Facebook Twitter
నట్టింట్లో విషం పెట్టె

నట్టింట్లో విషం పెట్టె ( తెలుగువన్ ఉగాది కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)

 

 

తన కూతురు జాహ్నవి మేడమీద నుంచి కిందపడింది, ఆసుపత్రిలో చేర్పించారని చెల్లెలు మాధవి ఏడుస్తూ సెల్ ఫోన్లో చెప్పిన  వార్త నా గుండె జారిపోయేలా చేసింది. వెంటనే ఆటో మాట్లాడుకుని ఆసుపత్రికి బయల్దేరాను. దారిలో జాహ్నవిని గురించిన ఆలోచనలు మనసులో సుళ్లు తిరుగుతున్నాయి. దానికి ఆరేళ్లు. థర్డ్ క్లాస్ చదువుతోంది. హైపర్ యాక్టివ్. ఏదైనా ఇట్టే పట్టేస్తుంది. నేనంటే దానికి చాలా ఇష్టం. వాళ్లింటికెళితే ‘పెద్దమ్మా’ అంటూ నన్ను చుట్టేసి ఒకపట్టాన వదలదు. నిజానికి అదంటే నాకూ అంతే. ఒకే ఊళ్లో ఉండడం వల్ల అప్పుడప్పుడూ కలుస్తూనే ఉంటాం. పదిహేను రోజుల క్రితమే వెళ్లొచ్చాను. ఇంతలో ఈ సంఘటన. పాపం ఎన్ని దెబ్బలు తగిలాయో ఆ లేత శరీరానికి, అసలా పిల్ల పరిస్థితి ఎలా ఉందో. ఆ ఆలోచనకే ఒళ్లు జలదరించింది. ఆలోచనల్లో ఉండగానే ఆటో ఆసుపత్రికి చేరుకున్నట్టు డ్రైవర్ చెప్పడంతో దిగి అతనికి డబ్బిచ్చిఆసుపత్రిలోకి వేగంగా అడుగులేశాను.


పాప మూడో అంతస్తులోని పి ఐ సి యు ఉందన్న విషయం రిసెప్షన్ లో తెలుసుకుని మెట్లమీదుగా పరిగెత్తుకుంటూ అక్కడికి చేరుకున్నాను.


నన్నుచూడగానే ఏడుస్తూ నా వైపు వచ్చి "చూడవే..నా..చిట్టి తల్లి" అని పి ఐ సి యు వైపు చూపించింది.
"పాపకేం కాదు, నువ్వు కంగారు పడకు" అని ఊరడించి ’శ్రీకర్ ఎలా జరిగిందిది?" అక్కడున్న కుర్చీలో నిస్త్రాణగా కూర్చుని ఉన్న మా మరిదిని అడిగాను.


"ఏమో, ఎలా జరిగిందో నాకూ తెలియదు. ఆఫీసుకు ఫోనొస్తే హుటాహుటిన వచ్చేశాను"అన్నాడు.
"నేను.. ఇల్లు.. సర్దుకుం..టున్నానే..ఉన్నట్టుండి పెద్ద.. శబ్దం వినిపించింది. బయతకు వెళ్లి చూద్దు..ను కదా..రక్తం మడుగులో..అది.."ఇహ చెప్పలేక వెక్కి వెక్కి ఏడవసాగింది.


"అదేంటి? డాబాపైన చుట్టూ పిట్టగోడ ఉంటుంది కదా. పాప దానికి ఆనుకుంటే కూలిపోయిందా?"అడిగాను.
"లేదు..అదొక్కతే నేల... మీద పడింది, సిమెంటు పెళ్లలు..మట్టీ ఏం లేవు."అంది.


నాకు ఆశ్చర్యం అనిపించింది. పోనీ ఆ పిట్టగోడ ఎక్కి అందుకోబోయి పడిపోయిందనుకుందామంటే-వాళ్ల డాబాకానుకుని కాయలు, పళ్లతో ఉన్న చెట్లేం లేవు. 


