Facebook Twitter
కీర్తివర్మ కీర్తి కాంక్ష

మగధ రాజ్యాన్ని మణివర్మ  పాలించినంత కాలం  ప్రజలను కన్న బిడ్డల్లాగా చూసుకున్నాడు. తమకీ అలాంటి రాజు ఉంటే  బాగుంటుందని పొరుగు రాజ్య ప్రజలు భావించేలా  ఆయన పరిపాలన ఉండేది. అంతటి  మంచి పేరున్న రాజు  మణివర్మ   హఠాత్తుగా  చనిపోవడంతో  యువరాజు కీర్తివర్మని రాజుగా పట్టాభిషిక్తుణ్ణి చేశారు. కీర్తివర్మకి కొన్ని బలహీనతలున్నాయి. అందులో కీర్తి కాంక్ష ఒకటి. తన తండ్రి కంటే  గొప్ప పేరుని  తొందరగా  పొందాలనుకున్నాడు అతడు.  

అధికారం చేతికి రాగానే అధికారులు, మంత్రులతో  సభ ఏర్పాటు చేసి,  తన మనసులోని  మాటను చెప్పాడు కీర్తివర్మ. ప్రధానమంత్రి వివేకి మాత్రం  అలాంటి కోరిక  మంచిది కాదు. అందువల్ల ఎన్నో అనర్ధాలు జరుగుతాయి. రాజ్య భవిష్యత్తు నాశనమౌతుంది.  మీ తండ్రిగారి లాగానే  పరిపాలన అందిస్తే కొంతకాలానికి  మీకూ పేరు ప్రఖ్యాతులు వస్తాయి. అడ్డుదారిలో వెళ్ళవద్దు అని చెప్పాడు. వివేకి మాటలు   కీర్తివర్మకు నచ్చలేదు.  దాంతో మిగతా వారిని సూచనలు, సలహాలు అడిగాడు కీర్తివర్మ. 

 మిగిలిన మంత్రులు, అధికారులు కీర్తివర్మ మెప్పు పొందడం కోసం కొన్ని సూచనలు చేసారు. అవేమిటంటే పేదలందరికీ ఉచితంగా ఆహార ధాన్యాలు సరఫరా చేయడం, మంచి దుస్తులు పంపిణీ చేయడం, ధర్మసత్రాలు కట్టించి ఉచిత భోజన సదుపాయం కల్పించడం, వ్యాపారులు, ధనవంతులకి పన్ను రాయితీలు కల్పించడం, రైతుల  నుండి  శిస్తు వసూలు నిలిపెయ్యడం మొదలైనవి ఉన్నాయి. వారి మాటలు కీర్తివర్మకి బాగా  నచ్చాయి. వాటిని వెంటనే  అమలుపరిచాడు.  

దాంతో కీర్తివర్మ  పేరు రాజ్యమంతా మారుమోగిపోయింది. ఒక  మాసం తరువాత ప్రజల్లోకి వెళ్లి తన పరిపాలన గురించి అభిప్రాయాలు అడిగాడు కీర్తివర్మ.  ఆ  దేవుడే దిగి వచ్చినట్టు కీర్తివర్మని గౌరవించారు ప్రజలు. అంతవరకూ అమలుపరిచిన పథకాలను పొగుడుతూ కీర్తివర్మను ఆకాశానికి ఎత్తేసారు . కీర్తివర్మ సంతోషానికి అంతులేకపోయింది. 

   తననిలాగే ప్రజలు మెచ్చుకోవాలంటే ఇంకేమి చేయాలో చెప్పమని మళ్ళీ మంత్రులను అడిగాడు కీర్తివర్మ. ప్రజలకిచ్చిన అప్పుల మీద  వడ్డీని రద్దు చెయ్యమని, ప్రజలకు వినోద కార్యక్రమాలు ఏర్పాటు చెయ్యమని,  ఉచితంగా గృహాలను నిర్మించి   ఇవ్వమని  మరికొన్ని సూచనలు చేశారు మంత్రులు.   వాటిని వెంటనే అమలుపరిచాడు కీర్తివర్మ. 

  ప్రధాన మంత్రి వివేకి ఎప్పటిలాగా వాటిని వ్యతిరేకించాడు.  కానీ కీర్తివర్మ వినిపించుకోలేదు. ఖజానా లోని ధనం  సంక్షేమ పథకాల కోసం కాకపోతే  మరెందుకని ఎదురు ప్రశ్నించాడు కీర్తివర్మ.  

  కీర్తివర్మ అందిస్తున్న  సంక్షేమ పథకాలు రాజ్యంలోని సోమరులకు  బాగా ఉపయోగపడ్డాయి. పేద ప్రజలందరికీ  పథకాల ప్రయోజనం అందింది. దాంతో  తిండి గింజల కోసం  వెతకాల్సిన అవసరం లేకపోయింది వాళ్లకి. వీటికి తోడు ఇంట్లో ఉండే  వృద్ధులకు వచ్చే వృద్ధాప్య పథకంతో కుటుంబ ఖర్చులు కూడా గడచిపోయేవి.  ఎప్పుడైనా వంట చెయ్యడానికి బద్ధకమనిపిస్తే ఉచిత భోజనానికి వెళ్లి భోంచేసేవారు.    

అలా  రాజుగారే అన్న వస్త్రాలు, గృహము ఉచితంగా ఇస్తున్నప్పుడు మళ్ళీ కష్టపడడం దేనికని ప్రజలు అనుకున్నారు. అప్పటి నుండి కష్టపడి చేసే  పనులకు వెళ్లడం మానేశారు. 
అయితే రాజ్యంలో  కాయకష్టానికి అలవాటు పడిన   రైతులు, నిజాయతీ ఉన్న వ్యాపారులు ఇంకా కొందరు మిగిలారు. వాళ్లకి పంటలు పండించడానికి , సరకు రవాణా చేయడానికి పని మనుషులు దొరికేవారు కాదు.  ఊరు పరిశుభ్రత కాపాడటానికి, రోగుల సేవలు చేయడానికి, సాధారణ ప్రజల  ఆరోగ్యం కాపాడడానికి  శ్రామికులు దొరికేవారు కాదు.  అలా ఎన్నో ఇబ్బందులు వచ్చాయి ప్రజలకి.  

అలాంటి వాళ్లంతా కీర్తివర్మని కలసి సమస్యలు విన్నవించడానికి  వెళ్లారు.   పొగడ్తల మత్తుకి అలవాటు పడిన కీర్తివర్మ  వాళ్ళని కలవలేదు.   ఇలా ఉండగా మరోవైపు రాజ్య ఆర్ధిక పరిస్థితి దెబ్బతింది. ఖజానాలోని డబ్బు రెండేళ్ల వరకు మాత్రమే  సరిపోయింది. ఖర్చులే తప్ప రాబడి లేకపోవడంతో తరువాతి  అవసరాల కోసం నిలువ ఉంచిన బంగారాన్ని కరిగించి డబ్బుగా మార్చి ఖర్చు చేసాడు కీర్తివర్మ. అలా ఆరు నెలలు గడిచాయి. మళ్ళీ ధనం అవసరం ఏర్పడింది. ఈసారి  రాజరిక   వారసత్వ చిహ్నాలైన భవనాలు, ఆస్తులను  తాకట్టు పెట్టి ధనం అప్పు తెచ్చాడు. అలా తెచ్చిన ధనం మరో ఏడాదిలో అయిపోయింది.  తరువాత నుండి  సంక్షేమ పథకాలకే  కాకుండా అప్పులకు వడ్డీ చెల్లించడానికి ధనం అవసరమైంది. తనఖా పెట్టిన  ఆస్తులను అమ్మేసి  ధనం తెచ్చాడు  కీర్తివర్మ. 

 పరిస్థితి ఇలాగే ఉంటే రాజ్యం చేయి జారిపోతుందని భయపడ్డాడు మంత్రి వివేకి. కీర్తివర్మని కలసి నచ్చజెబుతామనుకున్నా అలాంటి అవకాశమే  ఇవ్వలేదు అతడికి. 
ఇంతలో పొరుగు రాజు నుండి కీర్తివర్మకు ఒక లేఖ అందింది. “మీ రాజ్యంపై దండయాత్ర ఆలోచన ఉంది.   మీ రాజ్యంలో అప్పులే తప్ప ఆస్తులు లేవని, రోజువారీ ఖర్చులకు కూడా ధనం లేదని తెలిసి  దండయాత్రను  ప్రస్తుతానికి   వాయిదా వేస్తున్నాం. మీ తండ్రిగారితో  మాకున్న స్నేహం  వలన  మీకొక అవకాశం ఇస్తున్నాం. మీ రాజ్యంలో ఉచిత పథకాల అమలుని తక్షణం నిలిపి వేసి,  ప్రజల్లో కష్టించే తత్త్వం పెంచినట్టయితే దండయాత్ర ఆలోచన విరమిస్తాం. లేనిపక్షంలో  దండయాత్ర జరిపి తీరుతాం”  అని ఉంది.    

ఆ లేఖ చూడగానే కీర్తివర్మ కంగారుపడ్డాడు. మూలిగే నక్క మీద తాటిపండు పడినట్లు  యుద్ధం అంటే ఎన్ని నష్టాల్లో తెలిసినందున వెంటనే మంత్రి వివేకిని పిలిపించి సలహా అడిగాడు.  ఉచిత పథకాలు ఆపేస్తున్నట్టు  రాజ్యంలో చాటింపు వేయించి , పొరుగు రాజుకి బదులు లేఖ పంపుదామని సలహా ఇచ్చాడు. అలాగే చేసాడు కీరివర్మ. 

తరువాత నుండి వివేకి సలహాలను పాటిస్తూ  పరిపాలన సాగించడంతో      కొన్నాళ్ళకి రాజ్యంలోని  పరిస్థితులు చక్కబడ్డాయి.  కొన్నాళ్ల తరువాత పొరుగురాజుకి ఒక లేఖ అందింది. 

అందులో  మా రాజ్యం విపత్తు అంచున ఉన్నప్పుడు నా కోరిక మేరకు మా రాజ్యంలోని పరిస్థితులు చక్కబడేందుకు బెదిరింపు లేఖ పంపించి, సహకరించినందుకు ధన్యవాదాలు. తమ శ్రేయోభిలాషి  వివేకి” అని ఉంది.