Facebook Twitter
పరివర్తన

పరివర్తన

 


అనగనగా, చాలా కాలం క్రితం జపాన్‌ దేశంలో 'షిచిరి కోజున్' అనే గొప్ప బౌద్ధ అధ్యాపకుడు ఒకాయన ఉండేవాడు. "షిచిరి బాగా చదువుకున్నవాడు. బౌద్ధ తత్వాన్ని లోతుగా అర్థం చేసుకున్నవాడు" అని చెబుతారు. అనేక మందిని ధర్మమార్గంలో నడిపిన షిచిరికి, జపాన్‌ దేశం అంతటా శిష్యులు ఉండేవాళ్ళు. ఎంత గొప్పవాడైనా, షిచిరి అందరు భిక్షువుల మాదిరి అతి సాధారణంగా జీవించేవాడు. ఏకవస్త్రం ధరించి, గుండు చేసుకొని, ఒంటరిగా ఒక గుడిసెలో నివసించేవాడు. ఆయన నడిపే గురుకులానికి వచ్చే విరాళాలకు సంబంధించిన గల్లాపెట్టె ఒకటి, ఆ గదిలోనే ఒక మూలగా ఉండేది.

ఒక రోజు సాయంత్రం అవుతుండగా షిచిరి కళ్ళు మూసుకొని తను రోజూ వల్లించే ధర్మసూత్రాలు అన్నింటినీ బిగ్గరగా వల్లిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో అకస్మాత్తుగా దొంగవాడు ఒకడు ఆయన ఉండే గదిలోకి ప్రవేశించాడు. "మర్యాదగా నీ దగ్గర ఉన్నది అంతా ఇచ్చేయ్- డబ్బులు, నగలు- ఏవి ఉంటే అవి! మర్యాదగా ఇచ్చేస్తావా, ప్రాణాలు తీయమంటావా?" అంటూ పదునైన కత్తిని షిచిరి గొంతుకు ఆనించాడు దొంగ.

 

ధర్మంలో ఉన్నత శిఖరాలను అంది పుచ్చుకున్న గురువు షిచిరి. ఆయనకు దొంగంటే ఏ మాత్రం భయం వెయ్యలేదు. పైపెచ్చు ఎక్కడ లేని చికాకూ పుట్టుకొచ్చింది: "ఇదిగో అబ్బాయ్! నువ్వు నన్ను ఊరికే డిస్టర్బు చేస్తున్నావు! డబ్బులు కావాలంటే అదిగో, నా వెనకాల ఆ గల్లాపెట్టెలో ఉన్నాయి. పోయి తీసుకొచ్చుకో. మాటల్ని ఊరికే వృధా చేసుకోకు" అంటూ అటువైపు చూపించాడు- "విను నాయనా! అన్నీ వెతుక్కో, ఏవి కావాలంటే అవి తీసుకో. ఊరికే నన్ను కష్టపెట్టమాకు. ఇక్కడ అందరూ ఎవరి పనులు వాళ్లు చేసుకుంటారు" అంటూ మళ్ళీ తను సూత్రాలు వల్లించటంలో మునిగి పోయాడు.

దొంగవాడు కొంచెం అనుమానంగానే గల్లాపెట్టె వైపుకు నడిచాడు. 'షిచిరి ఎక్కడ పారిపోతాడో' అన్నట్లు వెనక్కి వెనక్కి తిరిగి చూసుకుంటూ పోయాడు. చివరికి గల్లాపెట్టెలోని డబ్బుని ముట్టుకొని చూసుకునేవరకూ అతని మనసు మనసులో లేదు. ఒకసారి ఆ మొత్తం అతని చేతికి తగిలాక, అప్పుడు వాడు ఊపిరి పీల్చుకొని ఆ డబ్బు మొత్తాన్నీ తను తెచ్చుకున్న మూటలోకి వేసుకోబోయాడు. అంతలో అకస్మాతుగా షిచిరి గొంతు వినపడింది: "ఓయ్, హలో! అక్కడ ఉన్నది మొత్తం తీసుకోవద్దమ్మా, దయచేసి! రేపు నేను కొంచెం పన్నులు అవీ కట్టేది ఉన్నది- అక్కడున్న వాటిలో కాసిన్ని డబ్బులు అట్లాగే మిగిల్చి ఉంచావంటే, రేపు ఆ పన్నులను కట్టే బెడద కూడా వదిలిపోతుంది నాకు!" అని.

 

దొంగకు ఒక్క క్షణం ఏమీ అర్థం కాలేదు- "వీడేంటి?! ఏదో వింతగా ఉన్నాడే!" అనుకున్నాడు. "సరే, కానీలే, ఏం పోతుంది?!" అన్నట్లు గల్లాపెట్టెలో డబ్బుల్ని కొన్నిటిని మటుకు వదిలేసి, మిగితాదంతా సంచిలో వేసుకున్నాడు: "సరేలే. నువ్వు చెప్పినట్లు కొన్ని డబ్బులు ఆ డబ్బాలోనే వదిలేసాను" అంటూ. "ధాంక్యూ!‌ నువ్వు చాలా మంచివాడివల్లే ఉన్నావు" అన్నాడు షిచిరి, మంత్రాల మధ్యలోంచే. దొంగవాడు వెనక్కి తిరిగి పోబోయాడు- అయితే అతను ఇంకా గడప దాటకనే వెనకనుండి షిచిరి గొతు వినిపించింది గట్టిగా: "హలో! నువ్వు నా డబ్బులు తీసుకున్నావు; కనీసం థాంక్స్‌ కూడా చెప్పిపోవట్లేదు! అంత అమర్యాద దేనికి, కొంచెం థాంక్స్ చెప్పి పోతే నీకేం పోతుంది?!" అని.

ఈసారి దొంగ ఉలిక్కి పడ్డాడు కొంచెం ఆశ్చర్యం తోటి, మరికొంత భయం తోటీ షిచిరినే చూస్తూ నిలబడ్డాడు. సగం లోపల, సగం బయట నిలబడ్డ అతని శరీరాన్ని స్పృశిస్తూ ఎక్కడినుండో గాలి చల్లగా వీచింది. తను కూర్చున్న చోటు నుండి కదల్లేదు షిచిరి. ఆయన కళ్ళు మాత్రం చిలిపిగా మెరుస్తూ దొంగ కేసి చూసాయి. ఎందుకనో దొంగ వెన్నులోంచి వణుకు పుట్టుకొచ్చినట్లయింది. తెలీని భయమేదో వాడిని ముంచెత్తింది. అయితే రెండో క్షణానికి తేరుకున్నాడు వాడు. "థాంక్స్‌" అని పొడిగా, రెండు ముక్కల్లో చెప్పేసి, తను నింపుకున్న మూటతో ఇక వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయాడు.

ఆ తరువాత వాడు తన స్నేహితులకు ఈ సంగతంతా చెప్పాడు- "ఆ క్షణంలో నాకు ఆ మనిషి అంటే ఎందుకనో, తెలీని భయం వేసింది. ఇంతమంది జనాలలో ఏనాడూ- ఎవ్వరినీ- చివరికి పోలీసుల్ని- చూసి కూడా నేను అంతగా భయపడలేదు. నిజం!" అని. అయితే ఇంకో వారం గడవకనే మరో చోట దొంగతనం చేస్తూ పట్టుబడి పోయాడు ఆ దొంగ. పోలీసులు వాడిని పట్టుకెళ్ళి, వాడు గతంలో -ఎక్కడెక్కడ- ఎంతెంత మొత్తాలు- దోచుకున్నాడో, ఆ వివరాలన్నీ కక్కించారు. మొట్ట మొదట్లోనే దొంగ 'షిచిరి కోజోన్‌' పేరు చెప్పాడు; ఆయన నుండి ఎంత దోచుకున్నాడో చెప్పాడు. వివరాలు అన్నీ రాసుకున్నాక, పోలీసులు వాడిని కోర్టులో హాజరు పరిచారు.

కోర్టువారు షిచిరిని పిలిచి, సాక్ష్యం చెప్పమన్నారు: "వీడు మీ నుండి ఇంత సొమ్ము దోచుకున్నానని చెబుతున్నాడు. నిజమేనా?" అని అడిగారు. షిచిరి దొంగకేసి చూస్తూ ప్రశాంతంగా చెప్పాడు: "నిజానికి ఇతను నానుండి ఏదీ దోచుకోలేదు. ఆ డబ్బుల్ని నేనే తీసుకొమ్మన్నాను అతన్ని" అని. ఆ వెంటనే ఉత్సాహంతో మెరిసే కళ్ళతో చెప్పాడాయన- "డబ్బులు తీసుకొని వెళ్తూ ఇతను నాకు ధాంక్స్‌ కూడా చెప్పాడు!" అని.

 

అయినా, తను చేసిన ఇతర నేరాలకుగాను దొంగకి కొన్నేళ్ళపాటు జైలు శిక్ష పడింది. జైల్లో ఉన్నంతకాలమూ ఎందుకనో, దొంగ షిచిరిని మర్చిపోలేకపోయాడు. నిజానికి షిచిరిని, ఆయన మాటల్ని గుర్తు చేసుకోని రోజే లేకుండింది అతనికి! సంవత్సరాలు గడిచాక, షిచిరి ఇంకా ముసలివాడైన తరుణంలో- ఎవరో ఆయన ఇంటి తలుపు తట్టారు. తలుపు తెరిచి చూస్తే ఎదురుగా నిలబడి ఉన్నాడు, ఆ దొంగ! అప్పుడే జైలులో నుంచి బయటకు వచ్చినట్లున్నాడు- భుజానికి వ్రేలాడుతూ ఒక చిన్న బట్టల మూట. పెరిగిన వయస్సు; కళ్ళనిండా నీళ్ళు.

"ఆహా! వచ్చావా! నువ్వు ఇంకా రాలేదే అనుకుంటూన్నాను" నవ్వాడు షిచిరి "రా! రా! లోపలికి రా!" అని తలుపు తెరుస్తూ; ఒకనాడు దొంగగా తనను కత్తి చూపించి బెదిరించిన ఆ వ్యక్తిని మనస్పూర్తిగా తిరిగి ఇంటిలోనికి ఆహ్వానిస్తూ. మారిపోయిన ఆ దొంగ షిచిరి సాహచర్యంలో తన జీవితాన్ని సార్థకం చేసుకున్నాడు.

- కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో