Facebook Twitter
మూడు‘ముళ్ళ’బంధం

మూడు‘ముళ్ళ’బంధం (తెలుగువన్ ఉగాది కథలపోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)

 

 

వివాహమంటే విడదీయరాని బంధమే, అయినా ఇద్దరు వ్యక్తుల్ని జీవితకాలంపాటు కట్టి వుంచడానికి ఒక దారాన్ని ఆధారంగా చేయడం నిజంగా ఆశ్చర్యమే. పసుపుతాడుకు పవిత్రతను ఆపాదించి బతికి వున్నంతకాలం ఆ చట్రంలోనే తిరగమని నిర్దేశించడం ఆశ్చర్యాన్ని దానితో పాటు విస్మయాన్ని కూడా కలిగిస్తుంది. ఇలా అంటున్నానని మంగళసూత్రం మీదా, మాంగళ్యబంధం మీదా నాకేదో వ్యతిరేకభావం ఉండని అర్థం చేసుకోవద్దు. మనువుతో తనువులు మాత్రమే కాదు మనసులు కూడా కలుస్తాయి. సంతానం వృద్ధి చెందుతుంది. కుటుంబం సంఘ జీవనంలో భాగస్వామిగా మారుతుంది. సక్రమమైన దారిలో పిల్లల్ని పెంచుకుంటూ వారికి దిశానిర్దేశం చేస్తూ కుటుంబ అభివృద్ధికి తద్వారా సంఘాభివృద్ధికి తోడ్పడాలనే మహదాశయం మంగళసూత్రం వెనుక దాగిఉందనే విషయం నాకెప్పుడూ గుర్తొస్తూనే ఉంటుంది.   

 

అంతేకాదు, ఒకరి ఇష్టాయిష్టాల్ని ఒకరు నెరవేర్చుకుంటూ, ఒకరి కష్టనష్టాలను మరొకరు పంచుకుంటూ ఒకరికొకరు తోడూనీడగా వుండే వివాహబంధమంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు? కానీ కొన్ని జంటల్ని చూసినప్పుడు వాళ్ళు భార్యాభర్తలేనా అన్న సందేహం కలగక మానదు. మాట్లాడుకోవడం కంటే పోట్లాడుకోవడంలోనే తనివితీరని ఆనందాన్ని అనుభవిస్తుంటారు. దానికి కారణాలేవైనప్పటికీ, ఒకరికొకరు బాసటగా నిలవాల్సిన వారు ఒకరంటే ఒకరికి సరిపడని ఉన్మాదస్థితిలో బతుకుతుంటారు. మూడుముళ్ల బంధాన్ని కొనసాగిస్తున్నంత కాలం ‘ముళ్ళ’మీదే ఉన్నట్లుగా జీవిస్తూ పవిత్రమైన వైవాహిక బంధాన్ని అలుసుగా తీసుకుంటారు. పాము-ముంగిసల్లా, పిల్లి-ఎలుకల్లా ఒకర్నొకరు నిందించుకుంటూనో, చిన్నచిన్న కారణాలను పెద్దవిగా చేసుకుని ఆధారంగా ఉన్న దారాన్ని పుటుక్కున తెంచుకోవాలనే తొందరపాటులోనో కొన్ని జంటలు అలుపెరగకుండా శ్రమిస్తూ ఉంటారు. సాన్నిహిత్యం స్థానంలో సంపాదనకే పెద్దపీట వేయడం, సర్దుబాటు చేసుకోవడంలో సమర్ధత చూపించలేకపోవడం ఈ బంధాన్ని మరింత బలహీనపరుస్తుంది.  పెద్దల్ని ఎదిరించి ప్రేమించి పెళ్లి చేసుకున్న నా స్నేహితులు మహేష్, కిరణ్మయిల పరిస్థితి కూడా ఇప్పుడు అలాగే వుంది.  

                                                       

                                                                    ***                      

నేను వెళ్ళేసరికి ఇల్లు యుద్ధరంగంలా ఉంది. అప్పటివరకూ పొరాడి అలసిపోయిన సైనికుల్లా మహేష్, కిరణ్మయిలిద్దరూ చెరోవైపూ కూర్చున్నారు తలలు పట్టుకుని. పీక్కుపోయిన ముఖం, రేగిపోయిన జుట్టు, ఎరుపెక్కిన కళ్ళు అక్కడి యుద్ధ వాతావరణాన్ని చెప్పకనే చెప్తున్నాయి. కనీసం తలుపు కూడా వేసుకోవడం మర్చిపోయి తగువు పడినట్లు న్నారు. అప్పటివరకూ లోపల జరుగుతున్న తంతంతా బయటినుండి గమనిస్తున్న పక్క పోర్షన్ వాళ్ళు నేను రావడం గమనించి ఏదో పని వున్నట్లు లోపలికి వెళ్లసాగారు. మనింట్లో ఎన్ని గొడవలున్నా వాటిని బయటివారికి తెలియకుండా జాగ్రత్తపడతాం. కానీ పక్కింట్లో గొడవ జరుగుతుంటే మాత్రం దాన్ని ఇంకొంతమందికి చెప్పి ఆ ఆనందాన్ని తనివితీరా అనుభవిస్తుంటాం. లోకాన్ని ఎలా అంచనావేయాలో, ఎలా అర్థం చేసుకోవాలో ఒక్కోసారి ఊహకు కూడా అందదు.                                             
నేను వచ్చానన్నట్లుగా ఒకసారి చిన్నగా దగ్గి లోపలికి వెళ్ళి మూలగా వున్న ఒక కుర్చీ లాక్కుని దానిలో కూర్చున్నాను. ఇదివరకు ఎంత తగువులాడుకున్నా నేను వెళ్ళేసరికి కనీసం పలకరించి తాగడానికి కాసిని మంచి నీళ్లిచ్చేవాళ్లు. ఇప్పుడున్న వాతావరణంలో మర్యాదనాశించడం మానసికంగా సాహసం అవుతుంది కనుక ఏమీ మాట్లాడ కుండా మౌనంగా ఉండిపోయాను. ఇల్లంతా చిందరవందరగా వుంది.  వీళ్ళ యుద్ధానికి చేతులు సరిపోయినట్లు లేవు. వస్తువులన్నీ సగం విరిగి కొన్ని, పూర్తిగా విరిగిపోయి మరికొన్ని యుద్ధంలో చనిపోయిన సైనికుల్లా అక్కడక్కడా చెల్లా చెదురుగా పడిపోయివున్నాయి.                       

                 
ఎవరు మట్టుకు వాళ్ళం ఏమీ మాట్లాడకుండా మౌనంగా వుండిపోయాము. నిశ్శబ్దాన్ని భరించడం ఎంత నరకమో నాకు ఆ క్షణం మరింత అర్థమైంది. కాసేపటి తర్వాత మౌనాన్ని త్యజిస్తూ “ఏమిట్రా ఇది... ఇద్దరూ చదువు కున్నారు, మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. అయినడానికీ కానిదానికీ ఇలా గొడవపడితే నలుగురి మధ్యా ఎంత చిన్న తనంగా ఉంటుందో ఆలోచించారా...?” అన్నాను.      

                           
“నాక్కాదు దానితో చెప్పు ఆ సంగతి. ఉద్యోగం చేస్తున్నానని పొగరు...” బుసలుకొడుతూ అన్నాడు  మహేష్.     “నాకేం అక్కర్లేదు. ప్రతీదానికీ గొడవే. ఆయనకే పెట్టండన్నయ్యా కాస్తంత గడ్డి...” అంది కిరణ్మయి. “ఇదిగో ఇలాగే మాటకు మాటా సమాధానం చెప్తోంది.  ఇలాగైతే కష్టం. దీనితో ఉండలేను...” అన్నాడు.  “అవునవును మరి. నేనే నిన్ను పట్టుకుని వేళ్లాడుతున్నాను. నాకు బతకడం చేతనవుతుందా మరి? నేనేమీ నీ తిండి తిని బతకడం లేదు. నా జీతం నేను సంపాదించుకుంటున్నాను....” మాటకు మాటా అంది కిరణ్మయి. పెళ్ళయి సంవత్సరమైనా ఇంకా చిన్నపిల్లల్లాగే మాట్లాడుతున్న వాళ్ళిద్దరినీ చూస్తే ముందు జాలేసింది, తర్వాత బాధేసింది.

పెళ్ళైన కొత్తలో వచ్చే సర్దుబాట్లకు సతమతమవుతూ ఎంతమంది భార్యాభర్తలు తమ కాపురాలను ఎలా పాడుచేసుకుంటున్నారో అనే ఆలోచన రాగానే మనసంతా దిగులుగా అయిపోయింది. అందుకే ఇద్దర్నీ ఉద్దేశిస్తూ “నాలుగు రోజులు కలిసుండి ఎవరి దారిన వాళ్ళు వెళ్లిపోవడానికి మీదేమీ కాంట్రాక్టు ఉద్యోగం కాదు. మూడు ముళ్ల తోనూ, ఏడు అడుగులతోనూ ముడిపడిన బంధం. ఇద్దరూ కూర్చుని సమస్యల్ని పరిష్కరించుకోవాలిగానీ ఇలా మీరిద్దరూ కలిసి కొత్త సమస్యల్ని సృష్టించుకోకూడదు...” అన్నాను. 
                                
“అంటే ఏంట్రా నువ్వు చెప్పేది... ఎన్ని గొడవలొచ్చినా సర్దుకుపోయి సన్నాసుల్లా బ్రతకమంటావా? అది నా వల్ల కాదు, నాకా ఖర్మ కూడా పట్టలేదు...” అటో ఇటో తేల్చుకోవాలనే ఆలోచన బలంగా వినిపించింది మహేష్ మాటల్లో.     “మరేం చేస్తావు...” కొంచెం కోపంగానే అడిగాను.         

                        
“విడిపోయి ఎవరిదారి వాళ్ళు చూసుకోవడమే. కలిసుండి ప్రతీరోజు గొడవపడేకన్నా దూరంగా వుండి ఎవరి గొడవ వాళ్ళు చూసుకోవడమే బెటర్ కదా...”     
                                
“చాలా బాగుంద్రా నువ్వు చెప్పేది.  ఏమ్మా నువ్వేమంటావు?”  అన్నాను చిన్నగా నవ్వుతూ. “ఆయనకు అవసరం లేని సంసారం నాకు మాత్రం ఎందుకన్నయ్యా. నేను బతకలేయినా?” అంది కోపంగా. “బావుందమ్మా... చాలా బావుంది. నేను వచ్చినప్పటినుండీ నేను, నాది అంటున్నారే తప్ప ఒక్కరన్నా మనది అనలేదు. మనది కాదు అనుకున్నదంతా పరాయిగానే అనిపిస్తుంది, కనిపిస్తుంది. మనది అనే భావం ఇద్దరిలోనూ లేదు కాబట్టే వైవాహిక జీవితాన్ని ఇంత తేలికగా తీసిపారేస్తున్నారు. మామూలు దారానికి మరో దారాన్ని జతచేసి మంగళ సూత్రం తయారుచేస్తారమ్మా. ఒక దారానికి మరో దారం తోడుండాలి కాబట్టే ఆ ఏర్పాటు. చేప నీటిలో ఉన్నంతసేపే దానికి అందం, ఆనందం. అలా కాకుండా దాన్ని బయట వేస్తే దాని ప్రాణాలకే ప్రమాదం కలుగుతుంది.

భార్యాభర్తల బంధానికి ఒక అర్థాన్ని, పరమార్థాన్ని కలిగించింది ఈ సంఘం. ఆ బంధాన్ని గౌరవించి అందులో ఉన్నంతవరకే మీకు విలువా, గౌరవం ఉంటాయి తప్ప ఎవరికి వారుగా విడిపోయి బతకాలనుకుంటే ఆ బంధం అపహాస్యం పాలౌతుంది. అందుకే చెప్తున్నా... మీకు పెళ్ళిచేసిన పెద్దలున్నారు. అంతగా అవసరం అనుకుంటే ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్లున్నాయి. మీ సమస్యను వాళ్ళముందుంచండి. జబ్బు చేస్తే మందేసుకోవడానికి చూడాలి కానీ అసలు జబ్బే రాకుండా ఉండాలని కోరుకోవడం మంచిది కాదు. సమస్యలకు పరిష్కారం చచ్చిపోవడమో, విడిపోవడమో కాదు.  సముద్రానికి అలలు, సంసారానికి కలతలు సహజంగా వచ్చే ఆటుపోట్లు. సర్దుకుపోతూ అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవడానికి ప్రయత్నించాలి గానీ సమస్యల్ని పెద్దవి చేసుకుంటూ సతమతమైపోకూడదు.  నేను చెప్పవలసింది చెప్పాను. ఆ తర్వాత మీ ఇష్టం...” అంటూ వాళ్ళిద్దరి వైపూ ఒకసారి చూశాను.     

ఇద్దరిలోనూ ఏదో ఆలోచన మొదలైనట్లుంది. నాలో నేను నవ్వుకుంటూ కుర్చీలోంచి పైకి లేచాను వెళ్తాననన్న ట్లుగా. అప్పటివరకూ ముక్కు చీదుకుంటూ మూల కూర్చున్న కిరణ్మయి నేను పైకి లేవడం చూసి తనూ పైకి లేచింది ఒక్కసారిగా. ఇంత చెప్పినా వినకుండా ఇంటికి వెళ్లడానికి బట్టలు సర్దుకోవాలని లేచిందేమో అని కంగారుపడ్డాను నేను కాసేపు. నా ఆలోచనల్లో నేనుండగానే “అన్నయ్యా... కాసేపాగండి టీ తాగి వెళ్దురుగానీ.  ఈ టైంలో టీ తాగకపోతే మహేష్ తలనొప్పి అంటాడు మళ్ళీ...” అంటూ వంటింటి వైపు వెళ్లసాగింది. ఈ మాత్రం దానికి ఇంత రచ్చ చేసు కోవడం దేనికో అనుకుంటూ నాలో నేనే నవ్వుకుంటూ టీ కోసం కుర్చీలో కూలబడ్డాను.                                      

 

-డా. జడా సుబ్బారావు