Facebook Twitter
బతుకమ్మ పాట

బతుకమ్మ పాట!

 

 


బతుకమ్మ మీద ఇప్పుడు చాలా పాటలే వినిపిస్తున్నాయి. వాటిలో అనాదిగా జానపదులు పాడుకుంటున్న పాటలలో ఒకటి ఇది. హద్యంగా, లయబద్ధంగా బతుకమ్మ కథని పాటరూపంలో పాడుతూ బతుకమ్మ చుట్టూ ఆడిస్తుందీ పాట. దాదాపు 60 ఏళ్ల క్రితమే కృష్ణశ్రీ అనే రచయిత ఈ పాటని సేకరించి తన ‘పల్లెపదాలు’ పుస్తకంలో ప్రచురించారు.


శ్రీలక్ష్మి దేవియు చందమామ –  సృష్టి బతుకమ్మయ్యె చందమామ
పుట్టినా రీతిచెప్పె    చందమామ – భట్టు నరసింహ కవి    చందమామ
ధరచోళ దేశమున    చందమామ – ధర్మాంగుడను రాజు చందమామ
ఆరాజు భార్యయు    చందమామ – అతి సత్యవతి యండ్రు చందమామ
నూరునోములు నోమి చందమామ – నూరుమందిని గాంచె చందమామ
వారు శూరులయ్యు చందమామ – వైరులచే హతమైరి చందమామ
తల్లిదండ్రులపుడు    చందమామ – తరగనీ శోకమున చందమామ
ధనరాజ్యముల బాసి చందమామ – దాయాదులను బాసి చందమామ
వనితతో ఆ రాజు చందమామ – వనమందు నివసించె చందమామ
కలికి లక్ష్మిని గూర్చి చందమామ – ఘనతపం బొనరించె చందమామ
ప్రత్యక్షమై లక్ష్మి చందమామ – పలికె వరమడుగుమని చందమామ
వినుతించి వేడుచూ చందమామ – వెలది తనగర్భమున చందమామ
పుట్టుమని వేడగా    చందమామ – పూబోణి మది మెచ్చి చందమామ
సత్యవతి గర్భమున చందమామ – జన్మించె మహలక్ష్మి చందమామ
అంతలో మునులునూ చందమామ – అక్కడికి వచ్చిరీ చందమామ
కపిల గాలవులునూ చందమామ – కశ్యపాంగిరసులు చందమామ
అత్రి వశిష్టులూ చందమామ – ఆకన్నియను జూచి చందమామ
బ్రతుకుగనె యీతల్లి చందమామ – బ్రతుకమ్మ యనిరంత చందమామ
పిలుతు రదివరనుండి చందమామ – ప్రియముగా తలిదండ్రి చందమామ
బ్రతుకమ్మ యని పేరు చందమామ – ప్రజలంత అందరూ చందమామ
తాను ధన్యూడంచు చందమామ – తనబిడ్డతో రాజు చందమామ
నిజపట్టణము కేగి చందమామ – నేల పాలించంగ చందమామ
శ్రీమహా విష్ణుండు చందమామ – చక్రాంకుడను పేర చందమామ
రాజు వేషంబున చందమామ – రాజు ఇంటికి వచ్చి చందమామ
ఇల్లింట మనివుండి చందమామ – అతివ బ్రతుకమ్మను    చందమామ
పెండ్లాడి కొడుకులా చందమామ – పెక్కుమందిని గాంచె చందమామ
ఆరువేల మంది చందమామ – అతి సుందరాంగులు చందమామ
ధర్మాంగుడను రాజు చందమామ – తన భార్య సత్యవతి    చందమామ
సరిలేని సిరులతో చందమామ – సంతోషమొందిరీ చందమామ
జగతిపై బ్రతుకమ్మ చందమామ – శాశ్వతంబుగ వెలసె    చందమామ

- నిర్జర.