వైఎస్ఆర్ జిల్లా పేరు మారుస్తూ ఉత్తర్వులు జారీ
posted on May 26, 2025 3:11PM

వైఎస్సార్ కడప జిల్లాగా పేరు మారుస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై వైఎస్సార్ కడప జిల్లాగా మారుస్తున్నట్లు జీవోలో పేర్కొంది. జిల్లా పేరు మార్పుపై గతంలో ప్రాథమిక నోటీఫికేషన్ జారీ చేయగా, ప్రజలు నుంచి ఎలాంటి అభ్యంతరాలు రాకపోవడంతో కూటమి సర్కారు తుది నోటీఫికేషన్ విడుదల చేసింది. గతేడాది అక్టోబర్‌లోనే వైఎస్ఆర్ జిల్లా పేరు మార్పుపై ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి లేఖ రాశారు. కడప ప్రాశస్త్యాన్ని తెలియజేస్తూ జిల్లా పేరును మార్చాలంటూ సత్యకుమార్ యాదవ్ సుదీర్ఘ లేఖ రాశారు.
కడప జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన దేవుని కడప ఆలయంలో శ్రీవారు శ్రీలక్ష్మీ వెంకటేశ్వరస్వామిగా కొలువై ఉన్నారన్న సత్యకుమార్.. దేవుని కడప ఆలయ విశిష్టతను లేఖలో ప్రస్తావించారు.. ఇంతటి చారిత్రక నేపథ్యం ఉన్న కడప పేరును వైసీపీ అవగాహన రాహిత్యంతో వైఎస్ఆర్ జిల్లాగా మార్చిందన్న సత్యకుమార్ పేర్కొన్నారు. ఇక కడప జిల్లా అభివృద్ధి కోసం వైఎస్ఆర్ ఎంతో కృషిచేశారనీ. కడప జిల్లా చారిత్రక నేపథ్యాన్ని. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన అభివృద్ధిని పరిగణిస్తూ.. వైఎస్ఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తి చేశారు. తాజాగా ఏపీ ప్రభుత్వం కూడా పేరు మార్పునకు నిర్ణయం తీసుకుంది.