సమ్‌థింగ్ సమ్‌థింగ్...
అవును, అది కేవలం బురదే. ఎవరూ గమనించని విధంగా గడ్డి కింద కనపడకుండా ఉంది. పొరపాటున దానిమీద కాలు వేశారంటే "ఛీ.. ఛీ" అంటూ పక్కకు తప్పుకోవడం ఖాయం. అందరూ అంతలా చీరదరించుకొనే బుదరని ఒక ఉల్లాసభరితమైన సాధనంగా చేయాలని నిర్ణయించుకున్నాం. ఒకసారి మాలో చాలామందిమి మమ్మల్ని మేం తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఒక సెల్ఫ్-డిస్కవరీ క్యాంపుకి వెళ్లాం. లౌడ్ స్పీకర్ల నుంచి బిగ్గరగా వినిపిస్తున్న మ్యూజిక్ వింటూ బురదలో యథేచ్ఛగా నాట్యం చేస్తూ ఆనందంతో కేరింతలు కొడుతున్నప్పుడు మాలో ఉన్న చిన్నపిల్లల్ని తిరిగి గుర్తించగలిగాం.
అసలు ఇదంతా కుర్రాళ్లు వర్షంలో సరదాగా ఫుట్‌బాల్ ఆడుతున్నప్పుడు మొదలైంది. వాళ్లంతా కొంచెంసేపటికి కాళ్లతో ఒకరిపై ఒకరు బురద చల్లుకోవడం మొదలుపెట్టారు. అక్కడ్నుంచి ఇక ఎవరూ వెనక్కి తిరిగి చూడలేదు. ఎటూ చూడాల్సిన అవసరమూ రాలేదు. అంతా బురదమయం అయిపోయింది. మెడ, జుట్టు, వేసుకున్న తెల్లబట్టలు ఒకటేంటి.. అన్నీ బురదలో మునిగి తేలుతున్నాయి. పంది బురదలో పడి దొర్లడం చూశాను గాని, ఏదో ఒకనాటికి నేను కూడా దానిలా ప్రవర్తిస్తూ అలానే బురదలో దొర్లుతానని ఎప్పుడూ ఊహించలేదు. ఏదేమైనా స్వచ్ఛంగా, అతి సాధారణంగా కనిపిస్తున్న ఈ బురద నాట్యాన్ని వర్ణించడానికి 'ఉల్లాసం' అనే పదమే సరైనది. నిజమే, అది కేవలం బురదే. కానీ అదే ముప్పైల్లో, నలభైల్లో, డెబ్భైల్లో ఉన్నవాళ్లు కూడా తమలో దాగున్న మూడేళ్ల చిన్నపిల్లాడిని చూసుకునేటట్లు చేసింది.
* * * *
అది ఒక సాదాసీదా ఉసిరి చెట్టు. ఎవరూ దాన్ని గమనించలేదంటే, ఆశ్చర్యపోవాల్సిన అవసరమేమీ లేదు. అలాంటిది, మా పెద్దక్క నిధి దృష్టిని మాత్రం అది తప్పించుకోలేకపోయింది. ఆ చెట్టును చూడ్డంతోటే పింక్ కళ్లజోడు ఫ్రేములోని తన పెద్దకళ్లు వజ్రాల్లా ధగధగా మెరిసిపోయాయి. ఆ మెరుపును మా పిల్లలందరం వెంటనే పసిగట్టేశాం. ఈ సంఘటన మా కుటుంబం మొత్తం సరదాగా అరకులోయ విహారయాత్రకు వెళ్లినప్పుడు జరిగింది. అక్కడ మా కాలేజీ ఎదురుగానే ఈ పెద్ద ఉసిరిచెట్టు ఉంది. పది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల మధ్య వయసున్న మా కుర్ర బ్యాచ్ మొత్తం గబగబా కాటేజీ లోపలకు పరిగెత్తి ఒక పెద్ద దుప్పటి తీసుకొచ్చి పట్టుకొని ఆ చెట్టుకింద నిల్చున్నాం. మా అందరిలోకి సైజులో చిన్నవాడిని కోతిని చేసి చెట్టు పైకెక్కించి కొమ్మల్ని నెమ్మదిగా కదిలించమన్నాం.
అంతే! ఆ మరుక్షణం మేం స్వర్గంలో ఉన్నట్లుగా ఫీలయ్యాం. ఆకుపచ్చ-పసుపు మిశ్రమ రంగులోని ఉసిరికాయలు చిన్నవి, పెద్దవి ఒకచోట అనేమిటి అన్నిచోట్లా పడుతున్నాయి. మేం వాటినన్నింటినీ పట్టుకోవాలని ప్రయత్నిస్తూ, దుప్పటిని పట్టుకొని అటూ ఇటూ పరిగెత్తుతున్నాం. ఈ దృశ్యం.. స్వర్గం నుంచి చిన్నచిన్న చుక్కలు పడుతున్నట్లుగా కనిపిస్తుంది. వాటిలో ఏ ఒక్కదాన్నీ వదులుకోవడానికి మేం సిద్ధంగా లేం. బిగ్గరగా వినిపిస్తున్న మా నవ్వులు, అరుపులు విని అక్కడ వున్న మాకు తెలీని అపరిచితులు కూడా మా దగ్గరకు వచ్చి, మా సంతోషంలో వారు కూడా పాలుపంచుకొని, అమూల్యమైన మా సంపదలో వాటాను కోరారు. తమ చేతుల నిండా ఉసిరికాయల్ని తీసుకొని సంతోషంగా వాళ్ల కుటుంబాల దగ్గరకు వెళ్లారు. మొత్తానికి, ఇది నా జీవితంలో ఒక మధుర జ్ఞాపకంలా నిలిచింది. నిజమే, అది కేవలం ఉసిరిచెట్టే మరి!
* * * *
తనతో నాకు పెద్దగా పరిచయం లేదు. మా అమ్మ చేసే కరకరలాడే పల్చని నేతి దోశల్ని తినడానికి తనని మా ఇంటికి ఆహ్వానించినప్పుడు, సందేహిస్తూనే రావడానికి ఒప్పుకుంది. తను మా పక్క బిల్డింగ్‌లోనే ఉంటుంది. ఇద్దరం ఒకే స్కూలుకు వెళ్తున్నాం. ఏడు సంవత్సరాలుగా కలిసి చదువుకుంటున్నాం. కానీ మా ఇద్దరి మధ్యా పెద్దగా పరిచయం లేదు. తను మా క్లాసుకి మెదడు లాంటిదైతే నేను కమెడియన్ లాంటిదాన్నన్న మాట. ప్రతిరోజూ ఇద్దరం ఎదురుపడేవాళ్లం. కానీ వెంటనే ముక్కులెగరేసి తల తిప్పేసుకునేవాళ్లం. అయితే ఎప్పుడూ తన చూపుల్లో కనిపించే (తొంగిచూసే) ఏదో తెలీని ఆందోళన, విచారం నన్ను తనని మా ఇంటికి ఆహ్వానించేలా చేసింది.
దోశలు తింటూ మాట్లాడుకోవడం మొదలుపెట్టిన మేం, చాలాసేపు అలా మాట్లాడుకుంటూనే ఉండిపోయాం. మా ఇద్దరి అభిరుచులు, భావాలు చాలావరకు ఒకేలా ఉండటాన్ని నమ్మలేకపోయాను. నేను వేసిన కొన్ని ప్రశ్నలకే తన సమస్యల్ని నాతో పంచుకుంది. వాటన్నింటికీ నేను పరిష్కారాలు చూపించలేకపోయినా, తనని గట్టిగా హత్తుకొని, తన చేయి పట్టుకొని ప్రేమగా మాట్లాడాను. అది తనకు చాలా సంతోషాన్నిచ్చింది. ఈ సంఘటన జరిగి కొన్ని సంవత్సరాలవుతుంది. ఇప్పుడు మేమిద్దరం మంచి స్నేహితులం. ఒకరి ఆలోచనల్ని, భావాల్ని తరచుగా పరస్పరం పంచుకుంటూ ఉంటాం. నిజానికి ఆ దోశతో అప్పుడే అంతా ముగిసిపోయుండొచ్చు. కానీ అలా కాలేదు. అప్పట్నుంచి మా మధ్య బలమైన స్నేహబంధం చిగురించింది.
* * * *
నేను ఒకటో తరగతి చదువుతున్నప్పుడు మొట్టమొదటిసారిగా కొన్ని పదాలు రాశాను. అది కూడా స్కూల్లో కాదు. నేను క్లాసులో సరిగ్గా రాయడం లేదని మా క్లాస్ టీచర్ అమ్మకి కంప్లయింట్ చేసినందకు కూడా కాదు. మా నాన్న ముంబై వెళ్తూ అక్కడ్నుంచీ నీకేం తీసుకురావాలో లిస్ట్ రాసివ్వమని అడిగినప్పుడు మొదటిసారిగా రాశాను. నాన్న తన కూతుర్ని తక్కువగా అంచనా వేశారు. నేనేమో పెన్సిలు, పేపరు తీసుకొని టెడ్డీ బేర్లు, అందమైన షూస్, బార్బీ బొమ్మలు, స్నో ఫ్లేక్స్, చాక్లెట్ ఐస్‌క్రీమ్.. ఇంకా చాలా కావాలని పెద్ద లిస్టే రాసిచ్చాను. అది మొదలు ఇక ఆ తర్వాత నుంచి నేనెప్పుడూ రాస్తూనే ఉండేదాన్ని. అయితే అది స్కూల్లో మాత్రం కాదు.
చీజ్ టోస్ట్ తినేటప్పుడు తమ్ముడు నాకు చిన్న ముక్క ఇచ్చి తను పెద్ద ముక్క తీసుకున్నప్పుడు, నేను తీవ్రమైన భావోద్వేగానికి గురైనప్పుడు, అమ్మానాన్నలు నాపై చూపించిన ప్రేమ గురించీ, అలాగే నాకు ఆనందాన్ని, విచారాన్ని ఇచ్చిన ప్రతి విషయం గురించీ రాశాను. అవి అప్పుడు కేవలం పదాలే - ఒక తెల్ల కాగితం మీద నల్లటి ఆకారాలు మాత్రమే. నాకు ఆ పదాల కన్నా వాటి వెనుకవున్న భావోద్వేగాలే ముఖ్యం. ఇవాళ నా జీవితం, కెరీర్, కలలు.. అన్నీ ఈ పదాలపైనే ఆధారపడి వున్నాయి. ఇప్పుడు ఆ పదాలే నాకు అన్నీను. ఆ పదాలపై పవిత్రమైన భావనేదో కలుగుతోంది.
* * * *
మనకు వాటిలో అవసరమైనదేదీ కనిపించలేదు కాబట్టి అవి ఇక ఎందుకూ పనికిరానివని భావించకూడదని తెలుసుకున్నాను. బురద నాకు ఉల్లాసాన్నిచ్చింది. ఉసిరిచెట్టు నా జీవితంలోనే అత్యంత మధురమైన జ్ఞాపకాలనిచ్చింది. దోశ ఒక మంచి స్నేహితురాలినిచ్చింది. ఇక అతి సామాన్యంగా కనిపించే పదాలైతే నాకు సర్వస్వం అయిపోయాయి. ఏమీ లేదని అనుకున్న దాంట్లో కూడా ఏదో ఒకటి ఉంటుందని అర్థమైంది. జీవితం మొత్తం మీద ఏదో ఒక రోజును తీసుకుని చూస్తే, అది కేవలం ఒక మామూలు రోజు లాగే కనిపిస్తుంది. కావాలనుకుంటే నేను ఆ రోజును నా జీవితాన్నే మార్చగల ఒక అద్భుతమైన రోజుగా మార్చుకోగలను. ఒక క్షణకాలం గురించి పెద్దగా గుర్తు పెట్టుకోవటానికి ఏమీ ఉండకపోవచ్చు. కానీ అదే క్షణకాలాన్ని జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక మధుర జ్ఞాపకంగా చేసుకోగలను.
ప్రియమైన వ్యక్తితో గడిపిన సంధ్యా సమయం ఏ ప్రత్యేకతా లేని ఒక మామూలు సాయంత్రంలా మిగిలిపోవచ్చు.. లేదంటే ఒక మధుర జ్ఞాపకంలా మారిపోనూవచ్చు. ప్రియమైనవాళ్లతో అర్ధరాత్రివేళ డాన్సు చేస్తూ సంతోషంగా గడిపిన సమయం సూర్యుని తొలికిరణాలతో మర్చిపోనూవచ్చు.. లేదంటే దాన్ని ఒక తియ్యటి జ్ఞాపకంలా రోజూ నిద్రించే సమయంలో గుర్తుచేసుకొని మధురానుభూతిని పొందవచ్చు.
మన చుట్టూ జరిగే ఎన్నో విషయాల్ని మనం గుర్తించం. కానీ కొద్దిపాటి శ్రద్ధ, సృజనాత్మకత, ఆలోచనతో వాటిని ఎంతో గొప్పగా మలుచుకోవచ్చు. ఎంతలా అంటే అవే మనకు సర్వస్వం అయ్యేలాగా!
- వనమాలి
