Facebook Twitter
చావు చూపిన పరిష్కారం

చావు చూపిన పరిష్కారం (తెలుగువన్ ఉగాది కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)

 

 

ఆనంద్ కర్మకాండలు జరిగిపోయాయి! 
చీకటి పడకుండా... వచ్చిన బంధుమిత్రులంతా ఎవరి ఇళ్లకు వాళ్ళు తొందరపడుతూ ప్రయాణమై వెళ్లిపోయారు.
ఇక ఆ ఇంట్లో తనకూ, కొడుక్కీ తోడుగా అత్తమామలు వుండిపోవడం... కొండంత ధైర్యాన్ని ఇచ్చాయి.మనసులో ప్రాశ్చాత్తాప భావనతో వారిని కృతజ్ఞత గా చూసింది-లలిత.
భర్తను కోల్పోయి-భార్య,
తండ్రిని కోల్పోయి-కొడుకూ,
కొడుకుని కోల్పోయి-ముసలి తల్లిదండ్రులు,
ఎవరికీ వారికే కావాల్సినవాడు- ఆనంద్.


ఎవరి బాధా  తీర్చేది కాదు.ఒకింట్లో ఒక మనిషి పోయాడంటే... ఆ ఇల్లు ఎంత నిసీధిగా మిగిలిపోతూ బావురుమంటుందో...ఆ కుటుంబ సభ్యులకు మాత్రమే తెలుస్తుంది.
మూడు రోజులు గడిచాయి....కోడలికీ,మనువడికీ ధైర్యం చెప్పి బరువెక్కిన గుండెలతో గుమ్మందాటి వెళ్తున్న ఆ ముసలివాళ్ళిద్దరి కాళ్ళనీ చుట్టేసింది లలిత.


"అత్తయ్యా, మావయ్యా..! నన్ను క్షమించండి.మీకు మీ కొడుకు మీద యేమాత్రం ప్రేమ వున్నా... మమ్మల్ని వదిలి వెళ్ళకండి.మీకు మీ అబ్బాయి లేని లోటుని మేము తీరుస్తాం.ఇన్నాళ్లూ మిమ్మల్ని ఎంతో కష్ట పెట్టాను.ఒక్కగానొక్క కొడుకుదగ్గర మీ జీవితం సాగనీయకుండా ప్రవర్తించేను. మీ అబ్బాయి మనమంతా కలిసుండాలని తపించేవారు.ఆ విషయం లో నేను యేనాడూ సహకరించలేకపోవడంతో ...ఆయన బాధపడని రోజంటూ లేదు.ఆయన బ్రతికున్నంత కాలం మీతో గడపానీయకుండా చేసిన పాపిష్ఠిరాలను.నాకు నాభర్తా,పిల్లాడే లోకం అనుకున్నాను. మాకందరికీ పెద్ద దిక్కైన మీ అండదండలు మాకు అవసరం వుంటాయని యేనాడూ గ్రహించలేకపోయాను.మీగురించే ...పదిహేను రోజుల క్రితం  మీ అబ్బాయికీ నాకూ మధ్య చిన్న వాదన  జరిగింది. హైదరాబాద్ నుంచి ఇప్పట్లో ఇక్కడకు ట్రాన్స్ఫర్ అయ్యేటట్లు లేదనే నిరాశ తో...అమ్మా నాన్నా రోజు రోజుకి నీరసించిపోతున్నారు.

ఈ వయసులో వారిని వేరుగా ఉంచడం న్యాయమంటావా? వాళ్ళని కూడా మన ఇంటికి తీసుకొచ్చేస్తే... కనీసం నువ్వైనా వాళ్ళని ఓ కంటకనిపెట్టుకుని ఉండొచ్చని వేడుకోలుగా నన్ను అడుగుతున్నా...ఆయన మాటలని మధ్యలోనే తుంచేసాను.వయసైన మీ ఇద్దరికీ సేవలు చేయడం నా వల్ల కాదని విరుచుకుపడ్డాను.దానితో మనస్తాపం చెంది...ఆ మర్నాడే నాతో ఏమీ మాట్లాడకుండా హైదరాబాదుకి ప్రయాణమై వెళ్లిపోయారు. అలా వెళ్ళినాయన కనీసం ఫోను కూడా చేయలేదు సరికదా నేను చేసిన ఫోనేకాల్ ని కూడా రిసీవ్ చేసుకోలేదు.నాపై కోపం తగ్గాకా చేస్తారనుకున్నాను. కానీ ...ఆయన ఫోను నుండే ఆయన చావు కబురు వినడం...నాపై పిడుగు పడ్డట్టయింది. ఆయన నాకింత శిక్ష వేస్తారనుకోలేదు.ఇదంతా నా వల్లే జరిగింది.నన్ను క్షమించండి"అంటూ ప్రాశ్చాత్తాప వేదనతో ఏడ్చేసింది లలిత .
కోడలు క్షమాపణ అడిగేసరికి...ఆ పెద్దమనసులు కరిగిపోయి ఆమెను అక్కున చేర్చుకుని కన్నీళ్లు  తుడిచారు.
           
హాల్లో గోడకి దండ వ్రేలాడుతూ...ఆనంద్ ఫోటో!
ఇంట్లోకి అడుగుపెడుతూనే...తనఫోటోకి పట్టిన దుస్థితిని చూసి స్థాణువైపోయాడు ఆనంద్.
సడన్ గా వచ్చిన ఆనంద్ ని చూసి  ఆశ్చర్యపోయారు ఆ కుటుంబమంతా!వారందరికీ తేరుకోడానికి కొంత సమయం పట్టినా...
ఆనంద్-తల్లి తండ్రులను చూసి...
తల్లిదండ్రులు-కొడుకుని చూసి...
లలిత-భర్తను చూసి...
కొడుకు-తండ్రిని చూసి...


మొత్తానికి తమకింక లేడు అనుకున్న ఆనంద్ కళ్ళముందు కనిపించగానే...ఒకరికొకరు చూసుకుంటూ.....నమ్మలేకుండా వున్నారు.
భార్య చెప్పిన తన చావుకబురు కథంతా విన్నాకా.. ఆనంద్ కి నవ్వాగలేదు.
ఇంతకీ ఆనంద్ చావుకబురు ఎలా పుట్టిందంటే....
సికింద్రాబాద్ రైల్వే పోలీసుల నుంచి లలిత కి ఫోన్ వచ్చింది.....


ఆనంద్ అనే వ్యక్తి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ట్రైన్ కిందపడి చనిపోయాడనీ,పోలికలు కూడా గుర్తుపట్టలేనట్టుగా ఉన్నాయనీ,అతని దగ్గర ఉన్న ఆధారాలతో... మీ మనిషై వుంటాడనీ పోలీసులు నిర్ధారించి చెప్పడంతో... ఆ పిడుగుపాటు వార్తని తట్టుకోలేకపోయింది లలిత.తనమీద కోపంతో వెళ్లిన భర్త విరక్తితో ఆత్మహత్య చేసుకున్నాడనుకుంది.రైల్వే పోలీసులు ప్యాక్ చేసి అందించిన అతని శవానికి దహనకాండలు కూడా చేసేసారు.భర్త నుంచి ఫోన్ కాల్ కూడా రాకపోవడంతో అదే నిజమనుకుని ఇంకేమీ ఎంక్వయిరీ కూడా చేయించుకోలేదు.


ఆనంద్ కి ఆ విషయం అంతా తెలిసాకా.... పదిహేను రోజుల క్రితం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన సీనంతా కళ్ళముందు మెదిలింది.
ప్రతినెలా హైదరాబాద్ నుంచి రెండుసార్లు ఇంటికి వచ్చి వెళ్తున్నట్లే...విశాఖపట్నం నుంచి బయలుదేరి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో దిగాడు ఆనంద్.


తల్లిదండ్రుల విషయమై భార్యతో గొడవపడి...చెదిరిన మనసుతో వున్న ఆనంద్ కి భార్య నుంచి వచ్చిన ఫోన్ కాల్ ని రిసీవ్ చేసుకోవాలనిపించలేదు.హైటెక్ సిటీ వెళ్లడానికి ఎమ్ ఎమ్టీఎస్ కి టికెట్ కొనుక్కుని...చంకనపెట్టుకున్న హ్యాండిబాగ్ తో ట్రైన్ ఎక్కుతుండగా...ఎవడో చాలా చాకచక్యంగా ఆ బాగ్ ని కొట్టేసాడు.మెరుపువేగంతో అతను మాయమైపోవడం...అన్నీ క్షణాల్లో జరిగిపోయాయి.అప్పటికే ట్రైన్ కదిలిపోవడంతో ఏమీ చేయలేక చూస్తూండిపోయాడు.మళ్ళీ అంతలోనే కీచుమంటూ ట్రైన్ ఆగడం...ఎందుకాగిందో అనుకునేంతలో ఆ వార్త అందరికీ గుప్పుమంది.ఎవడో ట్రైన్ ఎక్కుతూ జారిపడి చచ్చాడని అనుకుంటున్నారంతా.పాపం అనుకున్నాడు ఆనంద్.


కళ్ళముందు ఆరోజు జరిగిన సంఘటన కనిపించేసరికి... ఆ చచ్చిన మనిషిగా తానే గుర్తింపబడ్డాడని అర్థమైంది ఆనంద్ కి.
భార్య కాల్ ని పట్టించుకోకుండా....షర్ట్ జేబులోంచి తీసిన సెల్ ని హ్యాండ్ బాగ్ లో పడేసాడు. ఆ బాగ్ లో సెల్ తో పాటూ ఆధార్ కార్డు,ఎటిఎం కార్డు,డ్రైవింగ్ లైసెన్స్ వగైరా వగైరా కార్డులన్నీ వున్నాయి.చంకన పెట్టుకున్న అలాంటి ముఖ్యమైన బాగ్ ని దొంగ లాక్కెళ్లడం. ..ప్రమాదవాసత్తు అతనే ట్రైన్ కింద పడటంవల్ల...బాగ్ లోని ఆధారాలబట్టి ఆనంద్ గా గుర్తించి రైల్వేపోలీసులు ఫోన్ చేయడంతో... ఆనంద్ చనిపోయాడనే నిర్ధారణకి వచ్చారు.
  
చనిపోయాడనుకున్న ఆనంద్ తిరిగి రావడంతో...నుదుట కుంకుమ పెట్టుకుని...తీసేసిన తాళిని మళ్ళీ భర్తతో కట్టించుకుంది లలిత.
భర్తతో కలిసి అత్తమామల కాళ్ళకి నమస్కరిస్తూ వారి ఆశీర్వాదం కూడా తీసుకుంది.
భార్యతో వచ్చిన మార్పుకి ఎంతో పరవసించిపోయాడు ఆనంద్.
ఆరోజు రాత్రి-భర్త ఒడిలోకి వాలిపోతూ ఎంతో ప్రేమ చూపించింది లలిత."సెల్ ఫోన్ పోయినంతమాత్రాన్న కనీసం ఫోన్ చేయకుండా మానేస్తారా?నా నెంబర్ మీకు నోట్లోనే ఉంటుంది కదా.ఈపదిహేను రోజుల్లో మీకసలు ఫోన్ కూడా చేయాలనిపించలేదా"?భర్త కళ్ళలోకి చూస్తూ గోముగా అడిగింది .


ఆ సమయంలో భార్య అలా అడిగేసరికి...ఏం సమాధానం చెప్పాలో అర్థంకాలేదు ఆనంద్ కి.
నిజానికి సెల్ పోయిందనికాదు.భార్య మీద కోపంతోనే ఫోన్ కూడా చేయకుండా ఆమెను ఏడిపించాలనే అలా చేసాడు. మనసు చల్లబడ్డాకా  ఇక వుండబుద్దికాక వచ్చేసాడు.


ఇంటికి వచ్చేసరికి-పరిస్థితి అంతా మారిపోయి స్వర్గంగా తయారైంది. ఇక ఈ ఇంటికి తీసుకురాలేమనుకున్న తల్లితండ్రులు ఆ ఇంట్లో ఉండటం...భార్య వారినెంతో ప్రేమగా చూసుకోవడం....ఈ పదిహేనురోజుల్లోనే ఎంత మార్పు ...? ఇదంతా నా చావు చూపించిన పరిష్కారమే కదా అనుకుంటూ మనసులో నవ్వుకున్నాడు.


నేను ఫోన్ చేయలేదు కాబట్టి సరిపోయింది.ఫోన్ చేసి ఉంటే ...నేను చనిపోలేదన్న నిజం బయటపడి...నాకు జరపాల్సిన కార్యక్రమాలన్నీ ఆగిపొయి ఉండేవి.అవన్నీ జరిపించాలి కాబట్టి...నా తల్లిదండ్రులు నా గూటికి చేరారు.వారి అండదండల్ని ఈనాటికైనా తెలుసుకుంది నా భార్య- అనుకున్నాడు భార్య నుదుటిపై ముద్దు పెట్టుకుంటూ.
లలిత ఇంకా మరిచిపోలేదేమో....ఫోన్ చేయలేదన్న విషయాన్నే పదేపదే అడుగుతున్న భార్యకు ఏవో కథలు చెప్పేసి...కమ్మగా నిద్రలోకి జారుకున్నాడు ఆనంద్! 
     

-రచన: శానాపతి ప్రసన్నలక్ష్మి(ఏడిద)