Facebook Twitter
సుఖం ఎక్కడ

సుఖం ఎక్కడ

 

 

కొత్తపల్లిలో రాజు అనే పిల్లవాడు ఉండేవాడు. వాడికి పక్షులన్నా, జంతువులన్నా, చెట్లన్నా చాలా ఇష్టం. రోజూ అడవికి పోయి పాటలు పాడుకుంటూ తిరగటం, వాగుల్లోకి దిగి ఈతకొట్టటం చేస్తుంటాడు. ఒకసారి వాడికి జ్వరం వచ్చింది. ఎటు పోయేందుకూ శక్తి లేకుండింది. అమ్మానాన్నలు పనులు మానుకొని కూర్చుంటే ఎట్లా? రాజును ఇంట్లోనే వదిలి వాళ్ళు కూలికి పోయారు. ఒంటరిగా ఉన్న రాముకు అడవి గుర్తుకొచ్చింది. 'అడవిలో పక్షులు, జంతువులు ఎంత హాయిగా బ్రతుకుతాయో! వాటికి ఇన్ని కష్టాలుండవు. చక్కగా ఎగురుకుంటూ, పాడుకుంటూ తిరుగుతాయి; ఆకలి వేస్తే దొరికిన పండ్లను తింటాయి, అలసిపోతే నిద్రపోతాయి! మనిషి బ్రతుకే కష్టం. నేను ఇట్లా మనిషిలాగా కాకుండా ఏ కుందేలు లాగానో పుడితే ఎంత బాగుండేది! చక్కగా అటూ ఇటూ గెంతుకుంటూ, తోటి కుందేళ్లతో‌ఆడుకుంటూ, అడవిలో దుంపలన్నీ త్రవ్వుకుంటూ, దొరికిన పండునల్లా రుచిచూసుకుంటూ..ఓహ్! భలే ఉండేది!' అనుకున్నాడు.


అలా అనుకున్నాడో లేదో- వాడు అడవిలో కుందేలైపోయాడు! రాజు కుందేలుకు ఎంత ఉత్సాహం కలిగిందంటే చెప్పలేము. అటూ ఇటూ చెంగు చెంగుమని దూకి, గంతులు వేసి, బొర్లాడి- రకరకాలుగా పరుగులు పెట్టి చూసింది. దగ్గర్లోనే గెన్సుగడ్డల పొద ఒకటి కనబడింది. ఇంకేముంది?! రాజు కుందేలు కడుపారా చిలకడ దుంపలు మెక్కి, హాయిగా నిద్రపోయింది. అంతలో దానికి కుందేళ్ల గుంపొకటి కలిసింది. ఆ కుందేలు పిల్లలతో కలిసి ఇదీ కుందేలు ఆటలు ఆడింది. ఇట్లా ఎన్ని రోజులు గడిచాయో! కుందేలు పిల్ల లెక్కపెడితే గద!


అయితే అట్లా సంతోషంగా బ్రతుకుతున్న కుందేలు పిల్లను ఒకరోజున నక్క ఒకటి తరిమింది. దాన్నుండి తప్పించుకునేందుకు పాపం, రాజు కుందేలు చెమటలు క్రక్కుకుంటూ‌ప్రరుగుపెట్టాల్సి వచ్చింది. అట్లా పరుగెత్తుతుంటే దానికి ముళ్ళు గుచ్చుకొని పోయాయి; చర్మం చీరుకుపోయి రక్తం వచ్చింది. ఆ తర్వాతిరోజుకల్లా దానికి జ్వరం వచ్చేసింది. దగ్గర్లో ఒక్క డాక్టరు కూడా లేడాయె. కుందేలుకు పాపం నడిచేందుకు కూడా శక్తిలేక కూలబడిపోయింది.


"అబ్బ! ఈ కుందేలు బ్రతుకు కష్టమే. ఎప్పుడు నక్కలు వెంటబడతాయో చెప్పలేం. జ్వరం వస్తే ..? ఇక చెప్పనవసరమే లేదు. అసలు ఈ జన్మ వద్దు నాకు. హాయిగా ఏ చెట్టు లాగానో ఉంటే ఎంత బాగుంటుంది! అసలు కదలాల్సిన పనే లేకుండా, గాలికి చక్కగా కొమ్మల్ని ఊపుకుంటూ, అందరికీ‌ మేలు చేసే ఆక్సిజనును అందిస్తూ..భలే ఉంటుంది. బ్రతికితే చెట్టు లాగా బ్రతకాలి." అనుకున్నది రాజు కుందేలు. అట్లా అనుకున్నదో లేదో- ఇట్లా అది చెట్టయిపోయింది! రాజు చెట్టు సంతోషంగా ఊగింది. కొమ్మల్ని అటూ ఇటూ తిప్పింది. దానిమీదికి పక్షులు వచ్చి గూళ్ళు కట్టుకుంటే మురిపెంగా చూసింది. పక్షి పిల్లలకు పండ్లు తినిపించింది. "జన్మంటే ఇదే! చెట్టు జన్మ ధన్యం. ఎప్పటికీ నేను చెట్టులాగానే ఉంటాను" అనుకున్నది.


అయినా ఆ సంతోషం ఎన్నో రోజులు నిలవలేదు. అనుకోకుండా వచ్చిన పెను తుఫాను దెబ్బకు రాజు చెట్టు కొమ్మలన్నీ విరిగిపోయాయి. మొండిదైపోయిన రాజు చెట్టు మళ్ళీ ఇగుర్లు వేద్దామనుకునేలోపల, కట్టెలు కొట్టేవాళ్ళు కొందరు దాని ముందు నిలబడి ఆ మాను గురించీ, దానిలో ఉండే చేవ గురించీ మాట్లాడుకున్నారు! "ఇలా కదలలేని పరిస్థితి దుర్భరం. నేను గాలిలో ఎగిరే పక్షినైతే ఎంత హాయిగా ఉందునో! ఎంత గాలి వీస్తే అంత గొప్పగా గింగిరాలు కొడతాను. స్వేచ్ఛాజీవితం పూర్తిగా నా సొంతం అవుతుంది" అనుకున్నది రాజు చెట్టు. మరుక్షణం‌ అది పంచవన్నెల రామచిలుక ఐపోయింది.


రాజు చిలక అటూ ఇటూ‌ ఎగిరింది. సంతోష పడింది. తోటల్లో తిరిగింది. జామ పళ్ళూ, దానిమ్మ పళ్ళూ కొరికి తిన్నది. కోయిలతో సమానంగా కూసింది. తోటి పక్షులతో కలిసి ఆడింది. "ఇలా బాగుంది స్వేచ్ఛగా" అనుకున్నది. అయినా ఎంతకాలం? ఒకరోజున అది పొలంలో జామచెట్టు మీద వాలేసరికి, ఆ చెట్టుమీదే రైతు పరచి ఉంచిన వలలో చిక్కుకున్నది. "అయ్యో మనిషిగా ఉంటే సరిపోయేదేమో, కనీసం ఇలాంటి కష్టాలు ఉండేవి కావు" అనుకున్నది. అట్లా అనుకున్నదో‌లేదో- ఇట్లా మనిషైపోయింది మళ్ళీ. ఆ సరికి రాజు జ్వరం తగ్గిపోయింది- కొంచెం నీరసంగా ఉందంతే. ఆ నీరసంలో మంచి కల వచ్చినట్లుంది- రేపటినుండీ‌ మళ్ళీ అడవికి వెళ్ళి ఆడుకోవచ్చు!

 

- కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో