వివేకా హత్యను గుర్తు తెచ్చేలా పులివెందులలో పరిస్థితులు.. సునీత
posted on Aug 8, 2025 10:02AM
.webp)
వివేకా హత్య సీబీఐ దర్యాప్తు ముగిసిందంటూ సీబీఐ సుప్రీం కోర్టుకు ఇటీవల తెలియజేసింది. ఈ కేసులో వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిలు పిటిషన్ పెండింగ్ లో ఉంది. అలాగే పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక నేపథ్యంలో జగన్ సొంత నియోజకవర్గంలో రాజకీయం వేడి పెరిగింది. ఈ నేపథ్యంలో వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత కడప ఎస్పీతో భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక నేపథ్యంలో గత రెండు రోజులుగా జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే.. తన తండ్రి వివేకా హత్య గుర్తుకు వస్తోందన్నారు.
ఈ సందర్భంగానే ఆమె గతంలో తన తండ్రి హత్యకు ఆదినారాయణ రెడ్డి, సతీష్ రెడ్డి, బీటెక్ రవిలే కారణమంటూ సంతకం చేయాలంటూ అప్పట్లో తన దగ్గరకు ఒక లేఖ తీసుకుని వచ్చారనీ, కానీ తాను ఆ లేఖపై సంతకం చేయలేదనీ గుర్తు చేసుకున్నారు. ఇదే విషయాన్ని సునీత ఎస్పీకీ తెలిపారు. అలాగే.. తన తండ్రి మృతదేహం రక్తపు మడుగులో పడి ఉంటే.. గుండెపోటు అని చెప్పారనీ, ఆ తరువాత తెలుగుదేశం నేతల హత్య చేశారంటూ కథనాలు వండివార్చారనీ, స్థానిక పోలీసులను బెదరించి క్రైమ్ సీన్ ను ట్యాంపర్ చేసి మార్చేశారనీ సునీత పేర్కొన్నారు.
మళ్లీ ఇప్పుడు పులివెందులలో నాటి పరిస్థితులు గుర్తుకు తెచ్చేలా వాతావరణం ఉందని ఎస్పీకి సునీత చెప్పారు. తన బంధువు బంధువు సురేష్ పై అవినాష్ రెడ్డి అనుచరులు దాడి చేశారని ఆరోపించారు. గత ఆరేళ్లుగా తన తండ్రి వివేకా హత్య కేసు విషయంలో పోరాటం చేస్తూనే ఉన్నాననీ.. , ఇప్పటికీ దోషులకు శిక్ష పడలేదని సునీతా రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తప్పు చేసిన వారికి శిక్ష పడాలని డిమాండ్ చేశారు.