వ్రతం చెడినా ఫలితం దక్కించుకోలేని వైకాపా

 

రెండవ విడత పంచాయితీ ఎన్నికలలో కూడా కాంగ్రెస్, తెదేపాల ప్రభంజనమే నడుస్తున్నట్లు కనిపిస్తోంది. ఇంతవరకు రాష్ట్రం మొత్తంలో వెలువడిన ఫలితాలలో కాంగ్రెస్ మద్దతు పలికిన అభ్యర్ధులు మొత్తం 735 స్థానాలు దక్కించుకోగా, తెదేపా బలపరిచిన అభ్యర్ధులు 660 స్థానాలను కైవసం చేసుకోవడంతో ఆ పార్టీ రెండవ స్థానంలో నిలిచింది.

 

ఇక తెలంగాణాపై వెనకడుగు వేసిన వైకాపాకి ఊహించినట్లుగానే తెలంగాణాలో భంగపాటు తప్పలేదు. అక్కడ ఆ పార్టీకి అన్ని జిల్లాలలో కలిపి కేవలం 35 స్థానాలు మాత్రమే దక్కాయి. వ్రతం చెడినా ఫలితం దక్కనట్లుగా సమైక్యాంధ్ర నినాదం ఎత్తుకొన్నందుకు, కనీసం సీమంధ్రలో కూడా ఆ పార్టీ ఊహించినట్లు ఏమీ అద్భుతాలు జరుగలేదు. అక్కడ కూడా ఆ పార్టీ మూడవ స్థానికే పరిమితమయింది. సీమంద్ర ప్రాంతంలో కాంగ్రెస్ అభ్యర్ధులు 462 సీట్లు దక్కించుకోగా, తెదేపా 496 , వైకాపా 344 సీట్లు దక్కించుకోవడం గమనిస్తే వైకాపా సమైక్య వ్యూహం బెడిసి కొట్టినట్లు అర్ధం అవుతోంది. అయినప్పటికీ, యధావిధిగా తమ పార్టీ ఈసారి కూడా మిగిలిన అన్నిపార్టీల కంటే ఎక్కువ సీట్లు సాధించినట్లు ఆ పార్టీకి చెందిన మీడియా ప్రకటించుకొంది.

 

వైకాపా తన సమైక్య ప్రయోగం ఆశించిన ఫలితాలు ఇవ్వనందున బహుశః ఈ రోజు లేదా రేపుఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ తెలంగాణాపై తమ పార్టీ ఆనాడు ప్లీనరీలోఇచ్చిన మాటకే కట్టుబడి ఉందని, సీమంధ్ర శాసనసభ్యుల రాజీనామాలు వారి వ్యక్తిగతమని, అవి పార్టీ అభిప్రాయం కాదని మీడియా ముందుకు వచ్చి ప్రకటన చేయవచ్చును. తద్వారా కనీసం మూడవ దశ పంచాయితీ ఎన్నికలలోనయినా పార్టీ పరిస్థితి మెరుగుపరచుకొనే ప్రయత్నం చేయవచ్చును.

 

ఇక, తెరాస పరిస్థితి కూడా వైకాపాకు ఏమాత్రం భిన్నంగా లేదు. కాంగ్రెస్ విసిరిన పాచికలకి ఆ పార్టీ ఈ ఎన్నికలలో చిత్తయిపోయినట్లు అర్ధం అవుతోంది. తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ 275 సీట్లు దక్కించుకొని మొదటి స్థానంలో, తెదేపా 164 సీట్లతో రెండవ స్థానంలో నిలవగా, తెరాస కేవలం 132 సీట్లతో మూడవ స్థానానికి పరిమితమయిపోయింది. కానీ, ఆ పార్టీ కూడా తన స్వంత మీడియా లో మిగిలిన పార్టీల కంటే అత్యధిక స్థానాలు గెలుచుకొన్నట్లు ప్రకటించుకొంది.