Facebook Twitter
తండ్రి నేర్పిన పాఠం

రామనాధం గొప్ప ధనవంతుడు. ఆయనకు  చుట్టుప్రక్కల    పట్టణాల్లో కర్మాగారాలు, వ్యాపారాలున్నాయి.  వాటి నుండి  మంచి  లాభాలను గడిస్తున్నాడు.   కొన్ని వ్యాపారాలను  సొంతంగా చూసుకుంటూ.  దూరప్రాంతాలలో వాటికి  నమ్మకస్తులైన అధికారులను  నియమించి  పర్యవేక్షిస్తూ వ్యాపారాలను నడిపేవాడు. 

రామనాధంకి  విశ్వనాథం ఒక్కడే  కొడుకు. అతడు గురుకులంలో ఉన్నత  విద్య  పూర్తి చేసి  ఇంటికి వచ్చాడు. తెలివైనవాడిగా  గురు ప్రశంసలు పొందినవాడే విశ్వనాథం. 

 ఒకరోజు తండ్రీ కొడుకులు భోజనం చేస్తూ మాటల మధ్యన     ‘ఇంకా చదవాల్సింది ఉందా? చదువయ్యాక ఉద్యోగం చేస్తావా ? వ్యాపారంలోకి వస్తావా’ అని కొడుకుని రామనాధం  అడిగాడు. 

తన చదువు పూర్తయిందనీ , ఎక్కడా ఉద్యోగం చెయ్యాలని లేదనీ, తండ్రి దగ్గర మెళకువలు నేర్చుకుని వ్యాపారంలో   స్థిరపడతానని  చెప్పాడు విశ్వనాథం. 

 రామనాధం సంతోషించి “నీకు నచ్చినట్టే చెయ్యు. ఒక్కడినే ఇంత పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్వహించడం  కష్టంగా ఉంది. ఇకనుంచైనా నీ  సాయం దొరికితే చాలు” అన్నాడు. 

ఒకరోజు రామనాధం కొడుకుని  పిలిచి “మన వ్యాపారం ఎలా జరుగుతుందో  నువ్వు  చూడాలి . మనం నియమించిన నమ్మకస్తులైన అధికారుల   పర్యవేక్షణలో పని నడుస్తోంది కొన్ని చోట్ల . అలాంటి  దగ్గరకు  నువ్వెళ్ళి పరిశీలించు. కొత్త  విషయాలు తెలుసుకో. ఏవైనా సందేహాలుంటే అడిగి తీర్చుకో . నాతోనే చెప్పాల్సినవైతే వచ్చి అడిగితే తీరుస్తాను.  ఈ  రోజుకి నూనె మిల్లుకు వెళ్ళు” అని పంపాడు.   

విశ్వనాథం తండ్రి చెప్పినట్టే వెళ్ళాడు.  రెండోరోజు  ధాన్యం మిల్లుకు, మూడోరోజున  బెల్లం తయారీ కేంద్రానికి, నాలుగవ రోజున  వస్త్రాల తయారీ  మిల్లుకు వెళ్ళాడు.  

నాలుగు రోజుల తరువాత తండ్రీ కొడుకులు  కలసి కూర్చున్నప్పుడు “నువ్వేమి గమనించావో చెప్పు” అనడిగాడు రామనాధం. 

 “మన కర్మాగారాల్లో పనివాళ్ళకి స్వేచ్ఛ ఎక్కువైంది.  వాళ్ళలో కొన్ని లోపాలు కనిపించాయి. అలాంటివి మనం సహించకూడదు.  వారిలాంటి పని దొంగలతో కఠినంగా వ్యవహరించాలి”  అన్నాడు విశ్వనాథం.  

అతడు ఏయే లోపాలు గమనించాడో   చెప్పమన్నాడు  రామనాధం. 

 ‘కొందరు పనివాళ్ళు పని వేళల్లో  విశ్రాంతి తీసుకుంటూ కనిపించారు.  అక్కడి అధికారులు వాళ్ళనేమీ మందలించడం  లేదు. ఆడవాళ్లయితే   పిల్లలను మిల్లుకే తెచ్చి  ఉయ్యాలలో ఆడిస్తున్నారు. మరికొందరైతే సరుకులు కొనాలనో, సొంత పని చూసుకుని వస్తామనో  పని మధ్యలో బయటకు వెళ్లి వస్తున్నారు. గరిసెల కొద్దీ ధాన్యం బయట ఆరబోసినా వర్షం వస్తుందనే  బెరుకు ఎవరిలోనూ కనిపించలేదు. చెరకు మిల్లులో కూడా కొన్ని సరకులు వృధాగా పారబోశారు. ఇలా చాలానే  కనిపించాయి” అన్నాడు విశ్వనాథం.  

 కొడుకు చెప్పింది విన్న తరువాత “  అంతేనా?”అన్నాడు రామనాధం తేలిగ్గా.  

“అదేంటి నాన్నా. తేలిగ్గా తీసేసావు? అలాగయితే మనకు నష్టం రాదా?” అనడిగాడు విశ్వనాథం చిరాకుగా ముఖం పెట్టి. 

రామనాధం చిన్నగా   నవ్వి “మనం కొన్ని విషయాలను  చూసీ చూడనట్లు వదిలెయ్యాలి. ఉద్యోగులు, కార్మికులకూ   కుటుంబం, సమస్యలు, ఒత్తిడి, అప్పులు, అవసరాలు, బాధ్యతలు  ఉంటాయి. మన మిల్లుకి పనికి హాజరు కాని రోజున  వారికి జీతం ఇవ్వము. అలాంటప్పుడు భుక్తి గడవదు. అందుకే పని వేళల్లో  కొన్ని బయటి పనులు పూర్తి చేస్తారు. విశ్రాంతి తీసుకుంటూ నీకు కనిపించిన వాళ్లంతా సంఘ నాయకులు.  ఉద్యోగుల శ్రేయస్సు  కోసం    శ్రమించే వారికి ఆ మాత్రం వెసులుబాటు ఇవ్వాలి. వాళ్లతో తగువు పెట్టుకోవడం మంచిది కాదు. కొన్ని సరకులు వృధా జరగడం మన దగ్గరే కాదు అన్ని  కర్మాగారాల్లో , పని ప్రదేశాల్లో జరుగుతుంది. దాన్ని  తరుగుదలగా భావిస్తాం.  అదసలు పట్టించుకోవద్దు. ధాన్యం కుప్పలు బయట ఉంచినా వాళ్ళెవరూ భయపడలేదంటే  ఋతువుల గమనం వాళ్లకు తెలుసుననీ, వర్షం ఇప్పట్లో కురియదనే నమ్మకంతో అలా వదిలేసారు. ఇన్నేళ్లూ మన  వ్యాపారంలో   లాభాలు గడిస్తున్నామంటే   ఆయా  ఉద్యోగులు, కార్మికుల  పనితనం వల్లనే. 
ఇలాంటి సందర్భాల్లో  పెద్దలు  చెప్పిన ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి.   ‘యజమానివైతే కొన్ని సందర్భాలలో చూడనట్లు నటించాలి. సేవకుడైతే చెవిటివానిలా నటించాలి. అది ఇక్కడ మనకూ వర్తిస్తుంది.  సందర్భాన్ని బట్టి  ప్రవర్తించు. అన్ని వేళలా కరకుదనం పనికిరాదు. లౌక్యం అలవరచుకో” అన్నాడు. 

విశ్వనాథానికి   విషయం బోధపడింది.  తరువాత కాలంలో తండ్రి బాటలోనే నడుస్తూ  వ్యాపారాలను లాభాల్లో  నడిపించాడు.