"పోనీ స్నేహితులెవరన్నా తోసెయ్యడం..లాంటివి" అనుమానంగా అడిగాను. 
"చ..ఛ..చదువుకుంటానని చెప్పి అదొక్కతే పైకెళ్లింది .."చెప్పింది.
నా ఆలోచనలు ఒక కొలిక్కి రావడం లేదు. ఇంక ప్రశ్న లేయడం సరికాదని "సర్లే..జరిగిందేదో జరిగిపోయింది. పీడ ఏవన్నా ఉంటే పోతుంది." అన్నాను.
అప్పుడే బైటకొచ్చిన డాక్టర్ ‘దెబ్బలు బాగా తగలడం వల్ల.. ట్రీట్మెంట్ జరుగుతోందని...ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే తప్ప ఏం చెప్పలేమని’అన్నాడు.


అది విని మళ్ళీ ఏడవడం మొదలెట్టింది మాధవి. 
"ఇక్కడ ఏడవకూడదమ్మా"అంది అటుగా వచ్చిన నర్స్.
నేను తనని కొద్దిదూరం తీసుకెళ్లి అక్కడ ఉన్న స్టీల్ బెంచ్ మీద కోర్చోబెట్టి..ఊర్కోబెట్టే ప్రయత్నం చేశాను.                                              

మూడ్రోజులు ఐ సి యూలో, వారం రోజులు జనరల్ వార్డ్ లో ఉంచి జాహ్నవిని డిస్చార్జ్ చేశారు.
అది ఆసుపత్రిలో ఉన్నంత కాలం మాకు కాలం చాలా భారంగా సాగింది. మనసంతా దిగులు. ఏదీ తినబుద్ధి కాలేదు. నిద్రపోలేదు.
ఇంటికొచ్చాక పిల్లకు దిష్టి తీసింది మాధవి. ’ఎవరి కళ్లు పడ్డాయో మృత్యుముఖం చూసొచ్చింది పిచ్చిది..’ జాహ్నవిని గట్టిగా కౌగలించుకుని ఒళ్లంతా ముద్దులెట్టుకుంది మాధవి.
పిల్లలున్నదాన్ని నాకూ తెలుసు కన్నప్రేమ, కడుపు తీపి. కళ్లలో నీళ్లు నిలిచాయి.


పదిహేను రోజులైంది పాప ఆసుపత్రి నుంచి డిస్చార్జ్ అయి.
జాహ్నవి ఎందుకో మాధవితో ముభావంగా ఉంటోంది.
నేను ఇంటికెళ్లకుండా దాదాపు అక్కడే ఉన్నాను. జాహ్నవి నన్ను వదలడం లేదు.
ఒకరోజు-
"అక్కా..పిల్ల చక్కగా ఆరోగ్యంగా ఇంటికిరావాలని అమ్మవారికి మొక్కుకున్నాను. మొక్కు తీర్చుకొస్తాను. కాస్త దాన్ని జాగ్రత్తగా చూసుకో" అని మాధవి గుడికెళ్లింది.
నేను దానికి చందమామలోని కథ చదివి వినిపిస్తున్నాను. అంతలో హఠాత్తుగా జాహ్నవి నావైపు తిరిగి "పెద్దమ్మా..నేను డాబా పైనుంచి జారి పడలేదు" అంది.


నేను గతుక్కుమన్నాను. అది కాస్త కోలుకున్నాక ఆ విషయం నేనే కదుపుదామనుకున్నాను. కానీ ఇవాళ అదే చెప్పబోతోంది. నాకు ఉత్కంఠగా ఉంది. కానీ అది పైకి కన్పించనీయకుండా "మరి" అన్నాను ఆశ్చర్యంగా కళ్లు పెద్దవి చేసి.
"నువ్వెవరికీ చెప్పకూడదు. అమ్మానాన్నలకు కూడా, ఒట్టేయి" అని లేత తమలపాకులాంటి చేయి నా ముందు చాచింది.
నేను ఒట్టేశాను.


"ఆత్మహత్య చేసుకుందామనుకున్నాను" అంది.
నేను గతుక్కుమన్నాను. ఆత్మహత్యలు తెలిసే వయసా అది? అసలు ఆత్మహత్య అంటే దానికెలా తెలిసింది?
"ఎందుకు ఆత్మహత్య చేసుకుందామనుకున్నావు" దగ్గరకు తీసుకుని అనునయంగా అడిగాను.
"మరి..మరి..అమ్మా ఆరోజు స్కూలు మానతానంటే, తిట్టి పంపింది. స్కూలునుంచి ఆఫ్టర్ నూన్ థ్రీవో క్లాక్ వచ్చాక, బజ్జీలు చేసిపెట్టమంటే పెట్టలేదు. నేను మళ్లీ మళ్లీ అడిగితే..ఏంటి అల్లరి చేస్తున్నావ్..అని కొట్టింది. డాడీకి కూడా చెబుతానంది. నాకు ఏడు పొచ్చేసింది. పుస్తకాలు తీసుకుని డాబా మీదకెళ్లాను. అప్పుడొచ్చింది ఐడియా. ఆత్మహత్యచేసుకోవాలని. అందుకే దూకేశా?" అంది.


