జగన్ ఎప్పటికీ నెక్స్ట్ సీఎం గానే మిగిలిపోతాడా

 

ప్రజాస్వామ్యంలో పాలక పక్షం వుంటుంది. ప్రతిపక్షం కూడా వుంటుంది. పాలకపక్షం బలంగా లేకుంటే అభివృద్ధి వుండదు. కాని, ప్రతిపక్షం బలంగా లేకుంటే అవినీతి, అరాచకం పెరిగిపోతాయి. అందుకే, ఒక్కోసారి పాలకపక్షం కంటే ప్రతిపక్షం చాలా ముఖ్యం. కాని, నవ్యాంధ్రలో బలమైన పాలకపక్షం దిశ, దశాలేని ప్రతిపక్షంతో హాయిగా రాష్ట్రాన్ని ఏలుకుంటోంది. తాజాగా ప్రతిపక్ష నాయకుడు జగన్ ప్రభుత్వాసుపత్రిలో చేసిన హంగామా ఇందుకు మంచి ఉదాహరణ! ఆయన గంభీరంగా వ్యవహరించి వుంటే ఇరుకున పడాల్సిన గవర్నమెంట్ ఇప్పుడు రివర్స్ ఎటాక్ చేసి తన పని తాను చేసుకుపోతోంది...

 

దివాకర్ ట్రావెల్స్ బస్సు బోల్తా కొట్టడం, కొందరి ప్రాణాలు పోవటం, చాలా మంది గాయపడటం అందర్నీ షాక్ కి గురి చేసింది. అయితే, దీని తరువాత జరగాల్సిన సరైన చర్చ ఏంటి? ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల నిర్వహణ, వాటిపై ప్రభుత్వ నియంత్రణ, నిఘా, ఇలాంటివన్నీ లేవనెత్తబడాలి. అప్పుడు కనీసం మరోసారి మరో ప్రైవేట్ బస్సన్నా ఇప్పటిదానిలా నరకానికి దారి చూపకుండా వుంటుంది. కాని, జగన్ ఈ మధ్య సరికొత్తగా మొదలు పెట్టిన యాక్షన్ హీరో పర్ఫామెన్స్ పుణ్యమాని... మొత్తం అంతా అదుపు తప్పింది. జరిగిన తప్పు ఎక్కడో పోయింది. పనికి రాని రాజకీయ సవాళ్లు, ప్రతి సవాళ్లు జనానికి మిగిలాయి...

 

జగన్ ఒక ప్రభుత్వాసుపత్రికి వెళ్లి అక్కడ గవర్నెమంట్ డాక్టర్ని, కలెక్టర్ని ఇబ్బంది పెట్టడం ఎవ్వరూ ఒప్పుకోని విషయం. ఆయన చెప్పినట్లు నిజంగా కూడా అధికారులు పాలక పక్షం వైపు వుండి వచ్చు! అది మన దేశంలో చాలా సార్లు జరిగే విషయమే. జగన్ తండ్రి వైఎస్ సీఎంగా వున్నప్పుడు అన్ని శాఖల్లో, దాదాపు అందరు ఉన్నతాధికారులు ఆయనకు అనుంగు విధేయులుగా వున్నవారే కనిపించే వారు. తరువాత వారిలో కొంత మంది జైలుకి కూడా వెళ్లాల్సి వచ్చిందంటే అప్పటి విధేయత ఎంతగా వుండేదో మనం అర్థం చేసుకోవచ్చు!

 

నిజంగా గవర్నమెంట్ డాక్టర్ , కలెక్టర్ మృతుల పోస్ట్ మార్టమ్ విషయంలో తప్పుగా ప్రవర్తించి వుంటారా? వారి మీద ఆరోపణలు చేసే హక్కు జగన్ కు వుంటుంది. పైగా తన సాక్షి మీడియాతో సహా బోలెడు తెలుగు మీడియా ప్రచారం కల్పించటానికి వుండనే వుంది కూడా. అయినా, కూడా జగన్ డాక్టర్ని, కలెక్టర్ని నేరుగా బెదిరించి, మరో రెండేళ్లలో నేనే సీఎం అంటూ పాత డైలాడ్ వదలటం అస్సలు బాలేదు. దీని వల్ల గవర్నమెంట్ అధికారుల్లో , ఉద్యోగుల్లో యువనేత పట్ల వ్యతిరేక భావం కలగటమే కాక శవ రాజకీయాలు చేస్తున్నాడని జనం ఫీలయ్యే ఛాన్స్ వుంది. ఎందుకంటే, మొన్నటికి మొన్న విశాఖ విమానాశ్రయంలో కూడా అధికారులకి చుక్కలు చూపించాడు జగన్. అక్కడి దాకా వెళ్లి ప్రత్యేక హోదా డిమాండ్ కి మద్దతు పలకటం తప్పు కాకపోయినా ఆఫీసర్లని తిట్టిపోసి , బెదిరించి, నేనే నెక్స్ట్ సీఎం అంటూ వారెంట్ ఇవ్వటం ఒక విధమైన రౌడీయిజం అనిపించుకుంటుంది. దాని వల్లే స్పెషల్ స్టేటస్ ఉద్యమంలో జగన్ కు దక్కాల్సిన క్రెడిట్ కన్నా తక్కువ మైలేజే దక్కింది.

 

ప్రతిపక్షంలో వున్నప్పుడు అసహనం ఎంత మాత్రం పనికి రాదు. ఓపిగ్గా జనం వైపు నుంచి ఆలోచిస్తూ పాలకుల్ని ఇరుకున పెట్టాలి. ఇప్పటి బస్సు దుర్ఘటనే తీసుకుంటే ఆ బస్సు టీడీపీ నేతది. కాబట్టి మరింత తీవ్రంగా ఒత్తిడి చేయోచ్చు అధికార పక్షంపై. కాని, జగన్ తన విపరీత దూకుడుతో ఇటు ప్రజలకీ మంచి చేయక, అటు తనకి మేలు చేసుకోక.... అవకాశం జారవిడుచుకున్నాడు. ఇలా చేస్తే నెక్స్ట్ సీఎం డైలాగ్ ఇంకా చాలా ఏళ్లు చెబుతూనే వుండాల్సి రావచ్చు! ఒక సారి ఆలోచించుకుంటే మంచిది!