వైకాపాలో దొంగలు పడ్డారు

 

వైకాపా అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో అరెస్టయ్యి ఏడాది బట్టి జైల్లో ఉండగా, ఇటీవల ఆయన పార్టీలో చేరిన ఇద్దరు వ్యక్తులు శ్రీధర్ రెడ్డి, నాగ మల్లేశ్వరి వివిధ క్రిమినల్ కేసులలో అరెస్టవడం ఆ పార్టీలో తీవ్ర కలకలం సృష్టిస్తోంది.

 

రాజమండ్రీకి చెందిన శ్రీధర్ రెడ్డి, అదే ఊరిలో గల బ్యాంకు ఏ.టీ.యం. నుండి తన అనుచరులతో కలిసి రూ.7.32కోట్లు దోచుకోవడమే కాకుండా, ఒక హత్యా నేరంలో కూడా ప్రధాన నిందితుడు. అయితే, అతను ఇటీవలే వైకాపాలో చేరడంతో ఏ.టీ.యం. నుండి దోచుకొచ్చిన డబ్బుతో, రాజమండ్రీలో పార్టీ కార్యాలయం ఆరంభించడమే కాకుండా, షర్మిల పాదయాత్ర దారిపొడవునా బ్యానర్లు, భారీ కటవుట్లు ఏర్పాటు చేసాడు. అందుకోసం అతను విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేసాడు. అప్పటికే అతని మీద కన్నేసిన పోలీసులు అతని జోరు చూసి విచారిస్తే నిజం బయటపడటంతో అతనిని అరెస్ట్ చేసారు. అయితే, ఆ వ్యక్తితో తమ పార్టీకెటువంటి సంబంధం లేదని వైకాపా నేతలు వెంటనే ప్రకటించారు.

 

కానీ, ఆ పార్టీకి చెందిన మరో కార్యకర్త నాగ మల్లేశ్వరి కూడా భారీ ఎత్తున దొంగనోట్లు చలామణీ చేస్తుండగా పోలీసులు పట్టుకోవడంతో వైకాపా మరోమారు ఇబ్బందికర పరిస్థితుల్లో ఇరుకొంది. ఆమెతో కూడా తమ పార్టీకి ఎటువంటి సంబంధము లేదని వెంటనే ప్రకటించవలసి వచ్చింది.

 

వైకాపాను మనస్పూర్తిగా ద్వేషించే కాంగ్రెస్ నేత వీ.హనుమంత రావు, తెదేపా నేత రేవంత్ రెడ్డి ఇద్దరూ కూడా వైకాపా దొంగలు బందిపోట్లు తో నిండిన పార్టీ అని ఎద్దేవా చేసారు. రేవంత్ రెడ్డి మరో అడుగు ముందుకు వేస్తూ షర్మిల పాదయత్రకి ఎవరెవరు ఎంత డబ్బు సమకూరుస్తున్నారు? అది ఎక్కడి నుంచి వస్తోంది? మొదలయిన విషయాలపై పోలీసులు విచారణ చేయాలని డిమాండ్ చేసారు.

 

ఈ రెండు సంఘటనలలో నిజానికి వైకాపా తప్పు ఉండే అవకాశం లేదు. ఎందుకంటే పార్టీలో చేరే సాదారణ కార్యకర్తల గత చరిత్రలను ఏ రాజకీయ పార్టీలు లోతుగా విచారించావు. అందువల్ల ఇటువంటి నేర చరితులు అన్నిపార్టీలలో సభ్యులుగా చేరే అవకాశం ఉంది. అటువంటప్పుడు వైకాపాను అంత తీవ్ర విమర్శలు చేయవలసిన అవసరం లేదు. నిజానికి సామాన్య కార్యకర్తలకంటే ఉన్నత స్థానానికి ఎదిగిన రాజకీయ నేతలే ఎక్కువ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారనే సంగతి అందరికీ తెలిసిందే. అందువల్ల అటువంటి బడా నేతలు దొరకనంత కాలం దొరలుగా చలామణి అవుతున్నారు.