వైకాపా అల్ప సంతోషం!
posted on Oct 26, 2013 2:40PM

గత నాలుగైదు రోజులుగా హైదరాబాద్‌లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే వున్నాయి. ఈ వర్షాలు సమైక్య శంఖారావం సభని నిర్వహించాలని అనుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుల గుండెల్లో కూడా కురుస్తూనే వున్నాయి. సభ జరిగే సమయంలో ఓభారీ వర్షం తగులుకుంటే సభకు వచ్చినవాళ్ళంతా కకావికలైపోయి సభ అభాసు పాలయ్యే ప్రమాదం ఉందన్న శంకలు శంఖారావ సభ చుట్టూ అల్లుకున్నాయి. అయితే శనివారం ఉదయం నుంచి వాతావరణంలో మార్పు వచ్చింది.
హైదరాబాద్‌లో చిరుజల్లులు తప్ప చెప్పుకోదగ్గ వర్షం కురవలేదు. సూర్యుడు బయటకి వచ్చి జనాన్ని పలకరించాడు కూడా! ప్రకృతిలో వచ్చిన ఈ మార్పు అదేదో తమ గొప్పతనంగా వైకాపా శ్రేణులు భావిస్తున్నాయి. ఆ దేవుడు తమ పార్టీకి అనుకూలంగా ఉండటం వల్లే నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాలు తగ్గుముఖం పట్టాయని చెప్పుకుంటూ అల్ప సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వరుణుడు జగన్ సభకి తన మద్దతు తెలిపాడని అనుకుంటున్నారు. భవిష్యత్తులో రాష్ట్రంలో తమ పార్టీ సాధించబోయే విజయాలకు ఇది ఒక సూచన అని పార్టీ నాయకులు కొత్త కొత్త అర్థాలు వెతుకుతున్నారు.