Facebook Twitter
‘మా’ మామిడి చెట్టు

‘మా’ మామిడి చెట్టు

 

చైత్ర మాసానికి స్వాగతం పలుకుతోంది... ఆ మామిడి చెట్టు లేత పిందెలతో...

మా మంచి మామిడిచెట్టు.

ప్రకృతి కాంత ఆకుపచ్చని చీర కట్టునట్లుంటుంది.

మావిచిగురు తిని మత్తెక్కి కూసే కోకిల గానం... గమ్మత్తుగా వుంటుంది కదా!

వయస్సు పైబడ్డ తాతయ్య ‘మా’ మామిడిచెట్టు నీడలో పడకకుర్చీ వేసుకుని పుస్తకం చదువుకునేవారు. మా చిన్నతనంలో చూసేదాన్ని.

పెరట్లో మామిడి పిందెల కోసం గోడలెక్కే ఆకతాయిలను కర్రచూపించి తరమడం బామ్మకో గొప్ప కాలక్షేపం.

మామిడిచెట్టు పెరట్లో వుంటే ఆ ఇంటి పెద్దకొడుకు ఉన్నట్లే...

మామిడాకులతో తోరణం.. మామిడికాయ పప్పుతో శుభకార్యం... ప్రతి తెలుగింటా చూస్తూ మామిడిపై అనురాగం... మమకారం.. నాకు...

మామిడిచెట్టుని చూస్తే జీవితం కనబడుతుంది.

లేత వగరు పిందె... యవ్వనం...

పులుపు.. మధ్య వయస్సులోని బింకం...

పండ్ల రసం... వయస్సుతో వచ్చే అనుభావాల మాధుర్య సారం... వాత్సల్య రసం...

దీనిని పొగడ నా తరమా....

ఊరగాయ రోజుల్లో అమ్మమ్మ జాడీకెత్తే కొత్త ఆవకాయ వేడి అన్నంలో కలుపుకుని తింటూ వుంటే స్వర్గానికి బెత్తెడు దూరం...

వేసవి సెలవల్లో మామిడి పండు తింటూ... చివరన వదలబుద్ధి కాని టెంకెను చీకుతూ... అప్పుడూ స్వర్గానికి బెత్తెడే దూరం...

బంగినపల్లి, చెరుకు రసాలు, కలక్టెరు కాయలు... పేరు ఏదైనా వేసవిలో ఏ మామిడి చెట్టుని చూసినా; యుద్ధానికి సంసిద్ధమైన సైనికుడిలా... అస్త్ర శస్త్రాలతో, కాయ, పండ్లతో... వెన్ను విరుచుకుని... నిటారుగా... మా బంగారు మామిడి... ప్రకృతి ఆరాధకులకు,పరమ భక్తులకు, భోజన ప్రియులకు.... అందరినీ అలరించి పలకరించే కడుపు నింపే అమృతవృక్షం.

మా మంచి మామిడిచెట్టు.

కడుపారా పిల్లల్ని కని సమాజానికి అందించే ఆదర్శం... కనికరం లేని సమాజం శాఖలుగా చీర్చి... పొయ్యిలోకి తోసినా తొణకని... బెణకని... తల్లిని తలపించే... ఓర్పు... అనురాగం... శిరస్సు వంచి.. ప్రణమిల్లుతున్నాను మా తల్లి ‘మామిడి’కి; మా అందరి మదిలో ఎప్పటికీ నీ స్థానం సుస్థిరం... పదిలం... సస్యశ్యామలం. మా మంచి చెట్టు మామిడికి వందనాలతో....

- పి.భారతీలక్ష్మి