అట‌ల్, పీవీ.. పోలిక‌లు.. వ్యత్యాసాలు!

ఒకే నెలలో ఇద్ద‌రు దిగ్గ‌జాల జ‌యంతి, వ‌ర్ధంతి. తేడా ఏంటో చూస్తే డిసెంబ‌ర్ 25న వాజ్ పేయి జ‌యంతి. ఈ ఉత్స‌వాలు ఎలా జ‌రుగుతున్నాయి? అదే పీవీ వ‌ర్ధంతి ఎలా జ‌రిగింది? అన్న వ్య‌త్యాసం చూస్తే.. ముందుగా  ఈ ఇద్ద‌రి మధ్యా పోలికలను ఒక సారి గుర్తుచేసుకోవాలి.   అట‌ల్ బీహారీ  వాజ్ పేయి, పీవీన‌ర‌సింహ‌రావు  ఇద్ద‌రిదీ దాదాపు ఒక‌టే వ‌య‌సు అనే కంటే సమకాలీనులు అనడం బెటర్. 1924లో వాజ్ పేయి జన్మించారు.  1921లో పీవీ జన్మించారు. ఇక వీరి రాజకీయ ప్రస్థానం విషయానికి వస్తే.. వాజ్ పేయి 1957లో బ‌ల‌రాంపూర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి విజయం సాధించి  ఎంపీగా పార్ల‌మెంటులో అడుగు పెట్టారు. అదే ఏడాది పీవీ మంథ‌ని అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎమ్మెల్యేగా  గెలిచారు. అట‌ల్ మొద‌టి నుంచి జాతీయ రాజ‌కీయాల్లోనే రాణిస్తూ రాగా.. పీవీ  తొలుత రాష్ట్ర రాజ‌కీయాలలో రాణించి, ఎమ్మెల్యేగా, మంత్రిగా, ముఖ్య‌మంత్రిగా ప‌ని చేశారు. ఆ తరువాతే కేంద్ర మంత్రిగా జాతీయ రాజకీయాలలోకి అడుగుపెట్టారు.

అట‌ల్, పీవీ ఇద్ద‌రూ  క‌వులే. మంచి వ‌క్త‌లే. అయితే వాజ్ పేయి ప్ర‌సంగాల‌కు వ‌చ్చిన గుర్తింపు పీవీకి రాలేద‌నే  చెప్పాలి. వాజ్ పేయి ఆర్ఎస్ఎస్ నేప‌థ్యం క‌లిగి ఉండ‌టం, అది కూడా ప్ర‌తిప‌క్షంలో ఉండ‌టంతో .. ఆయ‌న వ‌క్తృత్వ ప్రతిభ ప్రజలను ఆకట్టుకుంది.   అట‌ల్ ప్ర‌సంగిస్తుంటే, అంద‌రూ శ్ర‌ద్ధ‌గా  వినేవారు. కోట్లాది  మంది అట‌ల్ ప్ర‌సంగాలకు అభిమానుల‌య్యారు. ఇక్క‌డ అధికార విప‌క్షాల‌న్న  తేడా  క‌నిపించేది కాదు. పీవీ కాంగ్రెస్ లో ఉన్నందు వ‌ల్లో ఏమో ఇందిర ముందు మ‌రే నాయ‌క‌త్వం ఎద‌గ‌డానికి వీలు లేని ప‌రిస్థితుల మ‌ధ్య 1991 త‌ర్వాత మాత్ర‌మే పీవీ ప్ర‌సంగాలు ఎక్కువ‌గా వెలుగులోకి వ‌చ్చాయి.
 
ఇక్క‌డ ఈ ఇద్ద‌రికీ  మ‌ధ్య గ‌ల మ‌రో పోలిక ఏంటంటే.. వాజ్ పేయి తొలిసారి ఒక నాన్ కాంగ్రెస్ ప్రధానిగా  ఐదేళ్లు కాంగ్రెస్సేతర ప్రభుత్వాన్ని నడిపి చరిత్ర సృష్టిస్తే..   పీవీ  నాన్ గాంధీ  కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ప్రధానిగా ఐదేళ్లు మైనారిటీ ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపి  ఏలి రికార్డు సృష్టించారు. ఈ విషయంలో  ఇద్దరూ కూడా చరిత్ర సృష్టించారు.  వాజ్ పేయిని ఆయ‌న పార్టీ  ఇత‌ర నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఇప్ప‌టికీ త‌మ గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు. అదే పీవీ ప‌రిస్థితి అలా లేదు. ఆయ‌న‌కు పార్టీ ఇచ్చిన  గౌర‌వం అంతంత  మాత్ర‌మే. బీజేపీ అధికారంలో ఉన్నప్పుడే 2018 ఆగస్టు 16న అటల్ బిహారీ వాజపేయి మరణించారు. ఆయనకు ఆయన పార్టీ అంతా ఒక్కటై ఘన నివాళులర్పించింది. ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా  వాజ్ పేయి అంతిమ యాత్రలో పాల్గొని  4 కిలో మీటర్లు నడిచారు. ఆయన పాడె మోశారు.  

ఇక పీవీ విషయానికి వస్తే.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే పీవీ నరసింహారావు మరణించారు.  డిశంబర్ 23, 2004న ఆయన మరణించిన సమయంలో  ఆయన అంతిమ సంస్కారానికి పార్టీ అగ్రనేతలెవరూ హాజరు కాలేదు. ఆయన ఢిల్లీలో మరణించినా, పార్టీ కార్యాలయంలోనికి ఆయన పార్థీవదేహానికి ప్రవేశం లేకుండా పోయింది. ఇక అంత్యక్రియలు కూడా ఢిల్లీలో కాకుండా హైదరాబాద్ లో నిర్వహించారు.  

అట‌ల్ బిహారీ వాజ్ పేయి జ‌యంతి సంద‌ర్భంగా ఏపీ అమ‌రావ‌తిలో ఆయ‌న స్మృతివ‌నం ఏర్పాటు చేయ‌డంతో పాటు.. విగ్ర‌హావిష్క‌ర‌ణ కార్య‌క్రమాలు నిర్వ‌హిస్తున్నారు.. ఈ కార్య‌క్ర‌మానికి మాధ‌వ్ వంటి బీజేపీ నేత‌ల‌తో పాటు.. ఏపీ  సీఎం చంద్ర‌బాబు  స‌హా ప‌లువురు హాజ‌ర‌య్యారు. ఇదిలా ఉంటే శ‌త‌జ‌యంతి ఉత్స‌వాల్లో భాగంగా.. ఇప్ప‌టికే ధ‌ర్మ‌వ‌రం నుంచి ఏలూరు వ‌ర‌కూ ప‌లు ప్రాంతాల్లో అట‌ల్ జీ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌లు చేశారు. అట‌ల్- మోడీ సుప‌రిపాల‌నా  యాత్ర సైతం నిర్వ‌హించి అట‌ల్    ప్రేమాభిమానాలు కురిపించారు. కానీ పీవీ విష‌యంలో   ఆయ‌న వ‌ర్ధంతి సంద‌ర్భంగా  ఖ‌ర్గే చిన్న ట్వీట్ తో స‌రిపెట్టారు. ద‌టీజ్ డిఫ‌రెన్స్ బిట్వీన్ కాగ్రెస్ అండ్  బీజేపీ  అంటూ ప‌లువురు ఈ వ్యత్యాసాల‌ను ఎత్తి చూపుతున్నారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu