Facebook Twitter
మూఢ నమ్మకం

మూఢ నమ్మకం

 

రాఘవపురం ప్రక్కనే చక్కని సెలయేరు ఒకటి ప్రవహిస్తూ ఉండేది. ఊళ్ళోవాళ్ళంతా మంచినీళ్ళకోసం ఆ సెలయేరు పైనే ఆధారపడేవాళ్లు. ఐతే ఒకసారి అకస్మాత్తుగా సెలయేటిలోని చేపలన్నీ వరసగా చనిపోవటం మొదలు పెట్టాయి. నీళ్లపైన తేలుకుంటూ ఎక్కడెక్కడినుండో కొట్టుకు రాసాగాయి కూడా. అయినా ఊళ్ళో‌వాళ్ళకు ఆ నీళ్ళే గతి! దాంతో జనం అనారోగ్యం పాలవ్వసాగారు. తెలీని జబ్బులు వ్యాపించసాగాయి. ఒకరొకరుగా జనాలు చనిపోవటం మొదలైంది.


ఐతే 'తమ రోగాలకు కారణం ఏమిటి' అని ప్రజలెవ్వరూ ఆలోచించలేదు. వాళ్ళంతా ప్రథానంగా భయపడ్డారు- భయపడి, తమ సర్పంచ్‌తో మొరపెట్టుకున్నారు. సర్పంచ్‌ తనకు తెలిసిన మంత్రగాళ్లను అడిగాడు- "మీ ఊరికి పాపం చుట్టుకున్నది. దేవుడు మీ మీద కోపంగా ఉన్నాడు. దుష్ట శక్తులన్నీ‌ మీ ఊళ్ళో‌ తాండవం చేస్తున్నాయి" అని వాళ్ళంతా నమ్మకంగా చెప్పేసారు. అప్పటికే కంగారు పడుతున్న ప్రజలు మరింత బెదిరిపోయారు. వాళ్ల భయాలకు సర్పంచ్‌ వత్తాసు పాడాడు. అందరూ ప్రాణాలను అరచేత పట్టుకొని, 'పూజలు-శాంతులు-యజ్ఞాలు' అంటూ పంచాయితీ ధనాన్ని, తాము కూడబెట్టిన డబ్బుల్ని కూడా ఖర్చుచేసారు.

 

అయినా పరిస్థితిలో మార్పు లేదు- రోగాలు మరింత వ్యాపించటం మొదలు పెట్టాయి. అంత జరిగినా ఏ ఒక్కరూ ఆసుపత్రికి వెళ్ళే ప్రయత్నం చేయలేదు. కారణం వాళ్ళకున్న మూఢనమ్మకం: "ఆసుపత్రులకు వెళ్తే దేవతలకు, దుష్టశక్తులకు మరింత కోపం వస్తుంది" అని! సరిగ్గా ఆ సమయంలోనే, సర్పంచ్‌ ఇంటికి చుట్టపు చూపుగా వచ్చాడు, శ్రీశైలం. అతను బాగా చదువుకున్నవాడు; మంచి-చెడు తెలిసినవాడు. రాఘవపురంలో ఏం జరుగుతోందో చూసి, సంగతి అర్థం చేసుకున్నాడు. తన స్నేహితుడైన డాక్టర్‌ శివకు ఉత్తరం రాసాడు: "ఈ ఊరిని ఎలాగైనా కాపాడాలి. అందుకు నీ సహాయం కావాలి" అని.

డాక్టర్‌ శివ కూడా వెంటనే బయలుదేరి వచ్చాడు. ఐతే ఆయన చేత వైద్యం చేయించుకునేందుకు ఊళ్ళోవాళ్ళు ఎవ్వరూ ముందుకు రాలేదు! "ఇది దేవుడి మాయ! దుష్ట శక్తుల ప్రభావం!‌ దీనికి వైద్యం చేయించుకుంటే పరిస్థితి మరింత వికటిస్తుంది" అని గట్టిగా చెప్పారు అందరూ. ఐతే డాక్టర్ శివ తెలివైనవాడు. పల్లెల్లో పరిస్థితి తెలిసిన వాడు. "మీలో చాలామందికి బాగా లేదు కదా; అందుకని ముందుగా నేను ఒక్క నలుగురికి మాత్రం వైద్యం చేస్తాను. నా వైద్యం మూలంగా వాళ్ళు బాగైనారనుకోండి, అటు తర్వాత మిగిలిన వాళ్లకి వైద్యం చేయిద్దురు. అట్లా జగగకపోతే నేను ఇక మిమ్మల్ని ఒత్తిడి చేయను. నిశ్శబ్దంగా ఇక్కడి నుండి వెళ్ళిపోతాను" అని, అందుకు అంగీకరించిన నలుగురైదుగురికి మాత్రం మందులిచ్చాడు. నాలుగు రోజులు గడిచేసరికి వాళ్ళంతా కోలుకోసాగారు. దాంతో ఊళ్ళో జనాలందరికీ అపనమ్మకం వదిలిపోయింది. ఒక్కరొక్కరుగా డాక్టరు దగ్గరికి వచ్చి, మందుల వాడకం మొదలుపెట్టారు. డాక్టరుపట్ల, విజ్ఞానం పట్ల, చదువు పట్ల వాళ్లకు ఒక నమ్మకం ఏర్పడింది.

 

"అసలు ఎందుకిలా జరిగింది?" అని డాక్టరుగారిని అడిగాడు శ్రీశైలం. "సాధారణంగా ఇట్లాంటి సమస్యలు నీళ్ళతోటే వస్తుంటాయి- ముందుగా వీళ్ళు త్రాగే నీటిని పరీక్షించాలి" అంటూ సెలయేటి లోని నీటిని రెండు బాటిళ్లలో నింపి పరీక్షకోసం ప్రభుత్వం వారి ల్యాబుకు పంపించాడు డాక్టర్ శివ. మరో వారం గడిచే సరికి పరీక్షా ఫలితాలు వచ్చాయి. జనాల సమక్షంలో రిపోర్టులను పరిశీలించిన శివ, శ్రీశైలం ఇద్దరూ దిగులుగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. "మీ ఊరికి దగ్గర్లో ఏమైనా ఫ్యాక్టరీలు ఉన్నాయా?" అడిగాడు డాక్టర్ శివ. "ఉన్నాయి. మన ఊరునుండి ఏడు కిలోమీటర్ల దూరంలో ప్లాస్టిక్ ఫ్యాక్టరీ ఒకటి ఉన్నది. ఏమి?" అడిగాడు సర్పంచ్.

"దాని ప్రభావమే ఇదంతా. ఆ కంపెనీ విడుదల చేసే హానికరమైన రసాయనాలు ఈ సెలయేటిలో కలుస్తున్నాయి. వాటి మూలంగా నీటిలో ఉన్న జలచరాలు చనిపోతాయి. వాటిని ఆశించే క్రిములవల్ల నీరుమొత్తం మరింత విషపూరితం అవుతుంది. ఆ నీళ్లని త్రాగేవారికి అందరికీ పలు రకాల వ్యాధులు సంక్రమిస్తాయి, మనుషులు చనిపోవచ్చు కూడా. ఇది దేవుడి మాయ కాదు; దుష్టశక్తుల ప్రభావం కూడా కాదు: ఇవన్నీ మనిషి తెలిసి చేస్తున్న తప్పులు!" వివరించాడు డాక్టర్ శివ. దాంతో ఊరి ప్రజలకు భయం పోయి, దిగులు పట్టుకుంది. 'గాలి,భూమి, అడవి, నీరు- ఇట్లా అన్నీ కలుషితం అయిపోతుంటే, ఇక మనమూ, నోరులేని జీవాలు ఎట్లా బ్రతికేది?!' అంటూ వాపోయారు.

శ్రీశైలం అన్నాడు- "దిగులుపడి ప్రయోజనం లేదు. మన వనరుల్ని మనమే కాపాడుకోవాలి. హానికరమైన రసాయనా-లను వదిలే కంపెనీలను మూయించాలి, చెట్లను బాగా నాటాలి. చిన్న పిల్లలకి, అనారోగ్యంతో ఉన్నవారికి కాచి వడగట్టిన నీటిని త్రాగించాలి. మనకు హాని చేస్తున్న ఈ కంపెనీకి నోటీసులు పంపాలి. దాన్ని మూయించాలని ప్రభుత్వానికి వినతిపత్రాలు అందజేయాలి" అని. అందరూ కదిలి, తమ తమ స్థాయిలలో పోరాటం చేసారు. చివరకు ఆ ఫ్యాక్టరీ మూత పడింది. ఐదు సంవత్సరాల తరువాత రాఘవపురంలో పిల్లలంతా బడికి పోసాగారు. చాలా మంది పెద్దవాళ్ళు కూడా చదువు నేర్చుకున్నారు. దుష్టశక్తుల్ని నమ్మి చేతులు ముడుచుకొని కూర్చోవటం లేదు- అందరూ వికసించిన బుద్ధితో కార్యతత్పరులయ్యారు!

కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో