాయి కూడా ఆశించకుండా ప్రజల అవసరాలను సక్రమంగా తీర్చాలి. లేదంటే వీళ్లు శిక్షార్హులవుతారు.
బాగా డబ్బున్న వ్యక్తులకి రాజ్యాధికారం అప్పచెప్తే వాళ్లు ప్రతిదీ డబ్బుతో కొనడం అన్యాయాలు అక్రమాలు ఇలాంటివి చేయడం జరుగుతుందని ప్రజలు గమనించారు. కాబట్టి ఈసారి ఎన్నుకునే వ్యక్తుల్ని అలాంటి వ్యక్తుల్ని ఎన్నుకోవాలని వారు నిర్ణయించుకున్నారు. అలా నిర్ణయించుకున్న తర్వాత ఒక్కొక్క రాజ్యానికి ఒక వ్యక్తిని బాగా చదువుకుని ఎటువంటి ఆస్తిపాస్తులు లేని, తమకే కాక తమ కుటుంబ సభ్యులకు, బంధువులకు కూడా ఆస్తిపాస్తులు లేని వ్యక్తులను వంద రాజ్యాలకు వంద మందిని ఎన్నుకున్నారు.
ఎన్నుకోబడిన వందమంది వ్యక్తులు తమ పరిపాలనని ప్రారంభించారు. ముందుగా ప్రజలకు కావలసినటువంటి నిత్యావసరాలు ఏంటో వారు తెలుసుకున్నారు. వాటిని తీర్చడానికి ఆర్థిక ఆదాయ వనరులను వారు గుర్తించారు. ఆదాయం పెరిగితే ఆ పెరిగిన ఆదాయాన్ని బట్టి ప్రజల యొక్క అవసరాలను తీర్చవచ్చు అని ముందుగా ఆదాయం పెరిగేటటువంటి వాటిపై వారు దృష్టిపెట్టారు. మామూలుగా ఇచ్చేటటువంటి జీవితం కంటే రెట్టింపు జీతం వారికి ఇవ్వబడింది కాబట్టి వారు ఎటువంటి అవినీతికి పాలుపడలేదు. ఇలా రెండు సంవత్సరాలు గడిచేటప్పటికీ ప్రజలకి అనేక సంక్షేమ పథకాలు అందజేయబడ్డాయి. ప్రజలకు ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం విడుదల చేసిన ప్రతి ఒక్క రూపాయి కూడా ఉన్నది ఉన్నట్లుగా ప్రజలకు ఖర్చు పెట్టడం వల్ల ఎలాంటి అవినీతి జరగకుండా ప్రజాపాలన చక్కగా కొనసాగింది. ఎన్నుకోబడ్డ పాలకులు వందమంది కూడా ఒక్క రూపాయి ఆశించకుండా తమకు ఇచ్చేటటువంటి ప్రజల సొమ్ములో రెట్టింపు జీతాన్ని తాము అనుభవిస్తూ ప్రజల కోసం కష్టపడడం, కష్టపడి పనిచేయటం ప్రారంభించారు. అలా అతికొద్దికాలంలోనే ఆ దేశం అభివృద్ధి చెందిన దేశం అయింది. అనేక సౌకర్యాలు ఆ దేశంలో సమకూర్చబడ్డాయి. ప్రజలంతా చాలా ఆనందంగా ఉన్నారు.
ప్రపంచంలో అన్ని దేశాలకు అది ఆదర్శదేశంగా నిలిచింది. ప్రజలను పాలించేటటువంటి ప్రభుత్వం, ప్రజలు తీసుకున్నటువంటి చక్కటి నిర్ణయం వారి జీవితాలను మార్చేసింది . అలా ఎవరికి డబ్బు ఎక్కువ ఉంటే, వారికి పాలన అప్పగించడం కంటే ఏమీ లేని వారిని తీసుకొచ్చి ఏమీలేని తెలివైనవారిని చదువుకున్న వారిని తీసుకువచ్చి వాళ్ళకి మామూలుగా ఇచ్చే దానికంటే కొంచెం ఎక్కువ జీతం ఇచ్చి వారిని వారి కుటుంబ సభ్యుల్ని ఎంక్వయిరీ చేసి, ఎలాంటి బినామీ ఆస్తులు ఏర్పరచుకోకుండా ఉండేలాగా నీతిగా నిజాయితీగా పనిచేసేవారిని ఎన్నుకుంటే దేశం అత్యద్భుతమైన రీతిలో పేరు ప్రఖ్యాతులుగాంచి సకల సౌకర్యాలతో ప్రజల సుఖంగా జీవించేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి.
ప్రజల ఆలోచనలు బట్టి ప్రభుత్వం అనేది ఉంటుంది. ప్రజల ఆలోచన బాగుంటే ప్రభుత్వం బాగుంటుంది. పరిపాలన బాగుంటుంది. ఏదైనా ప్రజల చేతుల్లోనే ఉంది. తీసుకునే నిర్ణయం నీతిగా న్యాయంగా ఉండాలి తప్ప కులమత వర్గ ప్రాంత భేదాలును బట్టి ఉండకూడదు. ఒకరి స్వార్థం వందమందికి నష్టం కలిగిస్తుంది. ఒకరి స్వార్థం వందమందికి బాధలు కలిగిస్తుంది. మన స్వార్థం వలన అమాయకులైన ప్రజల నోటికాడి తిండిని మనం లాక్కుని మనము, మన కుటుంబ సభ్యులు అనుభవిస్తే అది ఏదో ఒక రీతిన మన కుటుంబానికి తీరని నష్టం చేకూరుస్తుంది కాబట్టి పాలించే పాలకులు తమకు వచ్చిందాన్ని బట్టి పనిచేయడం తప్ప అక్రమంగా దోచేయాలంటే దానికి పైనున్న భగవంతుడు మనకి తీరని శిక్ష విధిస్తాడు. ఇది వాస్తవం.
- వీధి దుర్గారావు