సీఎమ్మా? ఏ స్టేట్‌కి?
posted on Feb 3, 2014 4:56PM

వైఎస్సార్సీపీ ప్లీనరీలో జగన్ ఇచ్చిన స్టేట్‌మెంట్లు ఆయన భృత్యులకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్నాయి. నాలుగు నెలల తర్వాత నేనే సీఎం అంటూ జగన్ ముసలమ్మలకి, ముసలయ్యలకి ఆ మీటింగ్‌లో చెప్పడం, నాలుగు నెలల్లో మీ మనవడు సీఎం కాబోతున్నాడు (అంటే జగనే) అని అనడం జగన్ శిబిరంలో లేని ఉత్సాహాన్ని నింపింది. వైఎస్సార్సీపీ మూలన పడిందన్న అభిప్రాయాలు అంతటా వ్యక్తమవుతున్న తరుణంలో పార్టీలో ఉత్సాహాన్ని నింపడానికి జగన్ చేస్తున్న ప్రయత్నాల్లో భాగమే ఇలాంటి స్టేట్‌మెంట్లని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
జగన్ తాను సమైక్యవాదినని చెబుతున్నప్పటికీ లోకం మొత్తం ఆయన్ని విభజనవాదిగానే చూస్తోంది. నిన్నగాక మొన్న వైసీపీలోంచి బయటపడి బీజేపీ తీర్థం పుచ్చుకున్న రఘురామ కృష్ణంరాజు జగన్ నూటికి నూరుశాతం విభజనవాది అని ఢంకా బజాయించి చెబుతుంటే దాన్ని ఖండించేవారు వైసీపీలో ఎవరూ లేకుండా పోయారు. ఇప్పుడు జగన్ నాలుగు నెలల తర్వాత తానే సీఎం అని ప్రకటించడం వైసీపీలోని కొన్ని వర్గాలను సంతోషపరుస్తున్నప్పటికీ, కొన్ని వర్గాలు మాత్రం పలు సందేహాలను వ్యక్తం చేస్తున్నాయి.
నాలుగు నెలల తర్వాత జగన్ సీఎం అయ్యేది పూర్తిస్థాయి ఆంధ్రప్రదేశ్‌కా? లేక రాష్ట్రం ముక్కలయ్యాక మిగిలిన ఆంధ్రప్రదేశ్‌కా అనే సందేహాలు వారు వ్యక్తం చేస్తున్నారు. ఒకపక్క రాష్ట్రం ముక్కలయ్యే ముప్పు ముంచుకొస్తుంటే జగన్ మాత్రం తాను ముఖ్యమంత్రి కాబోతున్నానని స్టేట్‌మెంట్లు ఇస్తూ వుండటం వైసీపీలోనే కొన్ని వర్గాలకు మింగుడు పడటం లేదు.
విభజన బిల్లు ఢిల్లీకి చేరుకున్న ప్రస్తుత పరిస్థితుల్లో అటు విభజనవాదులు, ఇటు సమైక్యవాదులు ఢిల్లీకి చేరుకుని ఎవరి లాబీయింగ్‌లో వారున్న నేపథ్యంలో జగన్ మాత్రం అలాంటి ప్రయత్నాలేవీ చేయకుండా మీటింగులు, స్టేట్‌మెంట్లతో స్టేట్‌లోనే కాలక్షేపం చేస్తూ వుండటాన్ని అందరూ అనుమానపు కళ్ళతో చూస్తున్నారు.