Facebook Twitter
చదువుల తల్లి

చదువుల తల్లి...!

 

పోరుబండలో సుధా విద్యాలయాన్ని నడిపే సోమప్పగారిది మంచి మనసు. తన బడిలో డబ్బున్న పిల్లలతో బాటు కొందరు పేద పిల్లల్ని కూడా, ఫీజు లేకుండా చేర్చుకునేవాడాయన. ఆ బడిలో సుప్రీత్‌ , జనార్ధన్ అనే ఇద్దరు పిల్లలు, బాగా చదివేవాళ్ళు. సుప్రీత్‌ బాగా డబ్బులు ఉన్న కుటుంబం వాడు; జనార్దన్‌ పేద కుటుంబంవాడు.

సుప్రీత్‌కు తెలివి తేటలతోబాటు, డబ్బులు తెచ్చిన అహంకారం కూడా బాగా ఉండేది. ఎప్పుడూ జనార్దన్‌ని "మీకు డబ్బు లేదురా! మా డబ్బున్న వాళ్ళ పక్కన కూర్చోకు!" అని వెటకరిస్తూ ఉండేవాడు. అయితే జనార్దన్‌కి చదువు మీద ఉన్న ఇష్టాన్ని ఏ అవమానాలూ తగ్గించలేక పోయాయి. వాడు మనసు పెట్టి చదివి, అన్ని పరీక్షలలోనూ సుప్రీత్‌కంటే ఎక్కువ మార్కులే తెచ్చుకునేవాడు; పైపెచ్చు అందరితోటీ మర్యాదగా మెలిగేవాడు.

 

ఒకసారి సుప్రీత్‌ పుట్టిన రోజు వచ్చింది. ఆ రోజున వాడు క్లాసులో అందరికీ తినుబండారాలు పంచి, చాలా గొప్పగా పండుగ జరుపుకొన్నాడు. కొన్ని రోజుల తరువాత జనార్దన్‌ పుట్టిన రోజు. వాడి దగ్గర డబ్బులు ఏమాత్రం లేవు. అయినా తమ టీచర్లు చెప్పిన దేశనాయకులని తలచుకొని, కథల్లో చదివినట్లు, తన పుట్టిన రోజు సందర్భంగా ఒక మొక్కని నాటి సంతోషపడ్డాడు వాడు.

వాళ్ళ బడిలో ఆటలు ఆడాలంటే "షూస్" తప్పకుండా ఉండాలి. డబ్బులున్న పిల్లలంతా "షూస్" కొనుక్కున్నారు. కానీ జనార్ధన్‌కి అవి ఎక్కడినుండి వస్తాయి? వాళ్ళ అమ్మ-నాన్న ఇద్దరూ కూలి పని చేసుకొని బ్రతుకుతారు. ఒక్క రోజున కూలికి వెళ్ళకపోయినా పూటగడవదు. దాంతో వాడు ఆలోచించి, స్కూల్లో ఎవరో పారేసిన పాడైపోయిన "షూస్"ని తీసుకెళ్ళి, సొంతగా రిపేరు చేసుకొని వేసుకున్నాడు. అది చూసిన సుప్రీత్, ఇతర పిల్లలు వాడిని ఒకటే ఆట పట్టించారు. అయినా జనార్దన్ పట్టువదలకుండా ఆడి, పెద్దలందరినీ మెప్పించాడు.

 

ఆ రోజుల్లో జనార్దన్‌కి వ్యాపారం చేయాలని ఉండేది. సోమప్పగారు వాడిని అడిగారు ఒకసారి- "జనార్దన్! నువ్వు పెద్దయినాక ఎవరవుతావు?" అని. "సార్! నేను సుప్రీత్ వాళ్ళ నాన్న మాదిరి గొప్ప వ్యాపారిని అవుతాను సార్!" టక్కున జవాబిచ్చాడు జనార్దన్. "ఎందుకు, అట్లా ఎందుకు అనుకుంటున్నావు?" అడిగారు సోమప్ప, ఆశ్చర్యంగా. "వ్యాపారి ఐతే డబ్బులు బాగా సంపాదించచ్చు సార్; హాయిగా బ్రతకచ్చు; మీలాగా పదిమందికి సాయం కూడా చేయచ్చు" చెప్పాడు జనార్దన్.

ఆయన నవ్వి "బాగుందిరా. అయినా నేనో సంగతి చెబుతాను వింటావా? నీలాంటి తెలివైన మంచి పిల్లలు ఊరికే పది మందికి సాయం చేయటంతో ఆగిపోకూడదు- ఉన్నత ఉద్యోగాలమీద దృష్టి పెట్టి, ఏ కలెక్టర్లో అయి, వందలాది మందికి దిశానిర్దేశం చేయాలి. లక్ష్యాలంటూ ఉంటే అవి సమున్నతంగా ఉండాలి. వాటికోసం నిరంతరంగా కృషి చేయాలి. నువ్వు ముందు చక్కగా రాయటం సాధన చెయ్యి. మన దేశంలోనూ, బయటా ఏం జరుగుతున్నాయో తెలుసుకుంటూ‌ ఉండు. రోజూ కనీసం ఒక అరగంటసేపు వార్తాపత్రికలు చదువు" అన్నాడు.

 

ఆయన మాటలు జనార్దన్ మనసులో చెరగని ముద్ర వేసాయి. ఇక ఆరోజునుండి వాడు సమయాన్ని ఇంకా చక్కగా వినియోగించుకున్నాడు. రోజూ ఉదయాన్నే పేపరు వేస్తూ అలా పాఠ్య పుస్తకాలతోబాటు పేపరు కూడా చదివే అలవాటు చేసుకున్నాడు. వ్యాసాలు చదవటం, సొంతగా రాయటం, వక్తృత్వ పోటీల్లో పాల్గొనటం మొదలు పెట్టాడు. చక్కని మార్కులతో పదవ తరగతి పాసయ్యాడు. వాడు ఇంటర్మీడియట్లో‌ ఉండగా వాళ్ళ నాన్నకి జబ్బుచేసి చనిపోయాడు. అటుపైన జనార్దన్ ప్రొద్దునంతా చదువుకొని, రాత్రిపూట హోటల్‌లో పనిచేసాడు. ఆ డబ్బులతోటే ఇల్లు నడిపాడు; చెల్లినీ చదివించాడు.

ఎన్ని కష్టాలొచ్చినా తన లక్ష్యాన్ని మరచిపోని జనార్దన్ చివరికి సివిల్ సర్వీసెస్ పరీక్ష రాసి, ఐయేయస్ అధికారి అయ్యాడు. ఎన్ని పదవులు అధిరోహించినా తన మూలాల్ని మర్చిపోలేదు జనార్దన్. నిజాయితీ, కార్యశుద్ధి గల అధికారిగాను, దయగల మంచి మనిషిగాను పేరుతెచ్చుకున్నాడు. తనలాగా కష్టాల్లో ఉన్న వందలాది మందికి సరైన దారి చూపిస్తూ వచ్చాడు. వ్యాపారంలోను, ఇతర రంగాలలోను రాణించి కూడా స్వార్థ చింతనలోంచి బయటికి రాలేని మిత్రుల్ని చూసినప్పుడల్లా సోమప్పగారు చెప్పింది గుర్తు చేసుకునేవాడు జనార్దన్: "డబ్బు సుఖాన్ని మాత్రమే ఇస్తుంది. కానీ చదువుల తల్లి మనకు మంచితనాన్ని ఇచ్చి, పదిమందికి సాయపడేలా చేస్తుంది" అని.

కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో