Facebook Twitter
స‌భ‌కు న‌మ‌స్కారం


తెలుగువ‌న్‌-అక్ష‌ర‌యాన్ ఉగాది క‌థ‌ల పోటీలో ద్వితీయ‌ బ‌హుమ‌తి రూ. 3,116 పొందిన క‌థ

'స‌భ‌కు న‌మ‌స్కారం'


''సభకి నమస్కారం... అందరికీ ఆహ్వానం !'' అంటూ మొదలెట్టాడు సచ్చిదానందరావు.

''రాన్రాను మన సమాజంలో 'బుక్‌ కల్చర్‌' కనుమరుగై, 'లుక్‌ కల్చర్‌' పెరిగిన విషయం అందరికీ తెలిసిందే! సాహిత్యానికీ, సాహితీవేత్తలకీ గుర్తింపు తగ్గిపోతున్న ఈరోజుల్లో... ఒక కవీ, లేదా కవయిత్రికి
సంబంధించి ఐదంటే ఐదు కవితలైనా పత్రికల్లో అచ్చయ్యే అవకాశమే లేని ఈ కష్ట పరిస్థితుల్లో... పది కవితలు పత్రికల్లో ప్రింటవడమంటే మాటలు కాదు. అలాంటిది- గతవారమే ప్రముఖ మాసపత్రిక 'కౌజుపిట్ట'లో తన పదవ కవిత ప్రచురింపబడ్డ 'ప్రఖ్యాత' కవయిత్రి, 'చిరుజల్లు' అవార్డు గ్రహీత, 'సాహితీ సరస్వతి' బిరుదాంకిత, 'పారాణి' అనే కలంపేరుతో ప్రసిద్ధి గాంచిన శ్రీమతి 'పాముల ప్రసన్నరాణి' గారికి మా 'మనస్విని' సంస్థ తరపున ఇలా 'ఘనసత్కారం' చేయగల అవకాశం కలగడం మా అదృష్టంగా భావిస్తూ... మేడమ్‌గారి 'సాహితీసేవ'కి గుర్తింపుగా 'అభినవ మొల్ల' అనే బిరుదుని ఆవిడకి బహూకరిస్తున్నామని తెలుపడానికి సంతోషిస్తున్నాం!''

'మనస్విని' సాహితీ, సాంస్కృతిక, సాంఘిక, సామాజిక, రాజకీయ, స్వచ్ఛంధ సంఘసేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడూ- కార్యదర్శీ- కోశాధికారీ- ప్రొప్రయిటర్‌, కమ్‌ 'హోల్‌ అండ్‌ సోల్‌- ఆల్‌ ఇన్‌ వన్‌' అన్నీ తానే అయిన సచ్చిదానందరావు వేదికపై మైకులో వీరావేశంతో ప్రేక్షకుల నుద్దేశించి చెప్తున్నాడు.

అలా... చిన్నాచితకా పత్రికల్లో 'పది' కవితలు ప్రచురింపబడిన 'ప్రఖ్యాత కవయిత్రి పారాణి' మొదలు- ఏడాదికోసారి వెలువడే 'ఎక్కడా కనిపించని' ఓ చిన్నపత్రికలో తన ప్రథమ కవిత ప్రచురింపబడటం ద్వారా 'అసమాన ప్రతిభాపాటవాలను' ప్రదర్శించి 'అభినవ అల్లసాని' బిరుదుతో 'సముచిత సత్కారం' పొందనున్న 'ప్రముఖకవి ప్రవరాఖ్య' (కలంపేరట అది!) వరకు ఓ పాతిక మంది దాకా 'ప్రముఖ, ప్రఖ్యాత, ప్రసిద్ధ, సుప్రసిద్ధ' కవుల 'ప్రతిభ'ను తనదైన శైలిలో మైక్‌లో ఊదరగొట్టేశాడు... సంస్థ ప్రెసిడెంట్ కమ్‌ సెక్రెటరీ కమ్‌ ట్రెజరర్‌ కమ్‌ ఎట్సెట్రా... ఎట్సెట్రా!

నాకు మహా చిరాకుగా వుంది. సాధారణంగా నేను 'ఇలాంటి' సభలకి రాను. కానీ, తనకు 'ఘనసత్కారం' చేస్తున్నారనీ, ఈ సత్కారసభకి నేనొస్తే తానెంతో సంతోషిస్తాననీ 'పారాణి' ఎంతో గారాలుపోతూ రిక్వెస్ట్‌ చేస్తే- వచ్చాన్నేను. ఇంతలో- స్టేజ్‌ పైన అనౌన్స్ మెంట్......

కాసేపట్లో ముఖ్యఅతిథిగారు వచ్చేస్తారు. ఆయన రాగానే సభని ప్రారంభించేద్దాం. అప్పటివరకూ ప్రేక్షకుల ఆహ్లాదం కోసం ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి...''

***

''నాకో డౌటు సార్‌...''

నా ప్రక్కనే కూర్చున్న 'పారాణి' పలకరింపుకి తలతిప్పి 'ఏమిట'న్నట్లుగా చూశానామె వంక.

''దాదాపు పదిహేనేళ్లకు పైబడే మీరీ ఫీల్డ్‌లో ఉన్నారు కదా- మరి, ఇంతగా సాహితీసేవ చేసినా... మీకు ఒక్క అవార్డు కూడా రాలేదెందుకండీ?''

ఉలిక్కిపడ్డానామె ప్రశ్నకి. నా సమాధానం కోసమేనన్నట్లు నావైపే అమాయకంగా, ఆసక్తిగా... కాస్త 'జాలి'గా, ఇంకాస్త 'సానుభూతి'గా చూస్తున్న ఆమెని చూసి ఏమనాలో తెలీలేదు నాకు.

''అవునూఁ... ఇప్పటివరకూ పత్రికల్లో మీ కవితలెన్ని అచ్చయ్యుంటాయ్?'' అనడిగాను.

తన ప్రశ్నకు నేను బదులివ్వకుండా తానూహించని ప్రశ్న నేనడిగేసరికి- కాసేపు 'అర్థంకాని అడ్వర్టయిజ్మెంట్' చూస్తున్నట్లు అయోమయంగా చూసింది 'పారాణి' నావంక.

''ఇందాకాయన మైకులో చెప్పారుగా... మొన్నటి కవితతో కలిపి మొత్తం పది !'' సందిగ్ధంగా బదులిచ్చినా, అందులో తన 'సాహితీప్రతిభ' తాలూకు దర్పం ధ్వనించిందామె స్వరంలో.

''సభ మొదలయ్యేలోపు నా కవితొకటి వినిపిస్తా... వినండీ!'' అంటూ నా అంగీకారం లేకుండానే మొదలెట్టేసింది –

              ''ఎముకలు పిడుగుల్లా విరుచుకు పడుతూంటే...

                                                                నరాలు ఉరుముల్లా ఉక్కిరిబిక్కిరి చేసేస్తూంటే...

                                                                వర్షించే వర్షంలా గర్భాశయగోడలు చీలుస్తూంటే...

                                                                తనకోసం నడిచొచ్చే నక్షత్రానికి పురుడు పోస్తూ...

                                                                ఊపిరికే ఊపిరులూదుతూ- రాలే కన్నీటికూర్పును

                                                                ఆనందబాష్పాలుగా అనుభవిస్తూ...

                                                                తన కడుపుని చీల్చే కెరటం కోసం

                                                                అరుపుల ఆరాటంతో నెత్తుటి పోరాటం చేస్తూ...

                                                                అమృతం కోసం పర్వతం మోసిన కూర్మంలా

                                                                తనలోంచి చీల్చుకు వచ్చిన రక్తపుముద్దను చూస్తూ

                                                                కాన్పు కష్టాన్ని కాలుతున్న కాష్టంలా మోస్తూ...

                                                                అమ్మతనంలోకి అడుగేస్తుంది 'ఆడతనం'...

                                                                'ఆడతనం- అమ్మతనమే' కదా సృష్టికి మూలం !!''

మాతృత్వాన్ని ఎంత భీకరంగా వర్ణించొచ్చో మొదిసారి అర్థమై... భయమేసింది నాకు.

'ఎలావుంది?' అన్నట్లు కనుబొమలు ముడిపెట్టి చూస్తూన్న ఆమెని చూస్తూ- ''కడుపులో వేళ్లు దూర్చి పేగుల్ని మెలిపెట్టి తిప్పినట్లుంది!'' అన్నాను. ''థాంక్యూ సర్‌!'' అంటూ మురిసిపోతూ-

''ఇంతకీ మీకొక్క అవార్డైనా ఎందుకు రాలేదో చెప్పనేలేదు?!'' అంది నాపై జాలి కురిపిస్తూ.

టీవీ ఛానెళ్ళలో తెలుగు డబ్బింగ్‌ సీరియళ్ళని రెగ్యులర్‌గా ఫాలో అయ్యే అమాయకురాళ్ళ పట్ల నాకున్న 'సింపతీ ఫీలింగ్‌'తో చూశానామె కళ్ళలోకి -

''నిజమే! మూడ్నెల్ల క్రితమే మొదలెట్టి పది కవితలు పూర్తిచేసిన మీకే ఇన్నిన్ని అవార్డులూ, రివార్డులూ, బిరుదులూ వచ్చేస్తుంటే... పదిహేనేళ్లుగా ఈ రంగంలో ఉంటూ- రెండొందల కథలు రాసి, ఏడు పుస్తకాలు అచ్చేసిన నాకు ఒక్క అవార్డయినా రాకపోవడం వింతగానే ఉంటుంది... మీవంటి వారికి!'' అని, నా మాటల్లోని అర్థం ఆమెకి అర్థంకాదన్న విషయం గుర్తొచ్చి, దీర్ఘంగా నిట్టూర్చి- ''...మీ ప్రశ్నకు సమాధానం నేను చెప్పడం కంటే మీరే స్వయంగా తెలుసుకునే రోజు త్వరలోనే వస్తుందని నేననుకుంటున్నాను. ఒకవేళ రాకపోతే...'' అంటూ అసంపూర్తిగా ఆపేశాను.

''ఊఁ... చెప్పండి సార్‌! నేను తెలుసుకునే రోజు ఒకవేళ రాకుంటే?'' అడిగింది ఉద్వేగంగా.

అది విని నాకు మళ్లీ నవ్వొచ్చింది- ''ఏముందీ... ఆరోజు రాకపోతే మీరు చాలా అదృష్టవంతులన్నమాట! మీరెప్పటికీ ఆనందంగా ఉంటారు!'' అంటూ ప్రశాంతంగా నవ్వేశాను.

''ఏంటో... మీ మాటల్లో ఒక్క ముక్క కూడా నాకర్థం కాలేదంటే నమ్మండి!'' అంది.

''ఆ విషయం నాకు తెలుసులెండి!'' అని, ''అదిగోండి... అతిథులంతా వేదిక ఎక్కేశారు!'' అన్న నా మాటలకి తలతిప్పి స్టేజీవైపు చూసిన 'పారాణి'- గబుక్కున సీట్లో సర్దుకొని కూర్చుంది.

***

''ఇప్పుడు ముఖ్యఅతిథి డా|| కవిశ్రీ (ఇదీ కలంపేరే కాబోలు!)గారు తమ సందేశాన్ని వినిపిస్తారు!'' అని ప్రకించాడు సభాధ్యక్షుడూ కమ్‌ సంస్థాధ్యక్షుడూ అయిన సచ్చిదానందరావు.

డా|| కవిశ్రీగారు సీట్లోంచి స్టైలుగా లేచి, విలాసంగా నడుస్తూ మైకు ముందుకొచ్చారు.

''...సభాసరస్వతికి వందనం- సదస్యులందరికీ నా అభినందనం! మీకందరికీ తెలుసు... మన దేశంలోని అత్యున్నత స్థాయి నుంచి అతిచిన్న స్థాయి వరకూ ఉన్న అవార్డులూ, పురస్కారాలూ, సత్కారాలూ,
బిరుదులన్నీ... కాస్త పేరూ, అనుభవమున్న వాళ్ళకీ, పండితులకీ, పెద్దవాళ్ళకే తప్ప- కొత్తవాళ్ళకి గాని, వర్ధమానులకి గాని ఎప్పుడూ వచ్చిన దాఖలాలు లేవు. అలాంటప్పుడు మరి కొత్తవాళ్ళను
గుర్తించేదెవ్వరు? వర్ధమానులను ప్రోత్సహించే దెవ్వరు? ఈ అవార్డులూ, బిరుదులూ కొత్తగా రాస్తున్న వాళ్ళకెలా వస్తాయి? వర్ధమాన కవులకు సన్మానాలూ, సత్కారాలూ చేసేదెవ్వరు? ఈ ఆలోచనే ఆవేదనగా
మారి మిత్రుడు సచ్చిదానందరావు మనసుని కొన్నేళ్లుగా కలచివేసింది...''

డా|| కవిశ్రీగారి 'లాజిక్‌' వింతగా అన్పించేసరికి- మరింత శ్రద్ధగా వినసాగాన్నేను.

''...అందుకే- చీకటిని తిడుతూ కూర్చునేకంటే చిరుదీపం వెలిగించడానికి తానే పూనుకున్నాడు మన సచ్చిదానందరావు. వర్ధమానులను ఉద్ధరించడానికి తానే నడుం బిగించాడు!''

ప్రేక్షకుల్ని చప్పట్లు కొట్టుకోమన్నట్లు తన స్పీచ్‌లో కాస్త 'టైమ్‌ గ్యాప్‌' ఇచ్చారు డా||కవిశ్రీ.

పురస్కారాలు 'పుచ్చుకోవడాని'కొచ్చిన పాతికమందీ, వాళ్ళలో ఒక్కొక్కరి తరపు నుంచి కనీసం ఇద్దరు చొప్పున ఆ 'సత్కార సంబరాన్ని' చూసి తరించాలని వచ్చిన వారి కుటుంబసభ్యులు ఓ యాభైయ్యరవై
మందీ, నాలాగా 'అబ్లిగేషన్‌'తో వచ్చిన జనరల్‌ వ్యక్తులు పదీ, పదిహేను మందీ... వెరశి హాల్లోని వందమంది ప్రేక్షకులు- ముఖ్యఅతిథిగారి 'ఆంతర్యం' అర్థమై 'తప్పట్లు' చరిచారు.

ఆ తర్వాత డా|| కవిశ్రీగారు సాహితీరంగంలో కొత్తగా రచనలు చేస్తున్న కవుల పట్ల, వారికి 'అందుబాటు'లో లేని 'అవార్డులూ, అవకాశాల' పట్ల తన తీవ్ర ఆవేదనని వ్యక్తంచేస్తూ వీరావేశంతో ప్రసంగించి, చివరికి-
''... కాబట్టి నేన్చెప్పేదేమిటంటే... వీరులలో వర్ధమాన మహావీరుడు ఎంతి గొప్పవాడో- కవులలో కూడా వర్ధమాన మహాకవులే గొప్పవారని నా ఉద్దేశ్యం. అలాంటి వర్ధమాన కవులను సన్మానిస్తూ, బిరుదులిచ్చి
సత్కరిస్తూ, వర్ధమాన మహాకవుల అభ్యున్నతి కోసమే అహర్నిశలూ శ్రమిస్తున్న 'సాహితీబ్రహ్మ' సచ్చిదానందరావుని మనసారా అభినందిస్తూ... వర్ధమాన కవుల 'మనసు విని' తన 'మనస్విని' సంస్థ ద్వారా ఆయన చేస్తున్న 'సాహితీకృషి'ని అభినందిస్తూ మీ దగ్గర సెలవు తీస్కుంటున్నాను!'' అంటూ ముగించారు.

ఉలిక్కిపడ్డాన్నేను... జైనమతాన్ని స్థాపించిన వర్ధమాన మహావీరుడికీ, ఇప్పటి ఈ వర్ధమాన మహాకవులకీ మధ్య పొంతన చూపించిన ఆయన 'విజ్ఞానాన్నీ', ఆయన చూపిన 'పోలిక'నీ విని !

కానీ, ఆయన ప్రసంగాన్ని అంతగా పట్టించుకోని, పట్టించుకున్నా అర్థంచేసుకోలేని ప్రేక్షక 'యువకవులు' తప్పట్లతో తమ ఆనందాన్నీ, అంతకుమించిన అమాయకత్వాన్నీ ప్రదర్శించారు.

''ఇప్పుడిక అవార్డుల బహూకరణ కార్యక్రమం మొదలౌతుంది!'' అనౌన్స్‌ చేశాడు సదరు సంస్థకీ, ఆ సభకీ 'హోల్‌ అండ్‌ సోల్‌' అయిన సచ్చిదానందరావు. దానికోసమే ఎంతోసేపట్నుంచి ఎదురుచూస్తున్న
వర్ధమాన కవిప్రేక్షకులంతా తప్పట్లతో మరోసారి హాలంతా మార్మోగించారు.

ఆశ్చర్యపోయాన్నేను- 'అవార్డుల ప్రదానం' అనే మాట విన్నానుగానీ, ఈ 'అవార్డుల బహూకరణ' అన్నమాట ఇప్పుడే వింటున్నాను. బహుశా... ఈ యువకవుల కోసమే కొత్తగా కనిపెట్టిన 'నూతన సాహితీ
పదప్రయోగం' కాబోలు! నిజమే... ఇదంతా 'సత్కారాల సంతర్పణే' కదా మరి!!

ఆ తర్వాత 'సత్కారాల సంతర్పణ- బిరుదుల బహూకరణ' కార్యక్రమం మొదలైంది.

'అభినవ అల్లసాని, అపర తిక్కన, కలియుగ కాళిదాసు, నవయుగ నన్నయ, ఆధునిక అన్నమయ్య, అభినవ మొల్ల, వర్తమాన వాల్మీకి, కవికుల క్షేత్రయ్య, నవతరం వేమన, సాహితీ సరస్వతి, సాహితీ విశారద, కవికోకిల... వగైరా, వగైరా' బిరుదుల్ని- వికసిత విస్ఫారిత విచలిత దరహాస ముఖారవిందాలతో 'పుచ్చుకుంటున్న' కవుల్నీ, కవయిత్రుల్నీ చూస్తూవుంటే... నోట మాట రాలేదు నాకు. వాళ్ళలో కొందరికైనా 'తాము ఎవరి పేరుపై వున్న బిరుదుల్ని అందుకుంటున్నారో ఆ మహనీయుల గురించి కాస్తయినా తెలిసుంటుందా..?' అన్న అనుమానమూ కలిగింది.

అసలు... 'ఇలాంటి' సభలకు రావటం ఇదే మొదిసారి నాకు. 'పారాణి' ఉరఫ్‌ 'పాముల ప్రసన్నరాణి' నాతో మాట్లాడే సమయాల్లో ''మా యువకవులూ, యువ కవయిత్రులూ'' అనే పదాలు తరచుగా ఆమె మాటల్లో దొర్లుతూంటే... 'బహుశా కొత్తగా కవిత్వం రాసిపారేస్తున్న వీళ్ళంతా నిజంగానే 'నవయువతే కాబోలు!' అని అపోహ పడి- 'స్త్రీసహజ లక్షణం' కొద్దీ నలభయ్యో పడిలో వున్న 'పారాణి' తనని కూడా 'యువత'లో కలుపుకుని అలా మాట్లాడేదేమోనని అనుకున్నాను.

కానీ, ఇక్కడి 'తతంగం' చూస్తూంటే... ఈ 'యువ'కవుల్లో అందరూ నడివయస్సు దాటిన వాళ్ళూ, ఉద్యోగాల్నుంచి రిటైరై ఉబుసుపోక 'కపిత్వం' గీకేస్తున్న- సారీ... రాసేస్తున్న వాళ్ళేనని అర్థమైంది నాకు. ఈ 'కోణం'లోంచి చూస్తే... 'పారాణి' నిజంగానే 'యువ' కవయిత్రే! కాబట్టి 'యువ' లేదా 'వర్ధమాన' అనే పదప్రయోగాలు వీళ్ళ 'వయసు'కి వర్తించవనీ, వీళ్ళ 'రచనా వ్యాసంగానికి' మాత్రమే అన్వయించుకోవాలన్న అతిగొప్ప 'సాహిత్య జ్ఞానోదయమూ' నాకిప్పుడే కలిగింది. అయినా, నా పిచ్చిగానీ... ఈనాటి 'నిజమైన యువత'కి తెలుగులో 'మాట్లాడ్డమే' సరిగ్గా రాదు- ఇక 'కవిత్వం రాయడం' కూడానా?!

మరోవిషయం కూడా గమనించాన్నేను- వేదికపై జరుగుతున్న 'సన్మాన, సత్కార, పురస్కార, బిరుద బహూకరణ సభ'ని హాల్లో అందరి మధ్య సాదాసీదా ప్రేక్షకుడిలా చూస్తున్న నన్ను- ఒక్కరు కూడా
పలకరించలేదు. కనీసం నన్ను గుర్తుపట్టిన దాఖలా కూడా కనిపించలేదు. సాధారణంగా మార్కెట్లో కనిపించే ప్రముఖ దిన, వార, మాస పత్రికల్లో ప్రతినెలా రెండుసార్లయినా నా కథలూ, వ్యాసాలూ పబ్లిష్‌
అవుతుంటాయి కాబట్టి 'కథా సదస్సులు' లేదా కథాసంపుటుల, నవలల 'ఆవిష్కరణ సభ'లకి నేను వెళ్లినప్పుడు యువ రచయితల్లో కనీసం నలుగురైదుగురైనా నన్ను గుర్తుపట్టి పలకరించేవారు. కానీ, వర్ధమాన 'యువ మహాకవు'లతో నిండిన ఈ సభలో అంత 'సీన్’ ఏమీ లేదు. ఏంటో... వీళ్ళ లోకమే వింతగా వుంది, ఈ 'కవి ప్రపంచమే' కొత్తగా వుంది. పైగా, వీళ్ళలో నేను గుర్తుపట్టగలిగే కవులు కూడా ఎవరూ లేరు. అన్నీ ఎన్నడూ చూడని ముఖాలే... ఎప్పుడూ వినని పేర్లే !

అలాగని నా మిత్రుల్లో కవులెవరూ లేరని కాదు. కథారచయితగా నేను రచన్లు మొదలెట్టిన రోజుల్లోనే 'కవితాప్రక్రియ' వైపెళ్లి ఇప్పటికీ కవిత్వమే రాస్తూ కొనసాగుతున్న కవిమిత్రులున్నారు నాకు. అలాంటి
మిత్రుడొకడు ఈమధ్యే నాతో అన్న మాటలు- అకస్మాత్తుగా గుర్తొచ్చాయ్‌...

'' ఏంటోరా వంశీ... రాన్రాను తెలుగుభాషా- సాహిత్యాలు ఏమైపోతాయోనన్న ఆందోళన పెరిగిపోతోంది నాలో! తెలుగులో టీవీ ఛానెల్సూ, రేడియోలో ఎఫ్‌.ఎమ్. స్టేషన్లూ ఎక్కువౌడంతో వాటిల్లో యాంకర్లుగా,
జాకీలుగా వస్తున్న కుర్రాళ్ళ మాటల్లో తెలుగుభాష ఎలా ఖూనీ అవుతోందో తెలుసు కదా! అందమైన మన తెలుగుని ఇంగ్లీషూ, హిందీలతో కలిపేసి మాట్లాడేస్తూ... 'తెహింగ్లీషు' అనే 'అవాంఛిత సంకరభాష'గా ఎలా
మార్చేస్తున్నారో చూస్తూవుంటే... భాషాభిమానులుగా మనలాంటోళ్ళకి ఎంత బాధగా, ఆవేదనగా ఉంటుందో నీకూ తెలుసుగా ?!

ప్రసార మాధ్యమాలూ, సోషల్‌ మీడియాల ద్వారా 'కుర్ర యువత' తెలుగుకి ఇలాంటి 'చేటు' కలిగిస్తూంటే... గత రెండు మూడేళ్ల క్రితం సాహిత్యంలో- ముఖ్యంగా 'కవితాప్రక్రియ'లో ఓ కొత్త 'వృద్ధ యువతరం' పుట్టుకొచ్చి కవితాలోకాన్నంతా అతలాకుతలం చేసేస్తోంది.

వీళ్ళ వయస్సు ముప్ఫయ్యైదూ, నలభై నుంచి అరవై, డెబ్భయ్యేళ్ల దాకా వుంటుంది. ఏవో రెండు మూడు పిచ్చి కవితలూ, మినీ కవితలూ రాసిపారేసి- చిన్నాచితకా పత్రికల్ని పట్టుకుని అచ్చేయించుకుంటారు.
అంతే... ఇహఁ అప్పట్నుంచీ మొదలౌతుంది వీళ్ళ దండయాత్ర! తెలుగు సాహిత్యంలోనే తమని మించినోళ్ళెవరూ లేరనుకుంటారు. తమకంటే ముందునుంచీ రచనలు చేస్తున్న కవులూ, పండితులూ ఏమాత్రం ప్రతిభ లేకుండానే పైస్థాయికి వెళ్లారనీ, ''తమకున్న ప్రతిభాపాటవాలతో పోలిస్తే ఈ సీనియర్లు ఏపాటి?'' అన్న ' మైండ్ సెట్ ' ఏర్పరచుకుంటారు. ''ఇంతకాలం తాము రాయలేదు కాబట్టే గొప్పగొప్ప
అవార్డులు-రివార్డులు-బిరుదులన్నీ ఈ సీనియర్లు కొట్టేశారనీ, తాము రాయడం మొదలెట్టారు కాబట్టి- ఇక సీనియర్లు తోకముడిచేయాల్సిందే!'' అన్న భ్రాంతిలో ఉంటారు వీళ్ళంతా. ఏజ్‌లో కొంచెం లేటైనా నిన్న సాయంత్రమే నిద్రమేల్కొని తాము రాసిపారేసిన పిచ్చిరాతలకి రేపుదయానికల్లా దేశంలోని అన్ని అవార్డులూ, పురస్కారాలూ తమకే వచ్చేయాలనీ, వచ్చేస్తాయనీ భావిస్తూ... ఒక రకమైన 'మెంటల్‌ డిజార్డర్‌'లో పడిపోతారు.

ఇదిగో... సరిగ్గా 'ఇలాంటి'వాళ్ళ కోసమే మన రెండు తెలుగురాష్ట్రాల్లో జిల్లాకు పది చొప్పున 'సాహితీసేవా సంస్థలు' పుట్టుకొచ్చాయ్‌. వయసు మీరిన ఈ యువకవుల దగ్గర ఐదువేల నుంచీ ఐదొందల దాకా
అందినంతమేర డబ్బు దండుకొని- వీళ్ళకి సన్మానాలూ, సత్కారాలు చేయడమే కాక- ఆదికవి నన్నయ నుంచీ నిన్నమొన్నటి ఆధునిక సాహితీవేత్త వరకూ ; మహాత్మాగాంధీ నుంచి మదర్‌ థెరెస్సా దాకా
చనిపోయిన వాళ్ళందరి పేర పురస్కారాలు ఏర్పాటుచేసి బిరుద ప్రదానాలు కూడా చేసేస్తున్నారు. ఈ అభినవ కవివరేణ్యులు తమకున్న ఆర్థిక స్థాయీ, స్తోమతలను బట్టి సన్మాన, సత్కారాలు చేయించుకొని,
తమకు నచ్చిన బిరుదులు కొనేసుకుంటున్నారు.

ఓపెన్‌ మార్కెట్లో 'తమలాంటి'వాళ్ళ కోసమే ఏర్పాటుచేసిన పురస్కారాలన్నీ కొనేస్కుని తమ బయోడేటాలో 'అవార్డుల లిస్టు' పెంచుకోవాలన్న 'యావే' తప్ప- నిజంగా కష్టపడి 'రాసి', తమ ప్రతిభను 'రచన'లో చూపి 'పేరు' తెచ్చుకుందామన్న బుద్ధి, ఆలోచన వీళ్ళలో మచ్చుకైనా కనిపించవు. వీళ్ళలో చాలామంది రచనల సంఖ్య రెండంకెలకు కూడా చేరదు కాని- వీళ్ళు పుచ్చుకునే పురస్కారాల సంఖ్య మాత్రం మూడంకెలకు దగ్గరగా ఉంటుంది. అంతెందుకు- చెపితే నమ్మవుగానీ... వీళ్ళలో 'శతాధిక అవార్డుల గ్రహీత'లు కూడా వున్నారు తెలుసా?''

***

''ఇప్పుడు 'శతాధిక అవార్డుల గ్రహీత' శ్రీ గున్యారం గున్నేశ్వర్రావుగారికి ఘనసత్కారంతో పాటు మా 'మనస్విని' సంస్థ ద్వారా ఆయనకు 'అభినవ భోజ' బిరుదును బహూకరిస్తున్నాం. ఇది శ్రీ గున్నేశ్వర్రావుగారు అందుకునే 'నూట అరవైనాలుగో అవార్డు' అని మనవి చేస్తున్నాను!''

మైక్‌లో సచ్చిదానందరావు ప్రకటనకి 'ఫ్లాష్‌బ్యాక్‌' లోంచి తేరుకుని వేదిక పైకి చూశాను.

'గున్యారం గున్నేశ్వర్రావు' కాబోలు- మెడనిండా బోలెడు మెడల్స్‌ వేలాడేసుకుని, 'టూత్‌పేస్ట్‌ అడ్వర్టయిజ్మెంట్'లో లాగ ముఖంనిండా నవ్వులు చిందిస్తూ వేదిక మీదకొచ్చి, సన్మానం జరిపే భారీ 'ఆసనం'పై నిజంగా 'భోజ మహారాజు'లా దర్జాగా కూర్చున్నాడు.

అతడి మెడలోని ఆ 'మెడల్స్‌' చూడగానే ఠక్కున గుర్తొచ్చింది నాకు- పత్రికల్లోని 'సభలూ- సమావేశాలు' శీర్షికల్లో ఇతగాడు ఇలాగే మెడల్స్‌ తగిలించుకుని సన్మానం చేయించుకుంటున్న ఫోటోలు నేను చాలాసార్లు చూశానని! అంతేకాదు- ప్రతీసారి ఇతడికి సన్మానం చేసి- అవార్డులూ, బిరుదులూ 'బహూకరించేది'... ఈ 'మనస్విని' సంస్థ ద్వారా ఈ సచ్చిదానందరావేనని చాలాసార్లు చదివిన విషయం కూడా జ్ఞాపకం వచ్చింది నాకు.

వెంటనే ఓ 'అవాంఛిత ధర్మసందేహం' నా మనసులో అకస్మాత్తుగా ఉదయించింది. అప్పటివరకూ మౌనంగా ఉన్న నేను- నా సందేహాన్ని నివృత్తి చేసుకునే నిమిత్తం... నాకు ఇటుప్రక్క కూర్చున్న ఓ 'వర్ధమాన వృద్ధకవి'ని కదిపాను -

''ఏమండీ! ఇంతకీ ఆ గున్నేశ్వర్రావుగారు ఎన్ని రచన్లు చేశారు? ఏమేం రాశారు?'' అని.

గర్భగుడిలో దేవుడి కల్యాణాన్ని కళ్ళార్పకుండా అత్యంత భక్తిప్రపత్తులతో వీక్షించే అపర భక్తాగ్రేసరుడిలా- వేదికపై జరుగుతున్న గున్నేశ్వర్రావు 'సన్మాన సంరంభాన్ని' తన్మయత్వంతో, తాదాత్మ్యతతో తిలకిస్తున్న ఆ 'నడివయసు దాటిన' యువకవి- వేదిక పైనుంచి తన చూపులు తిప్పకుండానే-

''ఏమో సార్‌, నాకూ తెలీదు. అయినా... ఎన్ని రాస్తే, ఏమేం రాస్తే మనకెందుకండీ! ఆయన అందుకున్న అవార్డులు చూడండి... నూట అరవైనాలుగంటే మాటలా? సెంచరీ క్రాస్‌ చేసి, డబుల్‌ సెంచరీ వైపు
దూసుకెళ్తున్నాడు మహానుభావుడు! ఆయన రికార్డెవ్వరూ 'బ్రేక్‌' చేయలేరు. మన రెండు రాష్ట్రాల్లోనూ ఇన్ని అవార్డులు తెచ్చుకున్నోళ్ళెవరూ లేరు తెలుసా సార్‌!'' అన్నాడు.

''అవును... అవార్డులు 'వచ్చినవాళ్ళుంటారు గాని- ఇలా 'తెచ్చుకున్నవాళ్ళు' నాకు తెలిసి దేశంలోనే లేరనుకుంటా!'' అన్నాను- మాటల్లోని 'శ్లేష' అతనికి గ్యారంటీగా అర్థంకాదన్న నమ్మకంతో.

నా నమ్మకం వమ్ముకాలేదు. అతడు ఉత్సాహంగా తలతిప్పి నావైపు చూస్తూ- ''ఔను కద్సార్‌! అసలు అన్ని అవార్డులంటే మాటలా? తక్కువలో తక్కువగా ఒక్కోదానికి మూడువేలు వేసుకున్నా...'' అంటూ
గాల్లోనే ఏవేవో లెక్కలు వేస్కుని, ''హమ్మోఁ... వందకే మూడు లక్షలౌతుంది సార్‌!'' అంటూ గుండెల మీద చేయి వేసుకుని- ''కవిత్వానికి అంతంత పెట్టడమంటే... ఆయనకు కాబట్టి చెల్లింది! మనలాంటి
సామాన్యులకి సాధ్యమా సార్‌?!'' అన్నాడు.

ఏమనాలో నాకర్థంకాలేదు కానీ, ఒక్కటి మాత్రం బాగా అర్థమైంది- ఈ 'నవతరం వృద్ధ కవు'లందరికీ ఆ 'గున్యారం గున్నేశ్వర్రావే' స్ఫూర్తీ, ఆదర్శం, మార్గదర్శి, అండ్‌ 'హీ-మ్యాన్‌' అని !

***

వేదికపై 'సత్కారాల సంరంభం- బిరుదుల బహూకరణల సంబరం' ముగిసింది కాబోలు- 'అవార్డు గ్రహీత'లంతా కలసి 'గ్రూప్‌ ఫోటో' తీయుంచుకుంటూండగా... 'మనస్విని' సంస్థ 'హోల్‌ అండ్‌ సోల్‌ ప్రొప్రయిటర్‌' సచ్చిదానందరావు మైక్‌లో 'వందన సమర్పణ' చేయసాగాడు -

''అవార్డు లందుకున్నవారికి అభినందనలు... సభలో పాల్గొన్నవారికి ధన్యవాదాలు! ఒక ముఖ్య ప్రకటన... వివిధ రంగాలలో విశేషకృషి చేస్తున్న ఎందరో 'కొత్తవాళ్ళ' కోరిక మేరకు మా 'మనస్విని' సంస్థ ద్వారా ప్రతినెలా సాహిత్యంలో రెగ్యులర్‌గా మేమిచ్చే అవార్డుల్తో పాటు వచ్చేనెల నుంచి 'రాజకీయ, సంఘసేవ, క్రీడారంగా'లను కూడా కలుపుకొని జాతీయస్థాయిలో 'పద్మశ్రీ, పద్మభూషణ్‌, పద్మవిభూషణ్‌, అర్జున, ద్రోణాచార్య, భీష్మ' అవార్డుల్ని కూడా బహూకరించబోతున్నాం. ఆసక్తి గలవాళ్ళు తమ పేరూ, బయోడేటా, ఫైనాన్షియల్‌ స్టేటస్లు తెల్పుతూ తమ కలర్‌ఫోటోని జతచేసి మా అడ్రస్‌కి పంపించండి. 'మిగతా విషయాలు' నా సెల్‌నంబర్‌కి రింగ్‌ చేసి 'మాట్లాడుకోవచ్చు!' అన్నట్టూ... బిజినెస్‌, రియల్‌ ఎస్టేట్, సినిమా రంగాల వాళ్ళు కూడా అప్లయ్‌ చేస్కోవచ్చు- 'ముందుగా అప్లయ్‌ చేసినవాళ్ళకి మొదటి ప్రాధాన్యత' అన్న విషయం మర్చిపోవద్దు!''

అంతే... ఆ ప్రకటన వింటూనే వేదిక పైనున్నవాళ్ళూ, హాల్లోని ప్రేక్షకులూ ఒక్కసారిగా తమ తమ సీట్లలోంచి లేచినిలబడి చప్పట్లతో, విజిల్స్‌తో హాలంతా మార్మోగిపోయేట్లు తమ హర్షాన్ని ప్రదర్శిస్తూంటే...

ఆ గోలలో, గందరగోళంలో- ''అదేంటీ... అవి ప్రభుత్వం మాత్రమే ఇచ్చే పురస్కారాలు కదా! ప్రైవేటు వ్యక్తులూ, సంస్థలూ ఇవ్వకూడదు- పైగా, ఆ పేర్లు కూడా వాడకూడదు కదా!'' అంటూ అసంకల్పితంగా,
ఆందోళనగా నా నోటినుంచి వెలువడిన మాటల్ని కనీసం నా ప్రక్కనే నిల్చున్న 'పారాణి' కూడా పట్టించుకోలేదు.

అలా అందరూ తమ ఆనందాన్ని వ్యక్తంచేసుకోవడానికి రెండు మూడు నిమిషాలు టైమ్‌ ఇచ్చిన సచ్చిదానందరావు- ఆ హర్షాతిరేకాల మధ్య మరో 'కొసమెరుపు ప్రకటన' చేశాడు -

''మీరు అందిస్తున్న ఈ ప్రోత్సాహానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు! నాపట్ల, నా 'మనస్విని' సంస్థ పట్ల మీ ఆదరాభిమానాలు ఇలాగే కొనసాగుతాయని ఆశిస్తూ... అతిత్వరలో మా సంస్థ ద్వారా 'మెగసెసే,
బుకర్‌, ఆస్కార్‌, నోబుల్‌'లాంటి 'అంతర్జాతీయ అవార్డులు' కూడా బహూకరించబోతున్నామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.''

అంతే... అది వింటూనే నా కళ్ళు బైర్లు కమ్మి, స్పృహ తప్పినట్లవడం వల్ల- హాల్లో మళ్లీ ఊపందుకున్న చప్పట్లూ, ఈలలూ ఎంతసేపు కొనసాగాయో నాకు తెలియనే తెలియదు.

రచన : ఎస్వీ.కృష్ణజయంతి

************