Facebook Twitter
మరో కోణం

మరో కోణం

 


“నువ్వు యెన్నయినా చెప్పు సురేష్ బాబు, వాడి గతం తెలిసినవారెవరికి వాడిపై ప్రేమ, అభిమానం ఉన్నట్టుండి పుడుతాయా?”  సురేష్ రాముడిని ఆనందంగా మెచ్చుకుంటుంటే చిరాగ్గా ముఖంపెట్టి తన విసుగునంతా మాటలలో ప్రదర్శించాడు సాంబశివయ్య. ‘రాముడంటే ఎవరు?ఒకప్పుడు తమ ముందు మురుకులు,కోవా బిళ్లలు చేయించి, అంగడిలో పెట్టి అవే జీవనాధారంగా అమ్ముకుని బ్రతికినవాడు.’ రాముడంటే అందరికీ ఉన్న అభిప్రాయమిది. ఎలాగైనా డబ్బు బాగా సంపాదించాలి అని ఎవరికీ తెలియకుండా ముంబయికి వెళ్లిపోయినవాడు. ఎంత సంపాదించాడో,ఎలా సంపాదించాడో కాని అనుకోకుండా ఒకనాడు ఉరుకులు పరుగుల మీద వచ్చి చెరువు కట్ట దగ్గర భూమికొని చదును చేయించి మళ్లీ వస్తానని చెప్పి మూడేండ్లయినా తన గ్రామంవైపు తిరిగి చూడనివాడు,ఈ రోజు ఆ స్థలంలో గుడిని కట్టించి  విగ్రహప్రతిష్ఠకు ఏర్పాట్లు చేస్తుంటే, అది చూసి  తెలుగుమేష్టారు సురేష్  రాముడి దయార్ద్ర హృదయాన్ని, దానగుణాన్ని విడవకుండా పొగడుతుంటే వినడానికి కంపరంగా ఉందనుకుంటున్నాడు ఆ ఊరి మోతుబరి రైతు సాంబశివయ్య.


పేదరికం పుట్టించిన కసితో ముంబయికి పారిపోయి ఈ రోజు పట్టు పంచె,చొక్కాలతో నున్నగా తయారయి తిరుగుతుంటే,బక్కమనిషి పాపాలన్నో చేసికాని ఇంత సంపాదించలేడని ఊరంతా  నోటి దండోరా వేస్తున్న అందరికీ తెలుసు అమ్మకాలు,కొనుగోలులో రాముడు ఆరితేరినవాడని,ఇప్పుడదే సూత్రాన్ని నిర్మాణాల్లో కూడా ప్రయోగించే ఉంటాడని,అందుకే చేసిన పాపాలకు పరిహారంగా తన ఊరిలో రామాలయాన్ని నిర్మించి పాపాలు కడిగేసుకోవాలని చూస్తున్నాడని చాటుమాటుగా చెవులకు తగినంత వనరులందిస్తున్నారు.మరి చెవిన పడిన మాట నోరు రిమోట్ లేని నాలుక సహాయంతో విశ్వవ్యాప్తం చేయాలని ప్రయత్నిస్తోంది. “చూడండి సాంబశివయ్యగారు,అతడీరోజు ముంబయిలో పెద్ద బిల్డరు.నాలుగు బహుళ అంతస్థుల భవనాలకు అధిపతి.అందరు ఆశ్చర్యపడేలా భూమినుండి ఆకాశానికి ఎగసిన రాకెట్ లా పేదరికంనుండి ధనవంతుడిగా తనను తాను రూపుదిద్దుకున్నాడు.” “ఎన్నిపాపాలు చేసుంటాడో! సాంబశివయ్య గొంతులోవ్యంగ్యం తారస్థాయిలో పలికింది.


‘ ఇతడికి గుడి కట్టించిన రాముడి గురించి చెప్పేకన్నా గుడిలో రాముడి గురించి చెప్పటం మేలు’ అనుకున్నాడు సురేష్. “ ఇంతకీ మీరు విగ్రహప్రతిష్ఠకు వస్తున్నారా లేదా?”అనుమానంగా అడిగాడు సురేష్. “ ఏం మాటయ్యా అది,ఎందుకురాను? దేవుడేం చేస్తాడు, పాపాలు చేసి సంపాదించి నాకు డికట్టమని అడుగుతాడంటావా?” “ సరే మరి, బయలుదేరుదాం లేవండి.”  వీరు లేవడం చూసి మరికొందరు రైతులు కూడా వీరివెంట నడిచారు. అందరిలోను  పాపపుణ్యాల మథనమే.ఏదైనా మాట్లాడాలన్నా మాటలు తిరిగి తిరిగి అదే చర్చకు వేదికవుతున్నాయి. “ మీకు నాకు మధ్య వాదనలెందుకుగాని, పదండి అందరు అప్పుడే వచ్చేసారు.” బశివయ్యను చూసి ఆప్యాయంగా దగ్గరకు వచ్చాడు రాముడు. “ పెద్దవారు క్రింద కూర్చోగలరా ప్రతిష్ఠ పూర్తయేవరకు?” ఆతృతగా అడిగాడు రాముడు. “నీకంటే పెద్దవాడిని కాదులే!” అంటూ క్రిందపరచిన చాపపై కూర్చున్నాడు సాంబశివయ్య. కలుక్కుమన్నమనసుతో మౌనంగా ముందుకు కదిలాడు రాముడు. “ పనేదైనా ఉందా రాముడూ..” అని ఆప్యాయంగా పిలుస్తూ రాముడిననుసరించాడు సురేష్. “ మీరొక్కరే మాస్టారూ రాముడూ, అంటూ ఆప్యాయంగా పిలుస్తున్నారు. అందరు రాముడుగారూ అని పిలుస్తూ ప్రక్కకు జరిగిపోతుంటే ముంబయికి వెళ్లి నా ఆత్మీయులకు దూరమయానా అనే బాధ కలుగుతోంది.” “ దానికి బాధెందుకు రాముడూ నువ్వు పట్టుదలతో ఎదిగావు, కావలసినదానికన్నా ఎక్కువే సంపాదించుకున్నావు.నువ్వు పుట్టిన ఊరికి చక్కటి దేవాలయాన్ని కట్టించి విగ్రహప్రతిష్ఠ చేయిస్తున్నావు.ఇంతకన్నా భాగ్యం ఉంటుందా.పద అటు హోమం దగ్గర కూర్చుందాం.”

 


కాంతివంతంగా వెలుగుతున్న హోమాన్నే తదేకంగా చూస్తున్నాడు రాముడు. ‘ పాపాలు  తోడిపోస్తున్నాడేమో’ మనసులోనే విమర్శను నాటుకుని అటుతిరిగి నవ్వుకున్నాడు సాంబశివయ్య. అలా తిరిగినపుడు  మరోకోణంలో కనబడ్డ దృశ్యాన్ని ఆసక్తిగా చూసాడు. పూల మాలలు,విడి పూలు  తన మనుషులద్వారా అమ్మిస్తున్నాడు పూలతోటవేసి అమ్మకాలు లేక విలవిలలాడిన క్రిష్ణప్ప. కొబ్బరికాయలు, కర్పూరం, సాంబ్రాణి, వత్తులు, పసుపు, కుంకుమ వంటి పూజసామాను అమ్ముతున్నాడు మొన్నటి దాకా  గోలీలాడుకుంటూ తండ్రి దగ్గర చీవాట్లు తిన్న మల్లన్న. ప్రసాదంగా లడ్డు,పులిహోర అందంగా ఆకు దొన్నెలలో నోరూరిస్తున్నాయి. విగ్రహప్రతిష్ఠ జరుగుతోంది.భక్తిభావంతో అందరు లేచినిలబడి తన్మయత్వానికి లోనవుతున్నారు.తమకీ అవకాశం కల్పించిన దేవుడికి నమస్కరిస్తూ తీర్థప్రసాదాలకు వేచి చూస్తున్నారు.అయితే అటు పూలు అమ్మే క్రిష్ణప్ప, కొబ్బరికాయలు,పూజసామాను అమ్మే మల్లన్న,చివరకు గుడి బయట వదలిన చెప్పులకు కావలి ఉండే కుర్రాడు చంద్రం గుడిలోని రాముడినే కాదు,తమకింత ఆధారం కల్పించిన గుడిని నిర్మించిన రాముడినీ మనసారా దీవిస్తూ మనసులోనే నమస్కరించుకుంటున్నారు.


