Facebook Twitter
ప్రయత్నం

ప్రయత్నం

 

అనగనగా ఒక ఊళ్ళో సోమేష్ అనే కుర్రవాడు ఒకడు ఉండేవాడు. అతను ప్రతిరోజూ ఉదయం క్రమం తప్పకుండా గుడికి వెళ్ళి దేవుడిని భక్తితో ప్రార్థించేవాడు. తనని ఏమీ కోరని సోమేష్‌ని చూస్తే దేవుడికి కూడా ముద్దుగా ఉండేది. అయితే ఒకసారి సోమేష్‌కి చాలా కష్టాలు ఎదురయ్యాయి. డబ్బులతో చాలా ఇబ్బంది అయ్యింది. ఇక తట్టుకోలేక, అతను హడావిడిగా గుడికి వెళ్ళి దేవుడిని ప్రార్థించాడు "దేవుడా! నిన్నెప్పుడూ ఏదీ కోరలేదు. ఇప్పుడు నా కోరిక తీర్చు! నాకొక లాటరీ తగిలేట్లు చెయ్యి"అని.

 

దేవుడు అప్పటికప్పుడు ప్రత్యక్షమై "సరే!‌ నీ కోరిక తీరుస్తాను" అని చెప్పి మాయం అయిపోయాడు. దేవుడు తన ప్రార్థనను విన్నందుకు, తన కోరిక తీరుస్తానన్నందుకు సోమేష్‌కి చాలా తృప్తి కలిగింది. తర్వాత కొద్ది రోజులు గడిచాయి; రోజులు కాస్తా నెలలయ్యాయి; సంవత్సరం కావస్తున్నది- సోమేష్‌కు ఏమీ లాటరీ తగల్లేదు!

అతనికి చాలా కోపం వచ్చింది. "ఏంటి స్వామీ, ఇది! అడగక అడగక ఒక్క కోరిక కోరానే! ఆ ఒక్క కోరికనూ తీర్చలేకపోయావా? మరి మాట ఇచ్చిందెందుకు, తప్పేదెందుకు? నువ్వేం దేవుడివయ్యా!" అని నిలదీశాడు దేవుడిని. దేవుడు మళ్ళీ ప్రత్యక్షమై " చూడు సోమేష్! నీకు 'లాటరీ తగిలేట్లు చేస్తాను' అని నేను మాట ఇచ్చాను, నిజమే. కానీ‌నువ్వు అసలు లాటరీ టిక్కెట్టే కొనకపోతే నేను ఏం చేసేది?" అని నవ్వి, మాయమైపోయాడు. మానవ ప్రయత్నం లేనిది, దేవుడు కూడా ఏమీ చెయ్యడు!

- కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో