Facebook Twitter
శ్రావణ శుక్రవారపు పాట

శ్రావణ శుక్రవారపు పాట

 

 

 

కైలాస గిరిలోను కల్పవృక్షము క్రింద ప్రమధాది గణములు కొలువగాను
పార్వతీ పరమేశ్వరులు బాగుగా కూర్చుండ పరమేశ్వరుని యడిగె పార్వతపుడు
!! జయమంగళం నిత్య శుభమంగళమ్ !!

ఏ వ్రతము సంపదల నెలమితోడుతనిచ్చు, ఏ వ్రతము పుత్రపౌత్రాభివృద్ధినొసగు
అనుచునూ పార్వతి ఆ హరునియడుగగా పరమేశు డీరీతి పలుక సాగె
!! జయమంగళం నిత్య శుభమంగళమ్ !!

కుండినంబనియెడు పట్నంబులోపల, చారుమతి యనియేటి కాంతకలదు
అత్తమామల సేవ పతిభక్తితో చేసి, పతిభక్తి గలిగున్న భాగ్యశాలి
!! జయమంగళం నిత్య శుభమంగళమ్ !!

వనిత స్వప్నమందు వరలక్ష్మీ రాబోయి, చారుమతిలెమ్మనుచు చేత చరిచె
చరచినంతనే లేచి తల్లి మీరెవరని, నమస్కరించెనా నళినాక్షికీ
!! జయమంగళం నిత్య శుభమంగళమ్ !!

వరలక్ష్మినీ నేను వరములూ యిచ్చేను, మేల్కొనవె చారుమతి మేలుగాను
కొలిచినప్పుడె మెచ్చి కోరిన రాజ్యముల్, వరములనిచ్చినను వరలక్ష్మినే
!! జయమంగళం నిత్య శుభమంగళమ్ !!

ఏ విధిని పూజను చేయవలెననుచూను, చారుమతియడిగెను శ్రావ్యముగను
ఏమి మాసంబున ఏమి పక్షంబున, ఏ వారమూనాడు ఏ ప్రొద్దున
!! జయమంగళం నిత్య శుభమంగళమ్ !!

శ్రావణమాసమున శుక్లపక్షమునందు, శుక్రవారమునాడు మునిమాపునా
పంచకల్వలు తెచ్చి బాగుగా తనునిల్పి, భక్తితో పూజించుమని చెప్పెను
!! జయమంగళం నిత్య శుభమంగళమ్ !!
చారుమతి లేచి యా శయ్యపై గూర్చుండి, బంధువుల పిలిపించి బాగుగాను
స్వప్నమున శ్రీవరలక్ష్మీ చకచక వచ్చి, కొల్వమని పలికెనూ కాంతలారా
!! జయమంగళం నిత్య శుభమంగళమ్ !!

ఏ విధంబున పూజ చేయవలెనన్నదో, బంధువులు అడిగిరి ప్రేమతోనూ
ఏమి మాసంబున ఏమి పక్షంబున, ఏవారమూనాడు ఏ ప్రొద్దున
!! జయమంగళం నిత్య శుభమంగళమ్ !!

 శ్రావణామసమున శుక్లపక్షమునందు, శుక్రవారమునాడు మునిమాపునా
పంచకల్వలు తెచ్చి బాగుగా తనునిల్పి, భక్తితో పూజించుమని చెప్పెను
!! జయమంగళం నిత్య శుభమంగళమ్ !!

అప్పుడు శ్రావణమది ముందుగా వచ్చెనను, భక్తితో పట్నము నలంకరించి
వన్నెతోరణులు సన్నజాజులు, మదిచెన్నుగా నగరు శృంగారించిరి
!! జయమంగళం నిత్య శుభమంగళమ్ !!

వరలక్ష్మీనోమనుచు వనితలు అందరు, వరుసతో పట్టుపుట్టములు గట్టి
పూర్ణంపు కుడుములు పాయసాన్నములూ, ఆవశ్యముగ నైవేద్యములు బెడుదురు
!! జయమంగళం నిత్య శుభమంగళమ్ !!

కండ్రిమండ్రిగనునుండి బలుదండిగా యెంచి, యొండిన కుడుములు ఘనపడలునూ
దండిగా మల్లెలు ఖర్జూర ఫలములూ, విధిగ నైవేద్యములు నిడుదురూ
!! జయమంగళం నిత్య శుభమంగళమ్ !!

నిండు బిందెలతోను నిర్మలా ఉదకులు, పుండరీకాక్షులకు వారుపోసి
తొమ్మిదిపోగుల తోరమొప్పగపోసి, తల్లికి కడు సంభ్రమముతోడను
!! జయమంగళం నిత్య శుభమంగళమ్ !!

వేదవిదుడయినట్టి విప్రుని పిలిపించి, గంధమక్షతలిచ్చి కాళ్ళుకడిగి
తొమ్మిది పిండివంటలు తోమొప్పగబెట్టి, బ్రాహ్మణునకు పాయసముబెట్టుదూరు
!! జయమంగళం నిత్య శుభమంగళమ్ !!