ప్రసాదాన్ని కళ్లకద్దుకుని ఆప్యాయంగా తింటున్నారు భక్తులు. ప్రసాదానికై అప్రయత్నంగా చెయ్యి చాచాడు సాంబశివయ్య.లడ్డులోని మాధుర్యం అతడి ఆలోచనలోని చేదు భావాలకు తియ్యదనాన్ని అలదుతోంది. రామనామస్మరణతో దేవాలయ ప్రాంగణం మార్మ్రోగిపోతోంది. “ ఇప్పుడు మన ఇష్టదైవం రాముడికి గుడి కట్టించిన మన రాముడు గారు మాట్లాడుతారు.” పూజారి చేతినుండి మైకందుకున్న రాముడు  చిన్న చిరునవ్వే పలకరింపుగా  అందరినీ ఓ మారు చూసాడు.కొందరి కళ్లలో ప్రశంస,మరికొందరి కళ్లలో అనుమానాలు, అయితే అందరిలోను అదోరకమైన ఉత్సుకత! “ఈ దేవాలయ నిర్మాణాన్ని ఎలా చేయగలిగాడనే ప్రశ్న మీ అందరిని తొలుస్తోంది.అవునా ?”రాముడి గొంతు గంభీరంగా పలికింది. “దీనికి సమాధానం చెప్తాను కాని మీరు నన్ను మునుపటిలాగే ఆప్యాయంగా రాముడూ అని పిలవాలి మరి.” అందరు చిరునవ్వుతో తలలూపారు. ముంబయిలో నేను ముందు నేర్చుకున్నది వ్యాపార లక్షణాలు.అందులో మొదటిది కష్టపడటం,ఆ తరువాతది కష్టపడటమే,అలా అలా చివరివరకు కష్టపడటమే!అయితే నా కష్ట ఫలితాన్ని నాకు జన్మనిచ్చిన గ్రామంతో పంచుకోవాలనిపించింది. 


ఆ కోరికే రామాలయమైంది. మీరనుకున్నట్లు అక్రమాలు,మోసాలు,కుతంత్రాలు లేని సంపాదనే ఇది. సంపాదించుకున్నవారిని చూసి సులభంగా ఎందరిని మోసం చేసాడో అంటారు. కష్టపడే తత్వం ఉన్నవాడికి ఒకరిని మోసం చేయాల్సిన పనిలేదు, పని చేయాలన్న వ్యామోహం ఉంటే చాలు. నా ఆరాధ్య దైవం రాముడి దయతో నేను దేవాలయ నిర్మాణం కావించగలగడం నా పూర్వజన్మ సుకృతంగానే భావిస్తున్నాను. సురేష్ మాస్టారి సలహాలు నాకు రామబాణాలే! ఇక చేయాల్సిందేమీలేదు అనుకోవడంలేదు. పాతబడిన మన బడికి అదనపు గదులు,గుడి పూజారులకు వసతి గృహాలు,గుడి ప్రాంగణంలోనే చక్కని వివాహవేదిక కట్టించాలని నా కోరిక. ఇప్పటికిప్పుడు కాకపోవచ్చు. మీ సహకారముంటే త్వరలోనే ఆ పనులు కూడా పూర్తి చేస్తాను.” “మా సహకారం నీకెప్పుడు ఉంటుంది. మనుషులెపుడు తమకలవాటైన ఒకే కోణంలో ఆలోచిస్తారు. కాని మరో కోణంలో ఆలోచించగలిగితే ఇన్ని అపోహలు, అపార్థాలు ఉండవు,అనుమానాలు దరిచేరవు. శ్రమపడే నీ తత్వం మన ఊరి యువతకు ఆదర్శం కావాలి రాముడూ. అంటూ రాముడి భుజాన్ని ఆప్యాయంగా  చరిచాడు సాంబశివయ్య. సురేష్ ముఖంలో ఆనందం,రాముడి కళ్లలో ఆనందభాష్పాలు. రామ రామ జయ రాజారామ  రామ రామ జయ సీతారామ రఘుపతి రాఘవ రాజా రామ  పతితపావన సీతా రామ. రామనామ స్తోత్రాలు ప్రతిధ్వనిస్తున్నాయి.

- సి.ఉమాదేవి.