Facebook Twitter
ప్రమోషన్



    


మళ్ళీ అదే సమస్య. ఆనాడు యెదురైన అదే విధమైన ఇరకాటం. నుదుటిపైన చేతినుంచుకుని ఆలోచనలో పడ్డాడు ఉప కార్యాలయ అకౌంట్స్ క్లర్కు సిధ్ధరామయ్య. రెండేళ్ళ క్రితమేమో—యు.డి.సి.డిపార్టుమెంటు పరీక్షలకు పోటీ పడి చదువుతున్న ప్పుడు తన తల్లి సౌభాగ్యమ్మ మంచాన పడింది. వర్షాలూ రోగాలు చెప్పి రావుగా? వాటిష్ట ప్రకారం అవి వస్తాయి. వాటిష్ట ప్రకారం అవి పని ముగించుకుని పోతాయి. ఐతే కొన్ని రోగాలు వర్షాలలా కాకుండా పిలవని పేరంట్రాళ్ళలా దూసుకు వచ్చినట్టు తిష్ట వే సుక్కూర్చుండిపోతాయి. అంతు చూడకుండా విడిచి పెట్టవు. 

తన తల్లి విషయంలో అలాగే జరిగింది. ఎన్ని ఆస్పత్రులు తిరిగినా ఎందరు వైద్యులచుట్టూ ప్రదక్షిణలు చేసినా తగ్గని ఖళ్ళ దగ్గులా రోగం నయంకాలేదు. అటువంటప్పుడు కన్నకొడుకు సిధ్ధరామయ్య ఎలా ఏకాగ్రతతో శాఖాపరమైన పోటీ పరీక్షలకు చదివగలడు? పూనకం వంటి పట్టుదలతో చదివినా ఎలా కుదురుగా పరీక్ష హాలులో కూర్చుని వ్రాయగలడు? అవేమిటి, పాఠ్య పుస్తకాలలోని అంశాలా యేమిటి క్రిందా మీదా పడి కంఠతా పట్టి అప్పచెప్ప డానికి? అవన్నీ శాసన బధ్దమైన పరిపాలనా వ్యవస్థకు సంబంధించిన విధి విధానాలు కదూ! కచ్చితంగా కొన్ని సందర్భాలలో నియమాల రిఫరెన్సు గుర్తింపులను ప్రస్తావించే తీరాలికదా! గోరు ముద్దలుపెట్టి పెంచి పెద్దచేసిన అమ్మ మంచాన పడి చెప్పలేనంత విపరీతంగా యెగశ్వాస దిగశ్వాసగా అవస్థ పడుతున్నప్పడు తనెలా యెగ్జామ్ హాలులో కుదురుగా కూర్చుని పరీక్ష వ్రాయగలడు? 

తీవ్ర అసహనానికి గురయాడు సిధ్ధరామయ్య. అంతేకాక-పైకి కనిపించని కౌకు దెబ్బలా సిధ్ధరామయ్య మరొక పెను నష్టానికి లోనయాడు. అదేమంటే- తన వెనుక జూనియర్ క్లర్కుల్లా కార్యాలయంలో చేరి తన వద్ద పని నేర్చుకున్న కొందరు జూనియర్ స్టాఫ్ డిపార్టుమెంటల్ పరీక్షల్లో ఉత్తీర్ణులై పైకి యేగబ్రాకి తనను క్రిందకు తోసి యుడిసీలుగా ఎదిగిపోయారు. మరైతే తన వంటి నష్టజాతకులకు ఇలా జరగడం లోకరీతేగా! తను కూడా పరీక్ష వ్రాసుండి మెరిట్ కేటాయింపు ఆధారంగా ప్రమోషన్ పొంది ఉంటే తనుకూడా చాలామందినే దాటుకుంటూ ఎదుగుదలనే నిచ్చెనెక్కి వెళ్లిపోయుండే వాడే-- జీవితమంటే బ్రతుకు మైదానంలో సంభవించే ఆటలో అరటి పండేనేమో! చిట్టచివరకు అతడికి సీనియారిటీ వరస క్రమంలోనే యుడిసీ పదో న్నతి వచ్చింది. అదీను యెప్పుడని-చాలా మందికి జూనియర్ గా మారిన తరవాతనే!

ఏది ఏమైతేనేమి- అతడికిక మిగిలిందే ముంది- ఏమీ లేదు. తన తల్లి సౌభాగ్యమ్మ అదే సంవత్సరం అందరినీ దు:ఖ సముద్రంలో ముంచి పరలోక  ప్రాప్తి చెందింది. తన అనారోగ్య కారణంగానే కొడుకు శాఖాపరమైన పరీక్షలు వ్రాయలేకపోయాడని తెలిసుంటే యెంత బాధపడేదో! అంతా ఒక విధంగా మంచికే జరిగిందేమో-- అమ్మ ప్రశాంతంగా కళ్ళు మూసింది అతను ప్రక్కనుండగానే చేతిలో చేతినుంచి.

ఇదిగో--ఇప్పుడు మళ్ళీ అదే గడ్డు పరిస్థితి! నిజానికి అంతకంటే దారుణమైన పరిస్థితి. వయసు మరలి వర్క్ షాపుకి వెళ్ళడం మానుకున్న బాబు అనారోగ్యానికి లోనయాడు. స్వతహాగా తండ్రిది దృఢ శరీరం. రోగం రొష్టులనూ ఆమడ దూరాన ఉంచగల గంభీర రూపం. మరెందుకలా నీరసించి నిస్సహాయుడై ఇంటిపట్టున ఉండిపాయాడో సిధ్ధరామయ్యకు అంతు పట్టడం లేదు. అంతే కాదు- వర్క్ షాపులో పని చేస్తున్నప్పుడే ఆయన రెండు మూడు సార్లు పడిసెం పట్టి ఖళ్ళెతో బాధ పడ్డాడు. జాగ్రత్త తీసుకోవడం మరిచాడు. అప్పటికి దేవుడి దయవల్ల కాలం కలిసొచ్చి తను సీనియారిటీ ప్రకారం కుంటుతూ దేకుతూ యుడిసి ఐపోయాడు. జేబులు కాసుల గలగల చప్పుడుతో నిండి ఉన్నాయి. కావున దేనికీ వెనుకాడకుండా వైద్యుడు వ్రాసిచ్చిన మందులూ టానిక్కులూ పకడ్బందీగా కొనిచ్చాడు. 

మరెందుకో మరి బాబు మందులు తీసుకోవడం తరచుగా మరచిపోతూనే ఉన్నాడు. మందులెందుకు వేసుకోలేదని అడగడానికి వెళితే బాబు దేనినో ఎవరినో దీర్ఘంగా వెతుకుతున్నట్టు ఆకాశంలోకి తేరి చూస్తూ కనిపించే వాడు. తనకు నిజంగానే చిరాకు వచ్చేది. ఆ అసహనాన్ని తండ్రిపైన చూపించలేక భార్య ప్రేమవతి పైన చూపించేవాడు కూకలు వేస్తూ- “ఇవన్నీ నువ్వు చూడవద్దా! నీ పనులు నువ్వు చూసుకోవడమేనా? అసలు మాఁవగారికి అనారోగ్యంగా ఉందన్నదైనా గుర్తుందా?” ఈ మాట తను  కావాలనే కస్సుమన్న గొంతుతో అనేవాడు; తండ్రి చెవిలో పడేటట్టు. 

కాని తను ఎన్నాళ్ళని ఇటువంటి నాటకం చూపిస్తూ ఉండగలడు? ఎన్నిసార్లు నెపం పెట్టి తండ్రి చేత మందులు తినిపిస్తూ ఉండగలడు? ప్రేమవతి తిరు పతయ్యకు కోడలు కావచ్చు-తనకు భార్య కావచ్చు-కాని ఆమె కూడా మనిషేగా--ఆమెకు కూడా గాయపడే మనసుంటుంది కదా! అంచేత తను సాధ్యమైనంత మేర తండ్రి మందులు తీసుకునే సమాయనికి స్వయంగా దగ్గరుండి సపర్యలు చేయిడానికి ప్రయత్నంచేవాడు. మరి దానికి కూడా ఒక హద్దుంటుంది. ఆయననే అహర్నిశలూ అంటి పెట్టుకుని ఉండటానికి ఉద్యోగస్థుడైన తనకు ఎంత వరకు సాధ్యపడుతుందని? అందరిలాగే తనకూ అర్జంటు పనులు తగుల్తుంటాయి. తను కూడా నెలజీతం పైన ఆధారపడి జీవించే సగటు మనిషేగా!

    మరైతే తండ్రి అలా రాను రాను నీరసించిపోవడానికి— నిర్జీవితకు లోనుకావడానికి మరొక కారణం ఉండవచ్చున్నది  అతడు తరవాత తెలుసుకోగలిగాడు. అదెలా తెలుసుకోగలిగాడంటే— మాఁవగారికి వంజిరం చేప అంటే ఇష్టమని  ప్రేమవతి ఆది వారం పూట వంజిరం చేపల పులుసు చేసింది.ఏమైందో మరి-మంచం పైన తింటున్నవాడల్లా చప్పున ఆగిపోయి కొడుకుని దగ్గ రకు రమ్మనమని పిలిచాడు తిరుపతయ్య. అదేదో అర్జంటు మేటర్ గురించి పిలిచాడనుకుని తింటూన్న గిన్నెనుండి చప్పున లేచి వెళ్ళాడు సిధ్దరామయ్య- “చెప్పు బాబూ!” అంటూ. 

తిరుపతయ్య వెంటనే బదులివ్వలేదు. అన్నం ముద్దను కొడుకు నోటికి అందిస్తూ అన్నాడు- “నిన్నెప్పుడూ ఇలాగే దగ్గర్నించి చూస్తూ ఉండాలనుందిరా కొడకా!” ఆ మాట విని అతడికి దిగ్గుమని పించింది. ఎందుకంటే ఆ మాట అతడి చెవికి వింతగా తోచింది,దిగులు నిచ్చింది. మాటా పలుకూ లేకుండా గుడ్లప్పగించి చూడ సాగాడు. ఎందుకని అడగాలనిపించలేదు. "మీ అమ్మను చూస్తున్నట్లే ఉందిరా!" ఆమాటతో అతడికి దు:ఖపు తెర గొంతు వరకూ తన్నుకు వచ్చింది. తనను తను అదుపు చేసుకుంటూ వెళ్లి గిన్నెముందు కూర్చున్నాడు. ఇన్నాళ్ళూ ఇంటి దూలంలా నిల్చు ని కుటుంబాన్ని ఆదుకున్న చెట్టంత  మనిషి భార్య పోయిన జ్ఞాపకం తెచ్చుకుని ఎంతగా నీరసించి పోతున్నాడు! బ్రతికుండడమేమిటి- లేకుండా పోవడమేమిటి- భార్యా భర్తల మధ్య ఉన్న అనుబంధం అటువెంటిది మరి-- కనిపించీ కనిపించని విధంగా తనువెళ్లా పెనవేసుకున్న మానవాత్మల్లా— గత స్మృతుల పవ్వళింపులా--
    
మగటిమితో తను ఆపుకున్నాడు దు:ఖం. కాని ప్రేమవతి ఆపుకోలేక పోయింది. కన్నీరు కార్చేసింది. చేపల పులుసుతో అన్నం జుర్రుకుతింటూన్న కొడుకూ కూతూరూ తల్లిని బిత్తరపోయి చూడసాగారు. ఆ చిరు వయసులో హృదయ మనోరాగ వలయాల గురించి వాళ్ళకేం తెలుసు!

ఇకపోతే- డిపార్టుమెంటల్ పరీక్షలు సాధారణంగా ఎక్కువ భాగం దైనందిన కార్యాలయ కార్యకలాపాలపైనే ఆధారిపడి ఉంటాయి. ఇంకా చెప్పాలంట్- సగ భాగం అధికార పూర్వక వర్క్ మ్యాన్యువల్ పైన ఆధారపడి ఉంటే మిగతా సగం దైనందిన ఆచరణీయ పధ్ధతులపైన ఆధారపడి ఉంటాయి. ఈ కారణం చేత కష్టపడి పని చేసే శ్రమజీవి కావటాన సిధ్ధరామయ్యకు పని తనపు పధ్థతులపైన మంచి పట్టు ఉంది. ఈ తరహా ఉద్యోగులు శాఖా సంబంధిత పోటీ పరీక్షల్లో త్వరగా తేరుకోగలరు. పదోన్నతి  నిచ్చెనను అవలీలగా అందుకోగలరు. 

కావున—చాలామంది ఆఫీసు సిబ్బంది పరీక్షలకు అనుగుణమైన పని పధ్ధతుల గురించి  లోతుగా తెలుసుకోవడానికి సిధ్ధరామయ్య ఇంటికి రాసాగారు. వాళ్ళందరూ భర్తకు ఇరుగు పొరుగున అదే ఆఫీసులో పని చేసేవారు కాబట్టి విసుగుదలకు చోటివ్పకుండా అల్పాహారాలు టీలు కాఫీలు అందిస్తుండేది ప్రేమవతి. ఆ రీతిన సూపర్ వైజర్ పోస్టు పోటీ పరీక్షలు దగ్గరకు వచ్చేసాయి. ప్రయత్నాలు ముమ్మరమయాయి. అందుకోబోయేది అందని  మ్రాని పండులా ఊరించే హెడ్డు గుమాస్తా పోస్టు కదూ! కలసి రావాలే గాని-- పోస్టుగాని అందుకోగలిగితే ఎంతోమందికి పైగా వెళ్ళి, ఇంకెంతో మందికి సీనియర్ కూడా కావచ్చు.

డైరక్ట్ మెరిట్ కోటా ప్రమోషన్ కి ఉన్న మహత్యం అటువంటిది మరి. ఆపైన  తదుపరి ప్రమోషన్ లు మోచేతి నుండి తాగే నీళ్ల ప్రాయమే,వద్దంటే పెళ్ళన్నట్టు-- ఆ కోవన మూడు నెళ్ళ ముందే ఇచ్చిన  ధరఖాస్తు ప్రకారం అందరికీ ఎగ్జామ్ సెంటర్లు కేటాయించినట్టే సిద్ధరామయ్యకు వనస్థలి పురం కేటాయించారు. ఓపెన్ పోటీ పరీక్షలు కావు కాబట్టి, వ్రాసేవారందరూ ఒకే కార్యాలయానికి చెందిన డిపార్టుమెంటు సిబ్బందే కాబట్టి, అందరూ అలా ఆఫీసు చేరుకుని అక్క ణ్ణించి అలానే వాళ్ళ వాళ్ళకు కేటాయించిన పరీక్ష కేంద్రాలకు వెళ్ళవచ్చు. పిమ్మట తిన్నగా ఇండ్లకు చేరుకోవచ్చు.అంటే పరీక్ష కేంద్రనుండి మళ్ళీ ఆఫీసుకి వెళ్ళనవసరం లేదన్నమాట.

ఆరోజు రాత్రి భోజనాలయిన తరవాత సిధ్ధరామయ్య అలా ఆరుబయట చిన్నపాటి నడక సాగించి వచ్చిన తరవాత తిరుపతయ్య కొడుకుని  పిలిచాడు.పిలిచి అడిగాడు-“మీ ఆఫీసు పరీక్షలు ఎలా వ్రాసావురా కొడకా!”

“బాగానే వ్రాసాను బాబూ! అందరూ కష్టంగా ఉందన్నారు గాని నాకు  మాత్రం అలా అనిపించలేదు.పెట్టిన పేనా దించకుండా దంచేసాననుకో! ఆ మాటకు వస్తే నాకిదంతా నీళ్ళ ప్రాయం బాబూ!" తిరుపతయ్య ఏమీ మాట్లాడకుండా కొడుకు కళ్ళలోకి నిదా నంగా చూస్తూ ఉండిపోయాడు. "అదేంవిటి బాబూ అలా తేరి చూస్తున్నావు!నేను బాగా వ్రాసానంటే నమ్మకం కుదరటం లేదా?”    ఆమాట విని తిరుపతయ్య నీరసంగా నవ్వి కొడుకు చేతిని తన చేతిలోకి తీసుకుని అన్నాడు- “నాకు తెలుసురా నువ్వు రాత్రంతా కళ్లు తుడుచుంటూ నిద్రలేమితో అవస్థ పడుతున్నప్పుడే అనుకున్నాను నువ్వు పరీక్షకు వెళ్ళవని--" తెల్లబోయి చూసాడు సిధ్ధరామయ్య.

"మీకెవరో తప్పుడు సమాచారం ఇచ్చినట్టున్నారు బాబూ!నేనెందుకు పరీక్ష వ్రాయకుండా ఉంటాను? చూస్తూ చూస్తూ హెడ్ క్లర్కు పోస్టుని ఎవడైనా చేతులార వదులుకుంటాడా బాబూ!” తిరుపతయ్య తల అడ్డంగా ఆడించాడు తను నమ్మలేనట్టు. 

"నా వద్ద దాగుడు మూతలు ఆడకురా కొడకా!అన్నీ తెలుసుకునే నిన్ను అడుగుతున్నానురా కొడకా! హెడ్డు పోస్టు  పెద్ద పోస్టట  కదా— అదిచ్చిన వెంటనే మరొక జిల్లాకో లేదా మరొక మండలానికో ట్రాన్సుఫర్ చేస్తారటగా! నాకు దూరం కాకుండా ఉండటానికేగా నువ్వు ప్రమోషన్ పరీక్షలు వ్రాయకుండా ఉండిపోయావు? రేపో మాపో చచ్చే పీనుగుని కాబో తూన్న నాకోసం నీకు నీవు అన్యాయం చేసుకుని పెళ్ళాం పాపలకు అన్యాయం చేసుకుని పరీక్షలు మానుకుంటావా!" 

ఆ మాటతో సిధ్ధరామయ్య ఉగ్గబట్ట లేక పోయాడు. భళ్ళున ఏడ్చేసాడు. ఏడుస్తూనే ఆగి ఆగి బదులిచ్చాడు. "లేదు బాబూ!నాకు నువ్వు వేరు అమ్మవేరు కాదు. నాకిప్పుడు నువ్వే బాబువి నువ్వే అమ్మవి.నేను గాని ప్రమోషన్ కోసం ఆశపడి నిన్ను ఈ పరిస్థితిలో  విడిచి దూరంగా వెళ్ళిపోతే అమ్మ ఆత్మ నన్నెప్పటికీ క్షమించదు.అమ్మేకాదు, రేపు  నా ఆత్మసాక్షే నన్ను క్షమించ కపోవచ్చుబాబూ!”

తిరుపతయ్య‌ ఇక మాట్లాడలేదు. కొడుకుని గుండెలపైకి తీసుకున్నాడు. అతడికి తెలియకుండానే కన్నీరు కారుతూంది. ఇటు వంటి కొడుకుని ఇచ్చినందుకు తన దివంగత భార్య సౌభాగ్యమ్మకు చేతులు ఎత్తి నమస్కరించాలని పించింది. నిజానికి తనిప్పుడు సిధ్ధరామయ్యకు తండ్రికాడు. సిధ్ధరామయ్యే తనకు తండ్రి!     

- పాండ్రంకి సుబ్రమణి