Facebook Twitter
ఆన్లైన్ విందు

 

తెలుగువ‌న్ - అక్ష‌ర‌యాన్ సంయుక్తంగా నిర్వ‌హించిన ఉగాది క‌థ‌ల పోటీలో తృతీయ బ‌హుమ‌తి రూ. 1,116 పొందిన క‌థ‌

 

పట్టు చీర కట్టుకుని, మొహమంతా మేకప్ వేసుకొని, అద్దంలో అటు ఇటూ చూసుకుంటోంది సుందరి.
సుందరి అవతారాన్ని, హడావిడిని చూసి షాక్ అయిన భర్త బ్రహ్మం. "ఏంటే ఇలా రెడీ అయ్యావు?" అని అడిగాడు. "మారెజ్ కి అటెండింగ్ అవుతున్నా! సరే కానీ ఎలా ఉన్నాను చెప్పండి. టెల్లండి?" అనడిగింది సుందరి. "హా నీకేమి బాగానే ఉన్నావు, అది సరే కానీ అటెండింగ్ కాదు, అటెండ్ అనాలి అంతే!" అన్నాడు.

"ఓహ్ అలాగా, ఒకే ఒకే అప్పర్ స్టాండ్.."
"ఒసేయ్, అప్పర్ కాదు అండర్ స్టాండ్. నీ ఎంగిలి ఇంగ్లీషుతో చంపుతున్నావు కదే!"
"అబ్బబ్బా , నేనెప్పుడూ పైనే ఉండాలి అందుకే అప్పర్ స్టాండ్ అన్నాను. అర్థ‌మైందా?" అంది సుందరి.

ఇంకేమనాలో తెలీని బ్రహ్మం నెమ్మదిగా బయటకి బయలుదేరుతూ, "సరే. నేను బయటకి అలా వెంకట్రావు ఇంటిదాకా వెళ్తున్నా, భోజనానికి వచ్చేస్తా, ఏమైనా తెమ్మంటావా వచ్చేప్పుడు?" అడిగాడు.
అప్పుడే అసలు విషయం గుర్తు వచ్చి, "అన్నట్టు మర్చిపోయాను అండి, ఈరోజు మా ఫ్రెండ్ కొడుకు పెళ్ళి అన్నాను కదా, భోజనాలు వాళ్ళవే. తొందరగా వచ్చేయండి" అంది సుందరి. "భోజనాలు ఏంటే, పెళ్లికి మనం వెళ్ళటం లేదు కదా! ఈ కరోనా తగ్గేంతవరకు నువ్వూ ఎక్కడకి వెళ్లొద్దు అంతే!" "అయ్యో రామా! నేనెక్కడికి నాట్ గోయింగు, భోజనాలే మనింటికి కమింగు. మీరు తొందరగా కం, ఇద్దరం ఈటుదాం ఒకేసారి అందరితో కలిసి..." అంది సుందరి. "ఒసేయ్ నీ భాష ఒక్క ముక్క కూడా అర్థం అయితే ఒట్టు. ఏం చెప్తున్నావ్ అసలు?" అడిగాడు ఆశ్చర్యంగా, ఒకింత అనుమానంగా.. "అయ్యో, ఇదుగో చూడండి, మా గుణ లేదూ అదే మా క్లాస్మేట్ గుణసుందరి తన కొడుకు వర్షిత్ పెళ్ళి ఈరోజు. అదీ లైవ్ వస్తుంది అండి. మీరు తొందరగా రండి, తాళి కట్టే టైంకి ఉండకపోతే బాగోదు వచ్చాక అన్ని విషయాలు చెప్తాను. సరేనా.. నేను పెళ్ళికొడుకు స్నాతకం ఫంక్షనుకి అటెండింగ్ అవ్వాలి. మీరు వెళ్ళండి" అంటూ సిస్టెంలో దూరిపోయింది సుందరి. బయటకి నడిచాడు బ్రహ్మం.

చెయ్యగా చెయ్యగా, పావుగంటకి ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యింది. అప్పటికి జూమ్లో సుందరి ఫ్రెండ్స్, పెళ్ళికొడుకు బంధువులు అందరూ రెడీగా ఉన్నారు. సుందరికి గుణ బంధువుల, స్నేహితురాళ్ల అందరి పలకరింపులు అయ్యాయి.
"అవును గుణా, ఇంతకీ పెళ్లికూతురు ఫోటో కూడా పెట్టలేదు, శుభలేఖలో కూడా వేయించినట్లు లేరు? ఏమిటీ అంత సీక్రెట్టు?" అని అడిగింది సుందరి.
"సీక్రెట్టు లేదు, చీపురు కట్టా లేదు. ఫోటో ఏం కర్మ, పెళ్లికూతురు కూడా లైవ్ లో ఉంది. అదుగో అక్కడ ఆ మూడో లైన్లో, నాలుగో వీడియోలో ఉంది చూడు, తనే నాక్కాబోయే కోడలు దీక్ష!" అని పరిచయం చేసింది గుణసుందరి.

ఆ అమ్మాయి అందరికి ఒక హాయ్ చెప్పింది. అందరూ అమ్మాయి చాలా బాగుందని మెచ్చుకున్నారు. గుణసుందరి పొంగిపోయింది. "సరే ఈవెనింగ్ సంగీత్ ఉంది, ఆ తర్వాత భోజనాలు అయ్యాక పెళ్ళి ముహూర్తం. ఎవ్వరూ మిస్ కావద్దు మరి. అబ్బాయి బట్టలు మార్చుకోవాలి. ఇంకా ఏర్పాట్లన్నీ చూడాలి ఉంటాను మరి. కొరియర్ రిసీవ్ చేసుకున్నాక వాట్సాప్ గ్రూప్లో పెట్టడం మర్చిపోకండి." అని అందరి దగ్గరా సెలవు తీసుకుంది గుణ. సాయంత్రానికి అందరిళ్ళకి భోజనాల పార్సెళ్లు వచ్చాయి. సంగీత్ కార్యక్రమానికి టైం అవుతుందని వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ రావటంతో అందరూ మరలా రెడీ అయ్యి సిస్టం ముందుకు వచ్చేరు.

మళ్ళీ కొత్తగా రెడి అయిన సుందరిని చూసి," ఏమిటోయ్ పూటపూటకి అన్ని అవతారాలు మారుస్తున్నావు? నిజంగా పెళ్లిలో కూడా ఇన్ని చీరలు మార్చి ఉండేవేమో! హ హ" అంటూ నవ్వాడు బ్రహ్మం. "చాల్లే ఊరుకోండి, సరేకానీ మీరు కూడా వస్తారా సంగీత్ జరుగుతోంది?" అడిగింది సుందరి.
"వద్దు తల్లో, నీ ఒక్కదాని కుప్పిగెంతులు, కూని రాగాలే వినలేక చస్తున్నా, ఇంకా అందరివీ కూడా నే చూడలేను. నన్నొదిలేయ్!" అంటూ అక్కడినుంచి బయటకి వెళ్ళిపోయాడు బ్రహ్మం. అందరూ కాసేపు సంగీత్ కార్యక్రమాన్ని ఆన్లైన్లో చూసారు. అక్కడ పాటలకు ఇక్కడ వీళ్ళు స్టెప్పులెయ్యటం, పాటలు పాడటం చేశారు. తర్వాత మళ్ళీ భోజనాల కోసం ఫ్రెష్ అవ్వటానికి వెళ్లారు. ఉదయం లేట్ అయ్యిందని ఈసారి మీటింగుకి 10 నిముషాల ముందే సిద్ధంగా ఉంది సుందరి. భోజనాల సమయానికి అందరూ కనెక్ట్ అయ్యాక పార్సెల్ విప్పమంది గుణసుందరి.

అందరూ పార్సెల్ విప్పి చూసి ఆశ్చర్యపోయారు. అందులో ఒక కారియర్, చిన్న బాక్సులు, అరటి ఆకులు, ప్లాస్టిక్ అరటి ఆకుపై ఏవో రాసి ఉన్నాయి. అందరూ ఓపెన్ చేసాక, ప్లాస్టిక్ ఆకుని పట్టుకుని చూపిస్తూ, "ఇదుగో ఇక్కడ నెంబర్లు ఉన్నాయి చూడండి, ఏ ఐటెం ఎక్కడ వడ్డించుకోవాలో, అదే నంబరింగ్ ప్రకారం అందరూ ఐటమ్స్ సర్దుకొండి. ఎలా అంటే, 1 ఉన్న చోట స్వీట్ కాజా, 2- లడ్డు, 3 - పులిహోర అలా. అందరూ తొందరగా సర్దుకొండి." అంది గుణసుందరి. అందరూ ఎవరి ఆకులో వాళ్ళు సర్దుకోవటం మొదలెట్టారు. అప్పుడే వచ్చి ఇదంతా చూసిన సుందరి భర్తకి మతి పోయినట్టు అయ్యింది.
"ఏమిటే ఇదంతా?" అన్నాడు సుందరితో. "ష్! మాట్లాడకండి. మీరు కూడా ఇక్కడ కూర్చొని మీ ఆకులో భోజనం సర్దుకొండి" అంది సుందరి. అందరూ ఆకుల్లో సర్దుకున్న ఐటమ్స్ ఫోటో తీసి పెట్టారు. ఒకేసారి కౌంట్ డౌన్ స్టార్ట్ చేసి 3, 2, 1 అని అందరూ తినటం ప్రారంభించారు. "ఇదెక్కడి సంతరా బాబు?" అని తల గోక్కుంటూ ఎదో తిన్నా అనిపించాడు బ్రహ్మం. సుందరి మాత్రం ఆకుతో సహా అన్నీ ఖాళీ చేసేసి, బ్రేవ్ మని త్రేన్చింది.


భోజనాల అనంతరం ముహూర్తం వేళకి అందరూ మళ్ళీ మీట్ అయ్యారు జూమ్లో. అప్పటికే ఐటెంస్ అన్ని పూర్తిగా తినటం వల్ల, భుక్తాయాసంతో, ఉదయం నుంచీ మార్చి మార్చి మీటింగులో కూర్చోవడం వలనా వాలిపోయారు అందరూ. రాత్రవ్వటం వల్ల మేకప్పులు పోయి నిద్ర మొహాలతో ఉన్నారు. నెమ్మదిగా ఒక్కొక్కరూ కునుకు తీయ్యటం మొదలెట్టారు. సరిగ్గా తాళి కట్టే వేళకి అంతా మంచి నిద్రలోకి జారుకున్నారు. సుందరి చెప్పిన "తాళి కట్టే సమయానికి ఉండండి" అన్న మాట గుర్తు తెచ్చుకుని తాళి కట్టే సమయానికి సుందరిని లేపాడు బ్రహ్మం. ఆన్లైన్ లోనే అక్షింత‌లు వేసి, ఆశీర్వదించారు అందరూ ఆ కొత్త జంటని. "సుందరీ అలా ఊరికే ఆశీర్వదిస్తే ఏం బాగుంటుంది, ఏమైనా చదివింపులు కూడా ఉండాలి కదా! పాపం వాళ్ళు ఇంత ఖర్చు చేసి మనకి భోజనాలు కూడా పంపించారు మరి. ఏమీ ఇవ్వకపోతే ఏం బాగుంటుంది చెప్పు?" అని అడిగాడు అమాయకంగా బ్రహ్మం. "దానికేం, అవి కూడా అయ్యాయి అండి, అందరం తలా పదివేలు వాళ్ళ అకౌంటుకి ట్రాన్స్ఫర్ చేసాం మొన్ననే" తీరిగ్గా చెప్పింది సుందరి. "ఏంటి పదివేలా, నీ దగ్గర అంత డబ్బు లేదు కదే? మరెలా ఇచ్చావు?" అడిగాడు బ్రహ్మం సందేహంగా. "నా దగ్గర లేకపోతేనేం.. మీరున్నారు కదా. ఇంకెలా ఇస్తాను. మీ కార్డ్ లో నుంచే" అంది సుందరి. "నా కార్డులో నుంచీ ఎలా తీసావు? అసలేలా పంపేవు? నీకసలు ఎలా ఓపెన్ అయ్యింది?" అంటూ తన సందేహాన్ని వెళ్లబుచ్చాడు బ్రహ్మం. "ఇందాక మీరు విడిచిన లాల్చీ జేబులో ఉందిగా మీ కార్డు.. అందులో నుంచే తీసాను. అయినా మీకు మతిమరుపు గానీ వచ్చిందా ఏంటి? అలా కార్డు వెనుకే రాసుకున్నారు పిన్ను. ఎవరైనా తీసేస్తే ఏంటి పరిస్థితి? మీ క్రెడిట్ కార్డ్ నెంబర్ మా ఫ్రెండుకి ఇచ్చాను. దాంట్లో నుంచీ తను పదివేలు డ్రా చేసి, నా పేరుతో ట్రాన్స్ఫర్ చేసింది అంతే!" అసలు విషయాన్ని బయట పెట్టింది సుందరి. ఆ మాటకి "చచ్చాం పో, ఆ కార్డు నాది కాదే, నా ఫ్రెండు వెంకట్రావుది. నా కార్డు పోయిందని కంప్లైంట్ ఇచ్చాను, ఇందాక ఎదో అవసరానికని వెంకట్రావు కార్డు నా చేతికిచ్చాడు" అని హతాసుడయ్యాడు బ్రహ్మం.

- ప‌రిమ‌ళ క‌ళ్యాణ్‌