Facebook Twitter
తెలుగు ఉన్నంతకాలం వినిపించే పాట – సినారే!

నిండైన విగ్రహం. కదిపితే సెలయేరులా జాలువారే సాహిత్యం. కవికి గుర్తింపు తీసుకువచ్చిన వ్యక్తిత్వం- ఆ సినారే ఇక లేరన్నది జీర్ణించుకోలేని సత్యం. ఎంత చిన్న సాహితీ వేడుకకైనా, పిలవగానే వచ్చి అందించే ఆశీస్సులు ఇక ఉండబోవు. ఏటా తన జన్మదినాన వెలువరించే కొత్త పుస్తకాలకి ఇక సెలవు! తెలుగునాట సాహిత్య అభిమానులంతా చెమర్చిన కళ్లని అదుముకుంటూ, గుండెని తడుముకుంటూ... సినారేకి ఇక సెలవంటూ కడసారి వీడ్కోలు చెప్పుకొంటున్నారు. ఆనాటి మధురస్మృతులు, ఏనాటికీ చెరిగిపోని తీపి గురుతులు అయిన ఆయన జీవితాన్ని తల్చుకొంటున్నారు.


సింగిరెడ్డి నారాయణరెడ్డి అంటే బహుశా ఎవరూ గుర్తుపట్టలేరేమో! కానీ సినారే అంటే మాత్రం, ఠక్కున తెలుగు కవిత్వపు దివిటీని చేపట్టిన కవి గుర్తుకువస్తారు. తెలుగునాట ఏఎన్నార్, ఎన్టీఆర్‌ అంటే ఎంత ప్రచారం ఉండేదో సినారే పొడి అక్షరాలకి కూడా అంతే ప్రభావం ఉండేది. సినారేది సాహిత్యం నేపథ్యంగా ఉన్న కుటుంబమేమీ కాదు. ఆయనది కరీంనగర్‌లోని ఓ మారుమూల గ్రామం. తండ్రి ఓ సాధారణ రైతు. బీ.ఏ వరకూ సినారే చదివిందంతా ఉర్దూ మాధ్యమంలోనే! కానీ తెలుగు సాహిత్యం పట్ల అభిరుచితో పోస్ట్‌గ్రాడ్యుయేట్, డాక్టరేట్‌ అంతా తెలుగులోనే సాగించారు. ఆ సమయంలో విద్య కోసమే కాకుండా, తన అభిలాషని చల్లార్చుకోవడం కోసమూ విస్తృతంగా పుస్తకాలు చదివేవారు.


తెలుగు అధ్యాపకునిగా స్థిరపడిన సినారే, వృత్తిలో అంచెలంచెలుగా ఎదుగుతూ తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి (VC) స్థాయికి చేరుకున్నారు. మరోవైపు కలంతోనూ అద్భుతాలకు తెరతీశారు. తన 23వ ఏట సినారే రచనా వ్యాసంగం మొదలైంది. కవిత్వం, కావ్యాలు, గజల్స్, అనువాదాలు, విమర్శ, పరిశోధనా గ్రంథాలు.. ఇలా ఒకటీ రెండూ కాదు- అక్షరానికి ఎన్ని రూపాలు ఇవ్వవచ్చునో అన్ని రూపాలలోనూ ఆయన రచనలు చేశారు. తెలుగునాట విశ్వనాధ సత్యనారాయణ తర్వాత జ్ఞానపీఠ్‌ పురస్కారాన్ని అందుకున్న తెలుగువాడిగా నిలిచారు. మానవుడే నాయకునిగా, ప్రపంచమే రంగస్థలంగా సాగిన ‘విశ్వంభర’ అనే కావ్యానికిగాను ఆయనకు ఆ పురస్కారం లభించింది. ‘మనసుకు తొడుగు మనిషి/ మనిషికి ఉడుపు జగతి/ ఇదే విశ్వంభరా తత్వం/ అనంత జీవిత సత్యం’ అని విశ్వంభరలో కనిపించే వాక్యాలు ఆ కావ్యపు లక్ష్యం ఏమిటో చెప్పకనే చెబుతాయి.


విశ్వంభరతో పాటుగా కర్పూర వసంతరాయలు, విశ్వనాధ నాయకుడు, అజంతా సుందరి... లాంటి రచనలెన్నో సినారే సృజనకు సాక్ష్యంగా నిలుస్తాయి. ఒకవైపు సాహిత్యాభిమానులకు మాత్రమే అర్థమయ్యే రచనలు చేస్తూనే, తెలుగువాడు ఎక్కడున్నా పాడుకోగల పాటలను రాశారు. సినిమా పాటలు సీరియస్‌ సాహిత్యం కాదనే అపవాదును తరిమికొట్టారు. ఇప్పటికీ మనం క్లాసిక్స్ అని పిల్చుకునే చాలాపాటలు సినారే కలం నుంచి జాలువారినవే! 


‘నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని’ అంటూ గులేబకావళి కథ (1962)లో ఆయన రాసిన తొలిపాటే సూపర్‌హిట్‌గా నిలిచింది. ఆపై- వగలరాణివి నీవే సొగసుకాడను నేనే (బందిపోటు), ఈ నల్లని రాళ్ళలో ఏ కన్నులు దాగెనో (అమరశిల్పి జక్కన), అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిధి (బంగారు గాజులు), వస్తాడు నా రాజు ఈ రోజు (అల్లూరి సీతారామరాజు) లాంటి అద్భుతమైన పాటలెన్నింటిలోనో ఆయన కలం పదును కనిపిస్తుంది. అంతదాకా ఎందుకు? ఈ మధ్యవరకూ మనం పాడుకున్న ఒసేవ్‌ రాములమ్మా, జేజమ్మా జేజమ్మా (అరుంధతి) పాటలు కూడా ఆయన రాసినవే! ఇలా వంద కాదు వెయ్యి కాదు... సినారే దాదాపు మూడువేలకు పైగా పాటలు రాశారంటే ఆశ్చర్యం కలగక మానదు.


ప్రతిభ ఉండటం వేరు. ఆ ప్రతిభని లోకం గుర్తించడం వేరు. లౌక్యం చేతనో, మరే కారణం చేతనోగానీ... సినారే ఎప్పుడూ తనకి రావల్సిన గౌరవాన్ని దక్కించుకుంటూనే వచ్చారు. జ్ఞానపీఠ్‌, పద్మశ్రీ, పద్మభూషణ్‌, రాజ్యసభ సభ్యత్వాలతో పాటుగా... అధికార భాషా సంఘం అధ్యక్షులుగా, సాంస్కృతిక వ్యవహారాల సలహాదారు వంటి పదవులనీ అలంకరించారు. ఇటు వ్యక్తిగత జీవితంలోనూ, అటు వృత్తి జీవితంలోనూ పరిపూర్ణతని సాధించిన సినారే ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. సినారే మరికొన్నాళ్లు మన మధ్యన ఉంటే బాగుండు అనిపించడం సహజమే! కానీ తను లేని లోటు కనిపించకుడా, ఆయన అందించిన సాహిత్యానికి ఏమాత్రం కొరత లేదు.
(సింగిరెడ్డి నారాయణరెడ్డి జూలై 29, 1931 - జూన్ 12, 2017)

 

- నిర్జర