సిగ్గులేని పాలన! కేసీఆర్ పై షర్మిల నిప్పులు

ఉద్యోగ నియామకాల కోసం చేపట్టిన దీక్షను వైఎస్ షర్మిల విరమించారు.  72 గంట‌ల పాటు నిరాహార దీక్ష‌లో కూర్చున్న షర్మిలకు నిరుద్యోగుల కుటుంబస‌భ్యులు నిమ్మ రసం ఇచ్చి దీక్ష‌ను విర‌మింప‌జేశారు. ఈ సంద‌ర్భంగా  సీఎం కేసీఆర్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. నిరుద్యోగుల జీవితాలతో కేసీఆర్ పాలకులు ఆటలాడుతున్నారని మండిపడ్డారు. పాల‌కుల్లో ఒక్క‌రికైనా గుండె ఉందా? ఆ ఛాతీలో ఉన్న‌ది గుండెనా? బ‌ండ రాయా? అంటూ షర్మిల నిప్పులు చెరిగారు.

తెలంగాణ‌లో 40 ల‌క్ష‌ల మంది నిరుద్యోగులు ఉద్యోగాల నోటిఫికేష‌న్లు ఎప్పుడు వ‌స్తాయ‌ని ఎదురు చూస్తున్నారని అన్నారు షర్మిల. పెళ్లి కూడా చేసుకోకుండా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తూ వారికి వ‌య‌సు కూడా పెరిగిపోవడంతో ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటున్నారన్నారు. ఈ ఆత్మ‌హ‌త్య‌ల‌కు కార‌ణం సీఎం కేసీఆర్ కాదా? ఇవి హ‌త్యలా? ఆత్మ‌హ‌త్య‌లా?' ని ష‌ర్మిల నిలదీశారు. కేసీఆర్ చిటికేస్తే నోటిఫికేష‌న్లు వ‌స్తాయన్నారు షర్మిల. గతంలో వైఎస్సార్ మూడు సార్లు నోటిఫికేష‌న్లు ఇచ్చారన్నారు. ఇప్పుడు కేసీఆర్ ఏం చేస్తున్నారనిప్రశ్నించారు. అప్ప‌ట్లో వైఎస్సార్ ప్రైవేటు రంగంలోనూ ల‌క్ష‌ల ఉద్యోగాలు సృష్టించారని తెలిపారు.  కేసీఆర్ మాత్రం అసమ‌ర్థుడు.. ఆయ‌న ఛాతీలో ఉన్నది గుండెనా? బ‌ండా?  దొర‌ల గ‌డీ నుంచి నియంత పాల‌న కొన‌సాగిస్తున్నారు అంటూ  ష‌ర్మిల తీవ్రంగా విరుచుకుపడ్డారు. 

ప్ర‌శ్నించాల్సిన ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌లు చేతుల‌కు గాజులు వేసుకుని కేసీఆర్ ఇచ్చిన డ‌బ్బును తీసుకుంటూ డ్యాన్స్ చేస్తున్నారని షర్మిల విమర్శించారు. అందుకే తాను పోరాటం చేస్తాన‌ని వ‌చ్చానన్నారు. తన పోరాటంతో పాల‌కుల‌కు భ‌యం వేస్తోందన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకుని మ‌మ్మ‌ల్ని టార్గెట్ చేశారని షర్మిల ఆరోపించారు. పోలీసులు లా అండ్ ఆర్డ‌ర్ కోసం ప‌నిచేస్తున్నారా? కేసీఆర్ కోసం ప‌నిచేస్తున్నారా?  తెలియడం లేదన్నారు. తెలంగాణ త‌ల్లి సాక్షిగా తన బ‌ట్ట‌లు చింపి, నా చేతిని విర‌గొట్టి, ఇంకొక త‌మ్ముడి కాళ్లు విర‌గ్గొట్టి తీసుకెళ్లారని చెప్పారు. సిగ్గుండాలి పాల‌కుల‌కు. ఆడ‌వాళ్ల మీదనా మీ ప్ర‌తాపం. యావ‌త్ మ‌హిళా లోకం ఈ పాల‌కుల మీద ఉమ్మి వేస్తోంది అంటూ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. 

త‌న పోరాటం ఆగ‌బోద‌ని ష‌ర్మిల ప్ర‌క‌టించారు. ల‌క్షా 91 వేల ఉద్యోగాల భ‌ర్తీ కోసం నోటిఫికేష‌న్లు జారీ చేయాల్సిందేనన్నారు. దున్నపోతు మీద వాన ప‌డిన‌ట్లు కేసీఆర్ గారు స్పందించ‌కుండా ఇలాగే కాల‌యాప‌న చేస్తే తాముచేయ‌బోయే ప్ర‌తి కార్య‌క్ర‌మంలో నిరుద్యోగుల అంశాన్ని లేవ‌నెత్తుతానని ష‌ర్మిల హెచ్చరించారు.