Facebook Twitter
స్నేహం

స్నేహం

 


రామాపురపు భూస్వామి రంగయ్య వడ్డీ వ్యాపారం లోను, భూముల మీదను బాగా సంపాదించాడు. ఆ డబ్బుతో ఒక పెద్ద స్థలాన్ని కొన్నాడు. ఆ స్థలంలోనే ఒక సరస్సును, దాని ఒడ్డునే ఒక పెద్ద భవంతిని నిర్మించుకొని, అక్కడ దర్జాగా నివసించటం మొదలు పెట్టాడు. రంగయ్య భవంతి ప్రక్కనే నివసిస్తుంటాడు, దళితుడు సోమయ్య.

రంగయ్యకు సోమయ్యను, అతని కుటుంబాన్ని చూస్తే రోతగా ఉండేది. ఆ కుటుంబాన్ని వెళ్ళగొట్టాలని, ఆ స్థలాన్ని కూడా తానే కొనుక్కోవాలని చాలా సార్లు ప్రయత్నించాడు అతను. కానీ కుదరలేదు. పాపం, సోమయ్యకు ఆ ఇల్లు తప్ప ఇంక వేరే ఏ ఆస్తీ లేదు. "రెక్కల కష్టం చేసుకొని ఎలాగో ఒకలాగా బ్రతికితే, విలువ పెరుగుతున్న భూమిని కనీసం నిలుపుకోవచ్చు" అని వాళ్ళ ఇంటిల్లిపాదీ ప్రొద్దుటినుండి రాత్రి వరకూ శ్రమిస్తూనే ఉంటారు.

"ఒక మామూలు దళితుడికి అంత గర్వమా? నేను అడిగినా ఇవ్వడా, భూమిని?" అని రంగయ్యకు కోపం. సోమయ్యను ద్వేషించే రంగయ్య, వాళ్ల కుటుంబంలోని వాళ్ళను ఎవ్వరినీ తన ఆవరణలోకి కానీ, తన సరస్సు దగ్గరకు కానీ రానిచ్చేవాడు కాదు. రంగయ్య కొడుకు రాము, సోమయ్య కొడుకు రాజు- ఇద్దరూ ఒకే బడికి వెళ్ళేవాళ్ళు. కానీ వేరు వేరు సెక్షన్ల పిల్లలు కావటంతో, ఇద్దరూ ఎప్పుడూ మాట్లాడుకోలేదు. ఒక రోజున వాళ్ళిద్దరూ బడినుండి ఇంటికి తిరిగి వస్తుండగా నీళ్ల కావడి మోసుకొని అటువైపే పోతున్న సోమయ్య కనిపించాడు.

 

ఆ కావడి బరువుకు, వీళ్ళు చూస్తూండగానే సోమయ్య దఢాలున కూలబడిపోయాడు. రాము వెనకనే నడుస్తున్న రాజు గబుక్కున అటుగా పరుగెత్తి, తండ్రిని లేపి కూర్చోబెట్టి, కడవలోని నీటిని త్రాగించాడు. ఆ సమయంలో రాము వాళ్ళ దగ్గరకు వెళ్ళి పలకరించి, "రాజూ! మీరు మా సరస్సులోని నీళ్ళు తీసుకోవచ్చుకదా? ఎందుకు, ఇంత దూరం నుండి నీళ్ళు మోసుకోవటం?" అని అడిగాడు. సోమయ్య, రాజు ఇద్దరూ నవ్వి ఊరుకున్నారు.

ఆ రోజు సాయంత్రం వాళ్ల నాన్నని అడిగాడు రాము - "రాజు వాళ్ళు మన సరస్సులోంచి నీళ్ళు ఎందుకు తీసుకోరు?" అని. "వాళ్ళు దళితులు. వాళ్లు మన ఇంటి దగ్గరికి రాకూడదు; మనవి ఏమీ ముట్టుకోకూడదు- నువ్వు కూడా వాళ్ళతో ఏమీ మాట్లాడకూడదు- తెలిసిందా?!" కోపంగా అన్నాడు రంగయ్య. ఆ మాటలు విని రాము చాలా బాధపడ్డాడు. కానీ ఊరుకున్నాడు.

ఒకరోజున రాము స్కూలు నుండి తిరిగి వస్తున్నప్పుడు, దారిలో ఒక పాము కనబడింది. అది అప్పుడే ఒక కప్పను మింగుతున్నది. రాము ఊరుకోకుండా దాన్ని ఒక కర్రతో కలబెట్టాడు. కప్పను వదిలిన పాము ఎంచక్కా రాము వెంటపడింది. ఆ సమయంలో రాము వెనకనే వస్తున్న రాజు వేగంగా కదిలి, పక్కనే ఉన్న కర్ర ఒకదానితో పామును కొట్టి చంపేసాడు; భయంతో వణికిపోతున్న రాముని ఓదార్చాడు. 

