Facebook Twitter
దీపావళి

దీపావళి

 


పూర్వం ప్రాగ్జ్యోతిషం అనే దేశం ఒకటి ఉండేది. 'ప్రాక్ జ్యోతిషం' అంటే 'ముందుగా వెలుగును చూసేది' అని అర్థం. ఆ దేశాన్ని నరకుడు అనే రాజు పరిపాలించేవాడు.

నరకుడు మామూలు వాడు కాదు. స్వయానా భూమికి పుత్రుడు. భూమి మీద ఉన్న సమస్త సంపదలు, ఔషధాలు, భూమి లోపల ఉన్న సమస్తమైన ఖనిజాలు- అన్నిటి పైనా అతనిదే అధికారం; వాటి ఫలితాలన్నీ పూర్తిగా అతనికి లోబడినై. నరకుడు తీవ్రమైన తపస్సు చేసి ఈ విషయాలన్నీ కనుక్కోవడంతో పాటు, ఏ పురుషుని చేతా చావులేకుండా వరం కూడా పొందాడు, బ్రహ్మ నుండి.

అయితే అట్లా పరిపాలకుడిగా భూమిపైన సర్వ హక్కులూ పొందిన నరకుడు, అవన్నీ 'తన సొంతమే' అనుకున్నాడు. 'తన సొంత వస్తువుల్ని వేరే ఎవరికైనా ఎందుకివ్వాలి?'- అని, అవేవీ ఇతరులెవ్వరికీ దొరకకుండా కట్టడి చేశాడు. అంటే నరకుడు స్వార్థానికి చిహ్నం అనమాట.

ఔషధాలూ ఖనిజాలే కాక, ప్రాగ్జ్యోతిషం మీద ప్రథమంగా పడే వెలుగును కూడా ఇతరులకు అందకుండా చేసాడు నరకాసురుడు. 'శబ్దం-స్పర్శ-రూపం-రుచి-వాసన అనే జ్ఞానాలను తెలిపే శక్తులన్నింటీనీ అతను అణచి పెట్టాడు. తన గొప్పతనాన్ని అంగీకరించని ఋషులని, సాధువులను, రాజులను హింసించటం మొదలుపెట్టాడు. పదహారు వేల మంది రాజకుమార్తెలను బందీలుగా చేసి పెట్టాడు. దేవమాత అదితి కర్ణ కుండలాలను, వానలు కురిపించే వరుణుడి గొడుగును కూడా తన కోటలో పెట్టేసుకున్నాడు.

నరకుడి భయానికి మనుషులందరూ తమలో తామే కుంచించుకు పోయారు. భూమిపైనే నరకమంటే ఏమిటో రుచి చూసారు. ప్రకాశానికి దూరమైన మానవజాతి అజ్ఞానంలోనూ, పాపంలోనూ, చీకటిలోనూ కూరుకు పోసాగింది.

నరకుడి ఆగడాలు మిన్ను ముట్టేసరికి దేవతల రాజు ఇంద్రుడు 'తమ కష్టాలన్నిటినీ తీర్చగలిగే వాడెవడా' అని వెతుక్కున్నాడు. 'నరకుడిని పుట్టించిన తల్లి ప్రకృతి- భూమి తప్ప మరెవ్వరూ వాడిని చంపలేరు' అని కనుక్కున్నాడు. విష్ణువు అవతారమైన కృష్ణుడిని, స్వయంగా భూదేవి అయిన సత్యభామను దర్శించుకొని, నరకాసురుడి భారం తగ్గించమని వేడుకున్నాడు.

కృష్ణుడు సత్యభామ ఇద్దరూ గరుడ వాహనం ఎక్కి, ప్రాగ్జ్యోతిషానికి పోయి, నరకునితో యుద్ధం చేసారు. చివరికి సత్యభామ వదిలిన బాణం నరకాసురుడిని తుద ముట్టించింది. తల్లి స్వయంగా తన దుష్ట సంతానాన్ని హరించింది. జ్ఞాన కిరణాలు మళ్లీ ఒకసారి జగత్తు అంతటా నిరాటంకంగా ప్రసరించాయి.

అజ్ఞానానికి, చీకటికి ప్రతీకగా నిలచి, భూమి మీద నరకం చూపించిన నరకుడి చావుతో ప్రజలు అందరూ తనివి తీరా దీపాలు వెలిగించారు. బాణాసంచా కాల్చారు. పిండి వంటలు, మిఠాయిలు చేసుకున్నారు.

ఈ దీపావళి కథలోని పాత్రలేవీ నిజంగా ఉండనక్కర్లేదు. కథ ఉందిగా, చాలు! ఈ కథ ఏం చెబుతుంది? - ప్రకృతి ఎంత బలీయమైనదో చెబుతుంది ఈ కథ. ప్రకృతిలోని సంపదలు అన్ని ప్రాణులకీ చెందాలి తప్ప, వాటిని ఏ ఒక్క జీవీ, ఏ ఒక్క దేశమూ తన సొంతం చేసుకునేందుకు ప్రయత్నించకూడదని చెప్తుంది; ప్రపంచంలోని అన్ని ఘటనలనూ నిర్ణయించే శక్తిని ఏ ఒక్కరూ వశపరచుకోలేరని, దాన్ని ఎవ్వరూ దుర్వినియోగం చేయరాదని చెప్తుంది; చీకటీ-అజ్ఞానం ఏనాటికైనా తప్పకుండా నశిస్తాయని చెప్తుంది. ఆశావాదానికి పునాది వేస్తుంది!

మీకందరికీ మరి, వెలుగుల పండగ దీపావళి శుభాకాంక్షలు!