Facebook Twitter
గుండె కింద కవిత్వ చెలమ

గుండె కింద కవిత్వ చెలమ

 

కవిత్వం రాయడానికి ప్రత్యేకంగా ఏమైనా వర్క్ షాప్స్ కి వెళ్ళాల్సిన అవసరం లేదు. అవును కవిత్వమంటే జీవిత అనుభవాల ఊటలో నుండి మస్తిష్కంలో నుండి ఉబికి భావాల రూపంలో సమాజపు పుడమిపై గంగాజలంలా ప్రవహించడమే కదా..!

వ్రుత్తి పరంగా ఎక్సైజ్ శాఖలో ఉన్నత ఉద్యోగం చేస్తూ సమాజాన్ని నిశితంగా పరిశీలించి రాసిన కవిత్వమే “నీటి చెలమ” మకుటంతో మన ముందుకు వచ్చిన ఈ పుస్తకంలోని కవితలు అనుభవాల తోటలో పుష్పాల వలె వికసించాయి.
 
కవి తీసుకున్న కవితా శీర్షికలన్నీ మన చుట్టూ మన ఇంట్లో జరిగే అంశాలనే సరళమైన భాషలో అందరికి సులభంగా అర్థమయ్యే రీతిలో కవిత్వకరించడం స్వాగతించదగినది. 
నిజానికి కవిత్వమంటే అసజమైన పోలికతో పోల్చడం వల్ల సాధారణమైన రీడర్ కి చేరువ కాదు.

ఇంకా పుస్తకంలోని మొదటి కవిత “నాన్న కొడుకులు” పిల్లవాడికి తండ్రి బంతి కొనిపిస్తే ఆ పిల్లవాడి అనుభూతిని చెప్తూ తను కూడా ఒక్కప్పటి కొడుకెనని గుర్తుచేసుకుంటూ రాసిన కవిత మన బాల్యాన్ని గుర్తు చేస్తుంది.

వర్షాలు లేకా భూమి ఏ విధంగా ? నేర్రలు బారి ఉన్నదో చెప్తూ..., ఓ మేఘమా ఆకాశంలో నీ ప్రయాణాన్ని ఆపేసి ఒక్కసారి పుడమిని ముద్దాడి వెళ్ళు అని మేఘాన్ని అర్దించిన తీరు మనసును కలచివేస్తుంది.

నీటిచెలమ కవితలో పాత నీటిని తోడేసినట్టు సమాజంలో కుళ్ళు కుతంత్రాలని తుడిచిపెడతానని కవి వాగ్ధానం చేయడమే కాదు ఆ దిశగా తన పయనం వైపు కూడా సాగిస్తున్నారు. అది తను ఎంచుకున్న వృత్తిలో మనకు తెలిసిపోతుంది.

అసలు ఈ తీవ్రవాదం, ఉగ్రవాదం ఎలా వచ్చాయి ? ఆకలి, అసమానత్వం, కుల వివక్ష వీటి నుండి కదా! అసలు అవే లేకుండా చేయాలి అని కాస్త ఘాటుగానే విప్లవమై గర్జించిన కవి మనషులను మేల్కొల్పడానికి నవజీవన వేదంలా సాగారు.

సూర్యుడు ఉదయించగానే ఉదయిస్తావు ఆకలి కొరకో , బిడ్డలా కోసమో వ్యభిచారంలో నలిగిపోతున్న సోదరిమనుల గురించి అమోఘమైన అలతి అలతి పదాలతో వారి దీనస్థితిని మన కన్నుల ముందు ఆవిష్కరించిన తీరు బాగుంది.

కవి చదివిన ప్రభుత్వ కళాశాల గురించి అప్పటికి , ఇప్పటివి వచ్చిన మార్పులు వివరించిన, మొక్కను నాటండని చెప్పినా , ఊరి నుండి మిత్రుడొచ్చి పల్లె అనుభూతులు గురించి చెప్పున విషయాలను కవిత్వకరించిన తీరు ఆకట్టుకుంది. కవిత్వ అంశం ఏదైనా ప్రతి కవితలో సున్నిత ఆగ్రహంతో మన పై అక్షరాల కవిత్వ మాల విసిరిన తీరు బాగుంది.

మనిషి కోసం కవితలో కవి రాసిన ఈ వాఖ్యలు అందరూ చదివితీరాల్సిందే.

“ మనిషిని తాకితే మట్టివాసన రావాలి
మానవత్వపు పరిమళం వెదజల్లాలి “

ఈ రెండు వాఖ్యలు నేటి మనషుల మనసులు ఎలా కలుషితమయ్యాయో చెప్తూ ఆ మురికి కంపు పోవాలంటే కాస్తా స్వచ్చమైన మట్టి వాసన రావాలని చెప్పిన తీరు చాలా బాగుంది.

స్వచ్ఛభారత్, అమ్మ, తల లేని వాడు, కోల్పోయిన బాల్యం, లాంటి కవితలు రీడర్స్ హృదయాలలో శాస్వతంగా నిలిచిపోతాయి. ఇలాంటి కవిత్వ సంపుటాలు మరెన్నో తెలుగు సాహిత్యానికి అందివ్వాలని ఆశిస్తూ...!!

జాని.తక్కెడశిల,