నా కళ్లలో నీళ్లు తిరిగాయి. పిచ్చిపిల్ల.. అమ్మ.. ప్రేమతో అదిలిస్తే, కోపం అనుకుంది. ప్రాణం తీసుకోవాలనుకుంది. ఎంత ప్రమాదం తప్పింది. దాన్ని మరింత దగ్గరకు తీసుకుని గుండెల్లోపొదువుకున్నాను.
"అవును ఆత్మహత్య నీకెలా తెలుసు?’అడిగాను గుండెలు గుబ గుబ లాడుతుండగా.
"టీ వీ సీరియల్లో చూశాను. అందులో ఓ అమ్మాయిని అందరూ తిడితే ఇలాగే ఇంటి పైకెక్కి దూకేస్తుంది."అంది.


అదీ సంగతి. నట్టింట్లో కొలువుండే విషం పెట్టెలు ప్రోగ్రాముల పేరుతో అందరి మనసుల్లో విషం గుమ్మరిస్తున్నాయి. ఆబాలగోపాలం మనసుల్ని విరిచేస్తున్నాయి. అనుమానాలు, అసూయలు, ద్వేషాలూ నూరిపోస్తున్నాయి.  చెడు వింటున్నాం, కంటున్నాం, అంటున్నాం. హృదయల్లో ముద్రించుకుపోయే టీ వీలో వచ్చే పాత్రల దుశ్చర్యలు మన ద్వారా బహీర్గతం అవుతున్నాయి. కుటుంబాలకు కుటుంబాలు తమకు తెలియకుండానే కూలిపోతున్నాయి. అన్ని మహామ్మారులను తుదముట్టించినట్టుగానే దీన్నీ సామూహికంగా తరిమికొట్టాలి లేకపోతే మానవ సంబంధాలు మంట గలిసిపోతాయి. 


"అమ్మ చాలా మంచిదమ్మా..చూడు నీకు ఆయొచ్చి హాస్పిటల్లో ఉంటే అన్నం తినలేదు. నిద్రపోలేదు. ఇప్పుడేమో..నువ్వు చక్కగా ఇంటికొచ్చావు కదా అందుకని పాపం పొద్దుటే గుడికి వెళ్లింది. నువ్వు బుల్లపాపాయివి కదా అందుకని నువ్వంటే నాకూ..అమ్మకూ..నాన్నకూ అందరికీ ఇష్టమే..ఇంకెప్పుడూ ఇలా చేయకు సరేనా?"అన్నాను.
నవ్వుతూ "సరే"అంది.


కాసేపటికి మాధవి వచ్చి ‘అరే బుజ్జిపిల్ల నవ్వుతోందే’ అంటూ వచ్చి పాపని ముద్దు పెట్టుకుంది. జాహ్నవి కూడా తల్లి వంక నవ్వుతూ చూడ్డంతో నా మనసు తేలికపడింది.
కొంతసేపయ్యాక జాహ్నవి నిద్రపోయింది. అప్పుడు మాధవిని దూరంగా తీసుకెళ్లి నేను అసలు విషయం చెప్పకుండా "అర్జంటుగా ఇంట్లోనుంచి టీ వీ తొలగించేయండీ..పిల్ల చక్కగా చదువుకుంటుంది. మొక్కై వంగనిది మానై వంగదన్నది నీకు తెలుసుకదా..ఇప్పటినుంచే టీ వీ కి అడిక్ట్ కాకుండా దాన్ని జాగ్రత్తగా చూసుకో..దాని భవిష్యత్తు బావుంటుంది. ఇహ నేను వెళతాను’అని ఇంటిదారి పట్టాను. 

 

*****

-ప్రతాప సుబ్బారాయుడు