ఆ రోజునుండి వాళ్ళిద్దరూ మంచి స్నేహితులయ్యరు. ఇక ఆ నాటి నుండి ఇద్దరూ కలసి స్కూలుకి వెళ్ళేవాళ్ళు; కలసి వచ్చేవాళ్ళు. ఎన్నో సార్లు వాళ్ళ నాన్నకు తెలియకుండా తన దగ్గరున్న పుస్తకాలు, పెన్నులు ఇచ్చేవాడు రాము. ఇద్దరూ కలసి దూరంగా ఓ తోటలో ఆడుకునేవాళ్ళు. ఒకసారి అట్లా తోటలో ఆడుకుంటున్న పిల్లలిద్దరినీ చూశాడు రంగయ్య. కోపంతో అతని కళ్ళు ఎర్రబడ్డాయి. గబగబా రాముని ఇంటికి లాక్కెళ్ళాడు. 

సోమయ్యను పిలిపించి పోట్లాటకు దిగాడు. ముందు కొద్దిసేపు తగ్గి ఉన్నాడు సోమయ్య- అటుపైన, అణకువగా ఉంటే కుదరదని గ్రహించినట్లు, అతనూ గొంతు పెంచాడు. ఇద్దరూ ఒకరిని మించి ఒకరు తిట్టుకోవడం భరించలేకపోయారు పిల్లలిద్దరూ. వాళ్లని ఆపడానికి ప్రయత్నించారు. వాళ్లు ఆవేశంగా పిల్లలని తోసివేసారు. కొద్దిసేపు అట్లాగే నిలబడి, రాము మెల్లగా తోట వైపు నడవటం మొదలెట్టాడు. అది చూసిన రాజు అతని వెనకనే వెళ్ళాడు. కొద్దిసేపు పోట్లాడుకున్నాక, ఇక్కడ తండ్రులి-ద్దరూ గొడవ చాలించుకున్నారు. చీకటి పడింది; కానీ పిల్లలు మటుకు ఇళ్ళకు రాలేదు. 

 

రంగయ్య, సోమయ్య ఇద్దరూ పిల్లల కోసం కంగారు పడసాగారు. ఊళ్ళోవాళ్ళంతా చేరి రంగయ్యను, సోమయ్యను చీవాట్లు పెట్టారు. అప్పటికప్పుడు దివిటీలు వెలిగించి పిల్లలను వెతకడానికి బయలుదేరారు అందరూ. రెండు గంటలు గడిచాయి. చంద్రుడి వెలుగులో దూరంగా రెండు ఆకారాలు కనిపించి అందరూ అటు పరుగెత్తారు. అక్కడ, రాము నడుములోతు బురదలో కూరుకుపోయి కనబడ్డాడు. ఇంకా లోనికి జారిపోకుండా అతని నడుముకు గడ్డితో‌అల్లిన త్రాడు ఒకటి కట్టి ఉన్నది. ఆ త్రాడు కొసను పట్టుకొని, బయటికి లాగుతూ అవస్థ పడుతున్నాడు రాజు! ఊళ్ళోవాళ్ళంతా పరుగున వెళ్ళి, వాడికి సాయం చేసి, రాముని బయటికి లాగారు. ఆలోగా రంగయ్య అహంకారం తగ్గి, పశ్చాత్తాపం మొదలైంది. 'మేము మనుషులం కాదా?' అని సోమయ్య అడిగిన మాటలు గుర్తుకు వచ్చాయి. 

తన కొడుకుని కాపాడటం కోసం ఆ పిల్లవాడు-రాజు- పడ్డ శ్రమ కళ్ళముందే కనిపిస్తూ ఉన్నది. 'వాళ్ల మానవత్వం ముందు తనెంత?' అన్న ఆలోచనతో రంగయ్య తల వాలి పోయింది. "నాన్నా! నేను ఈ రోజు బ్రతికి ఉన్నానంటే, దానికి కారణం రాజు. అతను ఇంతకు ముందు నన్ను పాము కాటు నుండి కాపాడాడు; ఇప్పుడు ఊబిలోంచి కాపాడాడు. కానీ మీరు మాత్రం వాళ్ళని మనుషులుగానే చూడరు. ఎందుకు నాన్నా, ఇలా క్రూరంగా ప్రవర్తిసారు?" అన్నాడు రాము మెల్లగా, అతని దగ్గరకి వచ్చి నిలబడి. రంగయ్య కళ్ళలో నీళ్ళు వచ్చాయి. "అందరూ నన్ను క్షమించండి బాబూ! అహంకారం కొద్దీ‌ మానవత్వాన్నే మరచాను. ఇంకెప్పుడూ ఇలా చెయ్యను" అన్నాడు. అనటమే కాదు, తన మాటని నిలుపుకున్నాడు రంగయ్య. అందరితోటీ ప్రేమగా మెలగుతూ 'మంచివాడు' అనిపించుకున్నాడు. రాము-రాజుల స్నేహం కలకాలం వర్ధిల్లింది.

కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో