తిరుమల కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం
posted on Dec 19, 2025 @ 7:40PM
తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో ఉపయోగించిన నెయ్యి కల్తీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న A29 టిటిడి అధికారి సుబ్రహ్మణ్యం దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను నెల్లూరు ఏసీబీ కోర్టు తిరస్కరించింది.
సిట్ తరపున అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ జయశేఖర్ కోర్టులో బలమైన వాదనలు వినిపించారు. సుబ్రహ్మణ్యం 2017–18 మరియు 2020 నుంచి 2023 వరకు టిటిడి కొనుగోళ్ల విభాగంలో జనరల్ మేనేజర్‌గా పనిచేసిన సమయంలో నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని పీపీ వివరించారు.
డెయిరీ ప్లాంట్లను ప్రత్యక్షంగా తనిఖీ చేయకుండానే అనుకూల నివేదికలు ఇచ్చి, అర్హత లేని సంస్థలైన భోలేబాబా డైరీ, వైష్ణవీ డైరీ, మలగంగా మిల్క్ అగ్రో ప్రొడక్ట్స్ లిమిటెడ్ నుంచి తిరుమలకు నెయ్యి సరఫరాకు అవకాశం కల్పించినట్టు వాదించారు.
దీనికి ప్రతిఫలంగా నిందితుడు సుబ్రహ్మణ్యం వెండి ప్లేట్లు, శాంసంగ్ మొబైల్ ఫోన్‌తో పాటు రూ.3.50 లక్షల లంచం తీసుకున్నట్టు సిట్ గుర్తించిన ఆధారాలను కోర్టుకు సమర్పించారు. ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం, అప్పన్నతో కలిసి కుట్ర చేసిన తీరును స్పష్టంగా చూపించే సాక్ష్యాలు ఉన్నాయని పీపీ జయశేఖర్ తెలిపారు.
అలాగే వైవి సుబ్బారెడ్డి పీఏ అప్పన్న ఒత్తిడితోనే సుబ్రహ్మణ్యం ఈ అక్రమాలకు పాల్పడ్డాడని కోర్టులో వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ఏసీబీ న్యాయమూర్తి, నిందితుడిపై ఉన్న ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయని పేర్కొంటూ సుబ్రహ్మణ్యం బెయిల్ పిటిషన్‌ను డిస్మిస్ చేస్తూ తీర్పు వెలువరించారు.