వైకాపాకి మరీ అంత ఆత్రం పనికి రాదు

 

ఇటీవల జరిగిన ఎన్నికలలో అవలీలగా గెలిచి ముఖ్యమంత్రి అయిపోదామని కలలుగన్న వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కంగుతిన్నారు. దుమ్ము దులపండి...ఐదు సంతకాలు పెట్టేస్తాను...అంటూ ఎంత ఊదరగొట్టినా జనం మాత్రం ఆయన మాటలు నమ్మలేదు. చివరికిక చేసేదేమీలేక ప్రజల తరపున పోరాడుతానని హామీ ఇస్తున్నారు. కానీ ఎన్నికలలో గెలిచిన తెలుగుదేశం పార్టీ ఇంకా అధికారం చెప్పట్టక మునుపే, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వాగ్దానం చేసినట్లు వెంటనే రైతుల రుణమాఫీ చేయాలని మిగిలిన హామీలని కూడా తక్షణమే అమలుచేయాలని వైకాపా నేతలు డిమాండ్ చేయడం మొదలు పెట్టారు. నిజానికి వారి ఆరాటమంతా రైతుల కోసం కాదు. చంద్రబాబు రుణాలు మాఫీ చేయలేక చేతులు ఎత్తేస్తే, మళ్ళీ ప్రజలలోకి వెళ్లేందుకు ఒక మంచి బలమయిన కారణం దొరుకుతుందని ఆరాటపడుతున్నారు.

 

ఇటువంటి కపట ఆలోచనలు చేసినందుకే వైకాపా ఎన్నికలలో ఓడిపోయింది. అయినా ఆ సంగతి మరిచిపోయి, మళ్ళీ తెదేపాను ఏవిధంగా అప్రదిష్టపాలు చేయాలా అని అవకాశం కోసం ఎదురు చూస్తోంది. గత ఐదేళ్ళుగా జగన్, విజయమ్మ,షర్మిల ముగ్గురూ కూడా జనాల సానుభూతి కోసం ఎంత తిరిగినా ఫలితం లేకుండా పోయింది. అందువల్ల మళ్ళీ మరో ఐదేళ్ళ పాటు ఆ సానుభూతి కోసం తిరగడం వృధా ప్రయాసేనని జగన్మోహన్ రెడ్డి కూడా అర్ధమయ్యే ఉండాలి. అందుకని ఇక వచ్చే ఐదేళ్ళు కూడా తెదేపా ప్రభుత్వం తప్పులను వెతికి పట్టుకొని ప్రజలలోకి వెళ్ళవలసి ఉంటుంది. అందుకే వెంటనే రుణమాఫీ ఫైలుపై చంద్రబాబు తోలి సంతకం చేయాలని వైకాపా నేతలు డిమాండ్ చేస్తున్నారు. అధికార పార్టీ తప్పులు చేస్తే ప్రతిపక్షం వాటిని ఎత్తి చూపవలసిందే. కానీ తెదేపా ఇంకా ప్రభుత్వ పగ్గాలు చెప్పట్టక ముందే, దాని కంటే ముందు వైకాపా నేతలు మరీ ఇంత ఆత్ర పడిపోవడం వల్ల వారే అభాసుపాలవుతారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేప్పట్టిన రోజు నుండి వైకాపా నేతలు ఇక నిరభ్యంతరంగా ఆ పనిమీదే ఉండవచ్చును.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News