Facebook Twitter
కాంతి (అల్లూరి [గట్టు] నరసింగరావు స్మారక కథలపోటీ లో తృతీయ బహుమతి)

కాంతి (అల్లూరి [గట్టు] నరసింగరావు స్మారక కథలపోటీ లో తృతీయ బహుమతి)

ఉదయం ఎనిమిది కావస్తూంది..!
“రేపు మధ్యాహ్నం ఢిల్లీ వెళ్లాల్సిన పని పడింది. ఎల్లుండి రాత్రిక్కానీ రాను. ఎల్లుండి ఉదయం కోర్టులో వాయిదా ఉన్న కేసు తాలూకు అప్ డేట్స్ గురించి మాట్లాడాలి. రేపు తొమ్మిదింటికల్లా నువ్వు ఆఫీసులో ఉంటే... “ అని రాత్రి బాగా పొద్దు పోయాకా ఫోన్లోనే హుకుం జారీ చేసాడు సీనియర్. 
అందుకే తెల్లారగట్త నాలిగింటికే లేచి అన్నిపన్లూ పూర్తి చేసుకుని, అట్నించి అటే కోర్టుకి కూడా వెళ్లిపోవచ్చని లంచ్ బాక్స్ , అవసరమైన ఫైల్ తీసుకుని కైనిటిక్ హోండా బయటికి తీసాను.
బండి స్టార్ట్ చేయ్య బోతూ.. ఎప్పట్లానే మనసులో ఒకట్నించి అంకెలు లెక్కెట్టుకుంటూ నన్ను నేనే మనసుతో ఒళ్లంతా తడుముకున్నాను. ఇంట్లోంచి బయటికి బయల్దేరే ముందు ప్రతి సారీ నేను చేసే పనది. ఫోన్లోనే కాదు స్పీడ్ డయల్.. నాకు పనుల్లో కూడా.  


డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్ పేపర్స్, పొల్యూషన్ సర్టిఫికెట్, ఏటిఎం కార్డ్, పాన్, బార్ లైసెన్స్, కోటు, కళ్లజోడు, స్కార్ఫ్, హెల్మెట్, లంచ బాక్స్, ఫైల్స్ ఇలా ఒక్కో దానికీ ఒక్కో నంబర్. ఇవన్నీ రోజూ కూడా ఉండాల్సిందే. ఏ ఒక్కటి మర్చిపోయినా మూల్యం చెల్లించుకోక తప్పదు. ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎందుకు ఏ సమస్యవస్తుందో ఎవరికీ తెలియదు. అందుకే మన జాగ్రత్తలో మన ముంటే మంచిదని సెల్ప్ సణుగుడు. 
అలవాటైపోయిందేమో.. అలవోకగా పెదాలు పలికేస్తుంటే మనసు వెతికేస్తూ ఉంటుంది వేటి స్దానాల్లో అవున్నాయా, లేదాని. ఈ విషయంలో నాకు ఫాలోయర్స్ కూడా ఎక్కువే. మంచని పిస్తే అంతే కదా..! 
అన్నీ ఉన్నాయనుకున్నాకా.. బండి స్టార్ట్ చేసాను.
ఎలాగైనా ఆ కేసు గెలవాలని సీనియర్ పట్టుదలగా ఉన్నాడు. అతను చెప్పేవి బాగా మనసు కెక్కించుకోవాలి. 
అవసరమైతే రాత్రంతా కూడా దాని మీదే కూర్చోవాలి. ఆలోచిస్తూ నే బండి నడుపుతున్నాను. 


నెమ్మదిగా అరవైకి చేరువవుతూంది బండి. ఎంత అర్జంటు పనున్నా స్పీడోమీటర్ని ఎప్పుడూ అంతకి మించి దాటనీయను. నా జీవితం కంటే నాకేదీ ముఖ్యంకాదు కదా..! 
డ్రైవింగ్లో ఉన్నప్పుడు ప్రధాని ఫోన్చేసినా ఎత్తను. అవును మరి నా కేదైనా అయితే ఆయన నా వాళ్లకి డబ్బులివ్వగలరు గానీ నన్ను తెచ్చివ్వలేరు గదా..! 
బొల్లారం దాటి బాచుపల్లికి వెళ్తూండగా బస్టాపుకి దగ్గర్లో ఎడం వైపు ఏదో గుంపు. చుట్టూ నిలబడి అక్కడ దేన్నో చూస్తున్నారంతా. అందరి ముఖాల్లో రవ్వంత అలజడి. ఏం జరుగుతూందక్కడ??  
సహజ సిద్ధమైన ఆసక్తితో బండాపి, కుడి కాలు నేల మీదాన్చి “ ఏమైంది?” అనడిగాను అక్కడున్న ఒకబ్బాయిని.
చాలామందిలో చెప్పాలని ఆసక్తి ఉంటుంది. అది చాలా సార్లే గమనించాను. కొన్ని కొన్ని సార్లు అత్యాసక్తితో అవసరాన్ని మించి కూడా చెబుతూంటారు వినే ఓపిక ఉండాలే గానీ..!  


నాకు ఒక్కోసారి అనుమానం వస్తుంది
“నేను అమ్మాయిని కాబట్టి ఇంతలా చెబుతున్నారా? ఏ ముసలాళ్లయినా అడిగినా కూడా ఇలాగే చెప్తారా?“ అని. ఏదేమైనా చెబుతున్నారు కదా..! మానవసంబంధాల పెరుగుదలకు అదీ మంచిదేలే. 
అతనే దోచెప్తూనే ఉన్నాడు.
ఇంతలో ఎవరో అమ్మాయి రోదిస్తున్న శబ్ధంతో పాటు .. “ఏడవకమ్మా..! నిన్న నీ ఫ్రండ్ కి జరిగిందని ఇవ్వాళ నీకు జరగాలనేముంది? పోనీ బండి మీద దింపుతాము రమ్మంటేనేమో రానంటావ్..! బస్సు లేమో రావటంలేదు. వెధవది పరీక్షల టైములో నన్నా సమయానికి వచ్చి చావరు. ఏం చేద్దాం ?”  బస్సు వస్తుందో లేదో నని దూరంగా తల తిప్పి చూస్తూ అంటున్నారెవరో. 
“నువ్విలా ఏడిస్తే ఆ టెన్షన్లో చదువుకున్నది కూడా గుర్తుండదు. ఈ కుర్రాడు తీసుకెళ్తానంటున్నాడు కదా? ఏడ్చేకంటే ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే బెటరు. అవతల టైమై పోతుంది కదా.. పోనీ ఆటో మీద వెళ్ళిపో..” ఎవరెవరో ఏదేదో సలహాలిస్తున్నారు. ఆ అమ్మాయి మాత్రం వెక్కెక్కి పడుతూనేఉంది.
విషయం అర్ధమైపోయింది నాకు. 


ఇంటర్ పరీక్షలు తొమ్మిదింటికి మొదలవుతాయ్. ఎనిమిదిన్నర కల్లా అంతా హల్లోకి వెళ్ళిపోయి హాల్టికెట్స్  సబ్మిట్ చేసెయ్యాలి. ఓ యెమ్మార్ పూర్తి చెయ్యాలి తొమ్మిదింటికి ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్షకి హాజరవ్వనీయమని పత్రికల్లోనూ, పేపర్లలోనూ ఊదరగొడుతున్నారు అధికార్లు. పేద్ద… వాళ్లేదో ఆఫీసులకి టైముల కెళ్ళిపోతున్నట్టునట్టు.. వెధవఫోజూ, వీళ్ళూను. 
ఆలోచిస్తూనే అసంకల్పితంగా టైము చూసాను. ఎనిమిందింపావు.
“సార్తొమ్మిదింటికి కదా నన్ను అక్కడ ఉండమన్నది. పర్లేదులే ..! ఇంకాటైముంది. ఈ లోపు వెళ్ళిపోగలను. ముందు ఈ అమ్మాయి సంగతేంటో చూద్దాం ”మనసులో అనుకుని బండిని కొంచెం ముందుకి పోనిచ్చి ఒక పక్కగా పార్క్ చేసి హెల్మెట్ తీసి చేత్తో పట్టుకుని అటుగా నడిచాను.  దగ్గర్నించి చూద్దును గదా!  చూడబోతే చాల పేద అమ్మాయిలాగా తెలుస్తూనే ఉంది. 


ఇక్కడే ఎనిమిందింపావు అయ్యింది. ముప్పావు గంటలో ఎర్రగడ్ద వెళ్లాలి. ఏడున్నరకే బస్టాపుకు  వచ్చిందట. అప్పట్నించీ ఒక్క బస్సూ రాలేదట. 
ఒకటే ఏడుపు. ఏడుస్తూనే చెబుతూంది. ఆమె ఏడుపు చూస్తుంటే ఈ అధికార్ల మీద పిచ్చి కోపం వచ్చింది నాకు. 
ఏడాది పాటు చదివిన చదువంతా సమయానికి వెళ్లకపోతే పోయినట్తే.! మళ్ళీ కష్టపడి చదవాలి. అసలు నన్నడిగితే ఇంత టెన్షన్లో వాళ్లకి రాయాలన్నా ఏం గుర్తుంటుంది? ఏడాదంతా కష్టపడేది అక్కడ పర్ ఫారం  చెయ్యటానికే గదా?పరీక్షకి ఫీజు కట్టిమరీ వెళుతున్నారు. అలాంటప్పుడు కావాలని లేటెందుకు చేస్తారు? ఎన్నో ఒత్తిడుల నడుమ నిద్రాహారాల్లే కుండా చదువుతారు పిల్లలు? పైగా తోటివాళ్లతో పోటీ ఒకటి ఉండనే ఉంటుంది. 
ఆలస్యంగా వెళ్లే వాళ్లు తక్కువ శాతం మందే ఉన్నా, పొరపాటున వెళ్ల లేకపోతే, ఇక ఆ రోజుకి ఆ పరీక్ష వ్రాయ లేకపోతే ఆ నిస్పృహలో దేని కైనా ఒడిగడితే ఎంత మంది బాధపడాలి? బాధ మాట అటుంచి ఒక నిండు ప్రాణం బలై పోదా?! ఎవరు బాధ్యత వహిస్తారు దీనికి? 


నిబంధనలు అవసరమే. కానీ ఒక విధ్యార్ధి భావి జీవితాన్ని ఫణంగా పెట్టేంత కఠిన నిబంధనలు అవసరమా? ఏ నిబంధనైనా విధ్యార్దికి ఉపయోగపడేలా ఉండాలే తప్ప వాళ్ల జీవితాలకి చేటు చేసేదిలా ఉండకూడదు కదా? ఆ విషయానికొస్తే ఎవరు ఏ నిబంధనలని పాటిస్తున్నారని? సరిపడినంత స్టాఫ్ కానీ నాన్  టీచింగ్  గానీ ఉంటున్నారా కాలేజీల్లో? లైబ్రరీలుండాలి. ఉంటున్నాయా? ప్లేగ్రౌండ్ల సంగతి సరేసరి. పిచ్చిగ్గూళ్ల ల్లాంటి అపార్ట్మెంటుల్లో స్కూళ్ళూ, కాలేజీలూ. వీళ్ళెవరూ పాటించని నిబంధనలు పాపం పిల్లలు మాత్రం పాటించి తీరాలి.


ఆలస్యం అయ్యిందంటే అందుకు సవా లక్ష కారణాలుంటాయి. అందరూ కార్లల్లోనూ, బళ్లమీదా, కేబు ల్లోనూ, ఆటోల్లోనూ రాలేరు కదా..! బస్సుల్లో వచ్చే వాళ్లని కూడా దృష్టిలో పెట్టుకోవద్దా!  పైగా పరీక్షలకి ముందు, టీచర్లు పిల్లల్తో సమయానికి పరీక్షా కేంద్రాలకి వెళ్ళండని పదే పదే చెబుతుంటారు కూడా. కావాలని ఎవ్వరూ ఆలస్యంగా వెళ్ళి తమ జీవితాన్ని తామే నాశనం చేసుకోరు కదా?ఒక్క ఏడాది ఒక్క నిమిషం ఆలస్యం వల్ల ఒక్క విద్యా సంవత్సరం కోల్పోతే,  ఏడాదికి లక్షల్లో దిగుమతవుతున్న ఎంత మందితో పోటీపడాలి ఏ విషయంలో నైనా? పైగా వచ్చే ఏడాది ఇదే సిలబస్ ఉంటుందని గ్యారంటీ ఏమైనా ఉంటుందా?   ఎందుకాలోచించరు వీళ్లంతా? 


క్షణంలో వేన వేల ఆలోచనలు నాలో..!
అయినా ఈ నిబంధనలు పెట్టే అధికారులు ఆఫీసులకి సరైన టైములకి వెళుతున్నారా? ప్రతి రోజూ ఆలస్యంగా వెళ్లినందుకు కాళ్ల, వేళ్లా బడ్దా పరీక్ష రాయనివ్వలేదని ఏడుస్తున్న వాళ్లెంత మందిని గురించో టీవీల్లో చూపిస్తున్నారు, పేపర్లల్లో రాస్తున్నారు. వాళ్లెందుకంత బాధపడాలి? ఆ మాత్రం టైం  సేన్స్ ఎందుకుండదు పిల్లలకి? అర్ధం చేసుకోవాలి కదా..
ఆ అమ్మాయి పడుతున్న బాధని చూస్తుంటే అంతకంతకీ నాలో ఉప్పొంగుతున్న ఆవేశాన్ని అదుపులో ఉంచుకుని సీనియర్తో ఈ విషయం గురించి సీరియస్గా చర్చించాలి.. అనుకున్నాను మనసులో.

లోలోన రగులుతున్న ఆలోచన్లని పక్కన పెట్టి వాళ్లందర్నీ పక్కకి జరగమని ఆ అమ్మాయికి చెయ్యందించాను
“నేనుదింపుతానురా...” అంటూ. అందుకోలేదు. భయం భయంగా చూసింది.. నమ్మచ్చోనమ్మకూడదో అన్నట్టు. ఆ అమ్మాయి భయంలో నిజం ఉంది. మనిషి తోటి మనిషిమీద నమ్మకం కోల్పోయాడు మరి. ఇదెంత బాధాకరమైన విషయం..
ఆ అమ్మాయి అలా సందేహిస్తూండగా అన్నాను..
“చూడు నేను లాయర్ని. నువ్వు ఎనిమిదిన్నరకల్లా హాల్లోఉండాలి. ఓ యమ్మార్  పూర్తి చెయ్యాలి. నీ హాల్టికెట్ వాళ్లు చెక్చెయ్యాలి. ఇప్పుడు ఎనిమిదీ ఇరవై అయ్యింది. కనీసం నువ్వు గేట్లు మూసేసేసరికి కేంపస్లో ఉంటేనే
నిన్ను లోపలికి అనుమతిస్తారు.. నిన్ను ఎర్రగడ్దలో సెంటర్ దగ్గర దింపటానికి ఈ టైం సరిపోతుంది.  పైకిలే..! రా.. నిన్ను దింపేస్తాను..” స్ధిరంగా అన్నాను. అంత ఇదిగా చెప్పినా అందర్లో అనుమానపుఛాయలే ..

“ఆ లాయరమ్మగారు దింపుతానంటున్నారు కదా..పోపిల్లా..”ఎవరో అన్నారు. అయినా కదల్లేదు. ఆమెదేం తప్పు లేదు. ఆమెకు కలిగిన అనుభవాలెలాంటివో? మనకు తెలియవు కదా..! 
సరిగ్గా అప్పుడే కానిస్టేబుల్ కూడా వచ్చాడక్కడికి. హమ్మయ్య అనుకుంటూ.. వాలెట్లోంచి నా పాన్ కార్డ్ తీసి ఆయనకిస్తూ..
“ఇది నా పాన్ కార్డ్. మీ దగ్గరుంచండి..ఆ అమ్మాయిని దించి మళ్ళొచ్చి తీసుకుంటాను. మీరిక్కడే ఉంటారు కదా..”అన్నాను. అప్పుడుగానీ నమ్మలేదామ్మాయి నన్ను. ప్రయారిటీస్ అంతే కదా..! 
చదువు కంటే జీవితం ముఖ్యం. నిజానికి అంతమందిలో ఎవరో ఒకళ్ళిద్దరు డ్రాప్ చేస్తానన్నా ఈమెకే ధైర్యం చాల్లేదులా ఉంది. ఎవరు ఎలాంటోళ్ళో ఎలా చెప్పగలం? 
నేనిలా ఆలోచిస్తున్నంతలో గబుక్కున లేచి చేయందుకుంది. క్షణం కూడా ఆలస్యం చెయ్యకుండా ఆమెని లాక్కెళ్తూ బండికేసి అడుగులేసాను. 


“ఈ మాత్రం స్పృహ అందర్లోనూ ఉంటే ఏ రూల్సూ ఏం చెయ్యగలవ్చెప్పండి”, అంటున్నారెవరో.. వెనక నుంచి. అది విని నాలో నేనే నవ్వుకుంటూ గబుక్కునెళ్ళి బండెక్కి, ఆమె వెనుక కూర్చోగానే స్టార్ట్ చేసాను. 
మొదటిసారిగా నా బండి స్పీడోమీటర్ అరవై దాటింది. 
మధ్యలో ఎన్ని కబుర్లు చెప్పిందో.  అమ్మా, నాన్నాలేరట. కట్తే కట్తే అపార్ట్మెంట్  కూలిపోతే దాని కింద నలిగి చనిపోయారంట. దాంతో ఊర్నించి తాతయ్యా, నాయనమ్మలు వచ్చేశారంట. కాలు విరిగిపోయిన తమ్ముడూ, తాతయ్యా, నాయనమ్మల్ని తనే చూసుకోవాలంట. బిల్డర్ ఇచ్చిన దాన్ని తమ్ముడి పేరుతో  ఫిక్సెడ్  వెసారట. తమ్ముడికి కాలు లేకపోవటంతో ఆ వచ్చిన వడ్డీని వాడి కోసమని చిట్టీలు కట్టి, పొద్దున్నే లేచి రెండు మూడిళ్లల్లో పాచి పని చేసి అందర్నీ పోషిస్తుందట.
కనీసం ఇంటరన్నా చదివితే ఏదో ఒక ఉద్యోగంలో తన దగ్గరే పెట్టుకుంటానని బిల్డర్ కూతురనే సరికి ప్రవేటుగా చదువుతుందట. రాత్రంతా చదువుకుని, ఇళ్లల్లో పని చేసి, వాళ్ల ముగ్గురికీ వంట చేసి పెట్టి బస్ కోసంవచ్చిందట.
ఆటోలో వెళ్ళాలంటే డబ్బుల్లేక ఆ విషయం చెప్పటానికి సిగ్గేసిందట. పరీక్షకి వెళ్లలేనేమోననే డిప్రెషన్లో పోయిన అమ్మా, నాన్నా గుర్తొచ్చి ఏడ్చేసిందట. పాపం . ఎంత జాలేసిందో నాకు జీవితాన్ని ఆమె సాధిస్తున్న తీరువిని.  ఎంతకష్టం. ఎంతకష్టం. 


కబుర్లలోనే పరీక్షాకేంద్రాని కొచ్చేశాం. దిగి గబగబా వెళ్లబోతుంటే పిల్చిచెప్పాను..
“నువ్వివేంమనసులో పెట్టుకోకుండా హాయిగా పరీక్ష రాసిరా..! పరీక్షవ గానే మళ్ళీ ఇక్కడికేరా..! నిన్ను మీ ఇంట్లో దిగ బెడతాను. అలా మీ ఇల్లు కూడా తెలుస్తుంది నాకు. అన్నట్టు రేపట్నించీ ఏడూ నలభై అయిదు కల్లా రెడీగా ఉండు ఇంట్లో. పరీక్షలయ్యేదాకా నేనే నిన్ను తీసుకొచ్చి, తీసుకెళతాను. సరేనా..!” అన్నాను
ఆల్  ది బెస్ట్ చేబుతున్నట్టుగా చెయ్యెత్తి ధమ్స్అప్ పింగర్  చూపిస్తూ. 
నా మాటల్తో అంతకు ముందు టెన్షన్తో ఆమె పోగొట్టుకున్న ఆత్మవిశ్వాసం ఆమెని చేరినట్టు ఆ ముఖంలో వెలుగు చెప్పకనే చెప్పింది. నాక్కావల్సింది కూడా అదే..!


“ఈ ఇంటర్, టెన్తోళ్లకి స్పెసిఫిక్ కోడ్ ఏదైనా పెట్టి,  పరీక్షలటైములో వాళ్లని ఎవరూ రోడ్ల మీద అడ్దగించటం కానీ, ట్రాఫిక్ సిగ్నల్స్ద దగ్గర నిబంధనలను పాటించండని అనటంకానీ చెయ్యకుండా వాళ్ల డ్రస్ చూడగానే పరీక్షలకి వెళ్లే స్టూడెంట్స్ అని అర్ధం చేసుకుని పోలీసులూ, పబ్లిక్కూ వాళ్లంతటవాళ్లే వీళ్లకి సహకరించే విధంగా రూల్ వస్తే బాగుంటుంది కదా సార్ “ అన్నాను మా సీనియర్తో ఆలస్యంగా వెళ్ళినందుకు అర్ధవంతమైన సంజాయిషీ ఇచ్చుకుంటూ..
“ ఐడియా బాగుంది. చేద్దాం” అన్నారు ప్రశంసిస్తున్నట్టుగా నా వైపే చూస్తూ..

ఆయనకది సాధ్యమే. ఎందుకంటే ఆయన ప్రభుత్వ న్యాయసలహాదారు కూడా. 
                              

   

 -కన్నెగంటి అనసూయ