Facebook Twitter
నేనేం చెయ్యాలి..

నేనేం చెయ్యాలి..

 

 

ఆవులు కాసే రంగన్నకు ఉన్నట్టుండి ఓ సందేహం కలిగింది. "నేనేం చెయ్యాలి?" అని. ఇప్పుడు చేస్తున్న పని సరైనది కాదేమోనన్న అనుమానపు తాలూకు రూపమే ఆ సందేహం. పక్కనే పచ్చగడ్డి మేస్తున్న ఆవును అడిగాడు రంగన్న "నేనేం చెయ్యాలి?" అని. "బాగా తినాలి. మంచిగా పాలివ్వాలి. ఇంకా మంచిగా పేడ వెయ్యాలి కూడా" అని చెప్పింది ఆవు. ’ఊహూ, ఇది కాద’నుకున్నాడు రంగన్న. ’ఇది కాకపోతే మరి ఇంకేది?’ అని కూడా అనుకున్నాడు. వెంటనే వెళ్లి ఓ పెద్ద చెట్టును అడిగాడు "నేనేం చేస్తే సరిపోతుందో చెప్పు?" అని.

"దొరికినప్పుడు దొరికినదాన్ని వీలయినంత బాగా వాడుకోవాలి. ఇంకా వీలయితే దాచుకోవాలి- జాగ్రత్తగా. దొరకనప్పటికి అక్కరకొస్తాది అది. దొరకనప్పుడు దాచుకున్నదాన్ని చక్కగా వాడుకోవాలి. అప్పుడు చింత లేకుండా ఉండొచ్చు. తీసుకోవాలి; ఇవ్వాలి. అలా మనకు మనం మేలుచేసుకోవాలి; ఇతరులకూ మేలు చేయాలి" చెప్పింది చెట్టు ఆలోచించుకుంటున్నట్లు.

"ఏమిటో ఈ చెట్టూ, చెట్టు మాటలూనూ! నాకేమీ అంతుపట్టడం లేదు. నేనేం చెయ్యాలో ఏమో!’ అనుకుంటూ వెళ్లి ఈ సారి గాలిని అడిగేశాడు రంగన్న. "నేనేం చెయ్యాలి?" అని.

"పొయ్యే వీలున్న అన్ని చోట్లకూ పోవాలి. అన్నింటినీ చూడాలి. అన్నింటినీ తాకాలి. చల్లగా! మెల్లగా! ఉల్లాసంగా! ఉత్సాహంగా!. రంగన్నా! ఓ రంగన్నా! వెళుతున్నా! నే వెళ్తున్నా!" అంటూ ముందుకు సాగిపోయిందా గాలి తెర.

గాలితెర మోసుకొచ్చిన పూల వాసన రంగన్నకు పూలచెట్లను గుర్తు చేసింది. వెంటనే పూలచెట్ల దగ్గరకు పోయాడు ఆయన.

తమపైని పూగుత్తులు పిల్ల గాలికి అటూ ఇటూ ఊగుతుంటే తమవంతుగా తామూ సంతోషంగా తలలూపుతున్నాయి పూల మొక్కలు. చూస్తుంటే అవన్నీ నిజంగా పూలను ఉయ్యాలలూపుతున్నట్లే ఉంది. రంగన్న రాకను గమనించి, పూలన్నీ తమ గుభాళింపు నవ్వులతో స్వాగతం చెప్పాయి అతనికి.

"పువ్వుల్లారా! పువ్వుల్లారా! మీరైనా చెప్పండి, నేనేం చేస్తే సరిపోతుందో?" అని అడిగాడు రంగన్న వాటిని.

"నవ్వు, రంగన్నా, నవ్వు! సంతోషంగా నవ్వు!! వచ్చే వాళ్లకు హాయ్! హాయ్!. పొయ్యే వాళ్ళకు బయ్ బయ్!! నవ్వు, రంగన్నా, నవ్వాలి! అదీ.. అలా నవ్వాలి!’ అని పువ్వులు గట్టిగా నవ్వాయి.

అవి అట్లా నవ్వుతుంటే, రంగన్నకు కూడా నవ్వు వచ్చింది. ఆ నవ్వు మోసుకొచ్చిన సంతోషంతో అతనిలోని సందేహాలన్నీ పటాపంచలయ్యాయి! ఇక అతను సంతోషంగా నవ్వుకుంటూ ఆవులు కాసుకోవడానికి వెళ్ళిపోయాడు.