Facebook Twitter
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కథ

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కథ

 

ఒకసారి ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీరు సెలవల్లో దేశాటనకు వెళ్ళాడు. అట్లా అతను ఒక పర్వత ప్రాంతంలో పోతుండగా, గొర్రెల కాపరి ఒకడు ఎదురయ్యాడు. అతని వెంట ఒక పెద్ద గొర్రెల మంద ఉన్నది. ఆ మందలో చిన్న చిన్న, బొచ్చు బొచ్చు గొర్రె పిల్లలు- చాలా ముచ్చటగా వున్నాయి. కంప్యూటరు బొమ్మల్లో తప్ప, నిజ జీవితంలో ఏనాడూ వాటిని చూసి ఉండని ఇంజనీరు ఆ దృశ్యానికి పరవశించి పోయాడు. "ఎలాగైనా ఒక గొర్రె పిల్లను సంపాదించాలి" అనే కోరిక ఒకటి అతని మనసులో మొలకెత్తి, కొమ్మలు రెమ్మలు వేసేసింది. దాంతో అతను ఆ గొర్రెల కాపరి దగ్గరికి వెళ్ళి "చూడు గోపన్నా, నేను నీ గొర్రెను ఒక దాన్ని కొనాలనుకుంటున్నాను. ఖరీదెంతో చెప్పు!" అన్నాడు.

దానికి ఆ గొర్రెల కాపరి "ఈ గొర్రెలు అమ్మేవి కావు!" అని ముక్తసరిగా జవాబిచ్చాడు. ఇంజనీరు గొర్రెలతనిని ఎంతగానో బ్రతిమిలాడాడు. అయినా ఫలితం లేదు. గొర్రెను అమ్మేందుకు కాపరి ఏ మాత్రం ఇష్టపడలేదు. "ఎంత ఖర్చయినా పర్లేదు- మిగతా ప్రపంచానికి ఏమి జరిగినా పర్లేదు- అనుకున్నదాన్ని సాధించాల్సిందే" అనుకునే ఇంజనీరుగారికి ఇది అస్సలు ఏమాత్రం మింగుడు పడలేదు. చివరికి అతనికో ఆలోచన తట్టింది. గొర్రెల కాపరిని ఉద్దేశించి "చూడు గోపన్నా! నువ్వెంత చెప్పినా నిన్ను, నీ గొర్రెల్ని వదిలి పోబుద్ధి కావట్లేదు. అందుకని నేను ఒక పని చేస్తాను. ఎంత శ్రమ అయినా పర్లేదు; నీ మందలో ఉన్న గొర్రెలను ఒక్కొక్కదానినీ లెక్క పెట్టకుండానే, అవి మొత్తం ఎన్ని గొర్రెలో చెబుతాను నేను. నేను చెప్పే ఆ సంఖ్య గనుక సరిపోతే, నా తెలివి తేటలకు బహుమానంగా నువ్వు ఒక గొర్రెను ఇద్దువు. సరేనా?" అన్నాడు.

 

గొర్రెల కాపరికి అది ఇష్టం కాలేదు. "నా గొర్రెలు ఎన్ని ఉన్నాయో నాకు తెలుసు కదా, అది చెప్పేకి ఈయనెందుకు?" అనుకున్నాడు. "అయినా ఒక్క అంకె చెబితే గొర్రెనెందుకు ఇవ్వాలి, అనవసరంగా?" అని కూడా అనుకున్నాడు. అయినా అతను అడిగిన తీరు నచ్చి, ఓమాటు నవ్వి "సరే" అన్నాడు. 
వెంటనే ఇంజనీరు మందలోని గొర్రెల్ని అన్నిటినీ ఒకసారి తన మొబైల్ ఫోనుకు చూపించాడు. గూగుల్ మ్యాప్స్ నొక్కాడు. తనున్న ప్రాంతాన్ని జూం చేసాడు. అందులో కనబడ్డ గొర్రెల్ని లెక్క పెట్టేందుకు అర్జంటుగా ఒక యాప్ తయారు చేసాడు. చివరికి చెప్పాడు "ఇవి డెభ్భై రెండు " అని. మీరు చెప్పింది నిజమే ! ఇవి డెభ్భై రెండు" ఒప్పుకున్నాడు గొర్రెల కాపరి. "సరే ... మీరు పందెంలో నెగ్గారు గనుక ఈ మందలోంచి ఒక గొర్రెను తీసుకెళ్ళండి" అన్నాడు. 


సంతోషంతో ఉబ్బిపోయాడు ఇంజనీరు. వెంటనే మందలోకి వెళ్ళాడు. ఓ జీవాన్ని ఎంచుకున్నాడు. దానిని తన భుజాల పైకి ఎత్తుకున్నాడు. ఆ విధంగా తను కోరిన దాన్ని చేజిక్కించుకొని తిరిగి వెళ్ళేందుకు ఉద్యుక్తుడవుతుండగా గొర్రెల కాపరి ఆయనకు అడ్డు వచ్చాడు- "ఒక్క నిమిషం ఆగండి! నేను కూడా ఒక పందెం కాయాలనుకుంటున్నాను మీతో" అన్నాడు.

"అవునా?! ఏమిటా పందెం?!" అడిగాడు ఇంజనీరు. "తమరి వృత్తి ఏంటో చెప్పేస్తాను నేను. నేను చెప్పింది గనుక నిజమైతే, మీరు గెల్చుకున్న ఆ జీవాన్ని నాకు తిరిగి అప్పగించాల్సి ఉంటుంది" అన్నాడు గొర్రెలకాపరి, సీరియస్‌గా ముఖం పెట్టి. అతని అమాయకపు మాటలకు బిగ్గరగా నవ్వాడు ఇంజనీరు. "మన పల్లెల్లో వాళ్లకి కాపీ కొట్టటం బలే వచ్చు" అనుకున్నాడు. చులకన భావంతో అతని మనసు తేలికై, అలా అలా గాలిలో ఊగింది. "ఇతన్ని ఆట పట్టించేందుకు మరో అవకాశం ఇస్తున్నాడు- భలే" అనుకున్నాడు. పైకి మటుకు "సరే,.. అలాగే.. నువ్వడిగింది కూడా న్యాయంగానే వుందిగా?! కానివ్వు...!" అన్నాడు.

 

"మీరు ఒక సాప్టువేరు ఇంజనీర్!" టక్కున చెప్పాడు గొర్రెల కాపరి. ఊహించని ఈ జవాబుకి ఇంజనీరుకు దిమ్మ తిరిగినట్లయింది. వెంటనే తేరుకొని "నీకెలా తెలిసింది...?" అని అడిగాడు. గొర్రెల కాపరి చిరునవ్వు నవ్వాడు. "సార్!‌ నా గొర్రెలు ఎన్ని ఉన్నాయో నాకు తెలుసు. లెక్క పెట్టుకునేందుకు ఏమంత సమయం‌ పట్టదు కూడాను. అయినా దాని కోసం మీరు సెల్‌ఫోను బయటికి తీసారు. దాన్ని బట్టే మీరు ఎవరో అర్థమైపోయింది నాకు. ఇక రెండోది, నా గొర్రెలు ఎన్ని ఉన్నాయో నాకే చెప్పి, కనుక్కున్నందుకుగాను మీకు బహుమతిని ఇమ్మన్నారే, అట్లా అనగలిగే సామర్థ్యమూ, తెలివితేటలూ, అసలు అలాంటి బుద్ధి అంతా సాప్టువేరు ఇంజనీర్లకు మాత్రమే ఉంటుంది. దాని నుండి కూడా మీరెవరో తెలిసిపోయింది నాకు.

ఇక మూడో సంగతి ఏంటంటే, మీకు ఏ మాత్రం అనుభవం లేని పనిని కూడా మీరు 'అవలీలగా చేయగలరు' అనుకుంటున్నారు. నిజానికి మీరు గొర్రెల్ని చూడలేదు; వాటి అలవాట్లేంటో‌ మీకు తెలీదు; వాటిని ఎట్లా పెంచాలో మీకు తెలీదు; అయినా అన్నీ‌ తెలిసినట్లు పందెం కట్టారు. అట్లాంటి శక్తి కేవలం సాప్టువేరు ఇంజనీర్లకు మాత్రమే ఉంటుంది తప్ప, ఇతరులకు అది సాధ్యమే కాదు. అట్లా మీరెవరో నాకు మూడు రకాలుగానూ తెలిసిపోయింది. అయినా మీకు గొర్రెల గురించి తెలీదని నాకు ఎట్లా తెలిసింది అంటారేమో.. మీరు ఎత్తుకెళ్తున్నది గొర్రె కాదు; అది నా పెంపుడు కుక్క! దయచేసి నా కుక్కను నాకు వదిలి వెళ్ళండి!" అన్నాడు చిరునవ్వుతో. సిగ్గు పడిన సాప్టువేరు ఇంజనీరు కుక్కను నేలమీదికి జారవిడిచి, ఎర్రబారిన ముఖంతో తన కారువైపుకు అడుగులు వేసాడు.

కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో