అఖిలపక్షానికి వైకాపా డుమ్మా దేనికో

 

ఏపీఎన్జీవోలు ఈరోజు ఏర్పాటుచేస్తున్నఅఖిలపక్ష సమావేశం ప్రధానోద్దేశ్యం రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా అన్ని రాజకీయపార్టీలను ఒకే వేదిక మీదకు తెచ్చి సమైక్యపోరాటం చేయడం. అయితే ప్రస్తుతం అన్నిపార్టీలు తమ రాజకీయ ప్రయోజనాలని దృష్టిలో ఉంచుకొని వ్యవహరిస్తున్నందున, ఏపీఎన్జీవోల చేస్తున్నఈ ప్రయత్నం వల్ల పెద్దగా ఫలితం ఉండకపోవచ్చును. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుకొంటున్న రాజకీయ పార్టీల నేతలు తమ అహాన్ని, బేషజాలను, పార్టీ జెండాలను, స్వీయ మరియు పార్టీ ప్రయోజనాలను అన్నిటినీ పక్కన బెట్టి సమైక్యంగా కలిసి పనిచేస్తే నేటికీ రాష్ట్ర విభజనను ఆపే అవకాశం ఉంది. కానీ వారు అంత గొప్ప త్యాగాలు చేస్తారని ఆశించడం అడియాస, అవివేకమే అవుతుంది. దీనిని నిర్దారిస్తున్నట్లు వైకాపా తమ పార్టీ ఈ సమావేశంలో పాల్గొనబోదని తెలియజేసింది.

 

మిగిలిన అన్ని పార్టీల సంగతీ ఎలా ఉన్నపటికీ, సమైక్యాంధ్ర కోసం పోరాడుతూ, అందరినీ (ముఖ్యంగా తెదేపాను) తమతో కలిసి రమ్మనమని కోరిన వైకాపా, ఇప్పుడు అదే తెదేపా కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నకారణంగా తాము ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఇష్టపడటం లేదని కుంటి సాకు చెప్పి మొహం చాటేయడంతో వైకాపా నిజంగా సమైక్యాంధ్ర కోసమే పోరాడుతోందా? లేక ఆ సెంటిమెంటును వాడుకొని రాజకీయ లబ్ది పొందాలని పోరాడుతోందా?అనే అనుమానం కలగడం సహజం.

 

అన్ని పార్టీలను దూరం పెట్టిన ఏపీఎన్జీవోలు, జగన్మోహన్ రెడ్డి జైలు నుండి విడుదలకాగానే ఆయనను మాత్రమే కలిసి తమ ఉద్యమానికి మద్దతు కోరారు. వారి ఉద్యమానికి మద్దతు ఇచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి చిన్న మెలిక పెట్టారు. వారు ఒక సమైక్య తీర్మానం చేసి తీసుకు వస్తే దానిపై మొదటి సంతకము తానే చేస్తానని. అలాగే అన్నిపార్టీలను కూడా అందుకు వారు ఒప్పించాలని షరతు పెట్టారు. ఆవిధంగా తన రాజకీయ ప్రత్యర్ధి అయిన తెదేపాను ఇరికించవచ్చని జగన్ భావించారు. అయితే అది గ్రహించిన ఏపీఎన్జీవోలు ఆయన పధకంలో పావులుగా మారేందుకు ఇష్టపడలేదు. తనమాట వినకపోతే ఎంతటి ఆత్మీయులనయినా వదులుకొనే గుణం ఉన్న జగన్, ఏపీఎన్జీవోలను వదులుకోవడం పెద్ద విచిత్రం కాదు.

 

ఏపీఎన్జీవోలు ఆయన ప్రతిపాదనకు ఒప్పుకోకపోయినప్పటికీ, వారందరూ ముక్తకంఠంతో తనకు, తన పార్టీకి బేషరతుగా మద్దతు పలికి ఉండి ఉంటే, బహుశః జగన్మోహన్ రెడ్డి వారిని క్షమించి ఉండేవారేమో! కానీ, ఏపీఎన్జీవోల అధ్యక్షుడు అశోక్ బాబు తనను కాదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో తనకు సమాంతరంగా ఉద్యమం నడుపుతుండటం జగన్ కు ఆగ్రహం కలిగించింది. ఒకవైపు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మరోవైపు అశోక్ బాబు ఇద్దరూ కూడా రంగంలో ఉండటంతో, వైకాపా చేస్తున్నసమైక్యాంధ్ర ఉద్యమాల వలన సీమాంధ్రలో తనకు, తన పార్టీకి కూడా ఆశించినంతగా మైలేజీ రాకపోవడంతో జగన్మోహన్ రెడ్డి ఆగ్రహానికి కారణమయ్యి ఉండవచ్చును. అయితే జగన్మోహన్ రెడ్డి అదృష్టం కొద్దీ తెదేపా కూడా సమైక్యాంధ్ర రాగం అందుకోలేదు. అందుకొని ఉంటే అప్పుడు తెదేపాతో కూడా పోరాడవలసి ఉండేది.

 

ఓడిపోవడం తనకు ఇష్టం లేదని మీడియా ముందే కుండ బ్రద్దలు కొట్టినట్లు చెప్పిన జగన్మోహన్ రెడ్డి, అధిష్టానాన్ని ధిక్కరిస్తూ గట్టిగా సమైక్యవాదం చేస్తున్నకిరణ్ కుమార్ రెడ్డితో సమైక్యాంధ్ర ఛాంపియన్ షిప్ కోసం పోటీపడవలసి వస్తోంది. అటువంటప్పుడు ఇప్పుడు అశోక్ బాబుకి కూడా ప్రాధాన్యత ఇస్తే ఆయన కూడా తనకు పోటీ అవుతారనే ఆలోచనతోనే ఈ సమావేశానికి హాజరయ్యేందుకు విముఖత చూపి ఉండవచ్చును. ఈరోజు ఏపీఎన్జీవోలు నిర్వహిస్తున్న అఖిలపక్ష సమావేశం విజయవంతమయితే, రాష్ట్ర విభజనకి అడ్డంకులు ఏర్పడే అవకాశం ఉంది. ఆసంగతి ఎలా ఉన్నపటికీ, అన్ని పార్టీలు కలిసిపనిచేసేందుకు అశోక్ బాబు ఒప్పించగాలిగితే మళ్ళీ ఆయన కూడా బలం పుంజుకొనే అవకాశం ఉంటుంది.

 

జగన్మోహన్ రెడ్డి తెలంగాణాలో తన పార్టీని పణంగా పెట్టి మరీ చేస్తున్నసమైక్యాంధ్ర ఉద్యమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం వచ్చేఎన్నికలలో సీమాంధ్రలో విజయం సాధించడమే. అటువంటప్పుడు, రాజకీయాలలోకి రావాలనే ఉద్దేశ్యం ఉందని ప్రకటించిన అశోక్ బాబుకి ఆయన సహకరిస్తారని ఊహించలేము.