వైఎస్ కుటుంబం మద్దతు సునీతకే

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో జగన్ కుటుంబం నిట్టనిలువునా చీలిపోయింది. నిందితుల్ని కాపాడటానికి అధికారాన్ని పూర్తి స్థాయిలో దుర్వినియోగం చేస్తున్న జగన్ కు కుటుంబం దాదాపుగా దూరమైపోయింది. దీంతో ఆయన, ఆయన కాపాడటానికి ప్రయత్నిస్తున్న వారు..సొంత కుటుంబ సభ్యులపైనే నిందారోపణలు చేస్తున్నారు.

ఆ నిందారోపణలతో కుటుంబం పరువు గంగలో కలుస్తున్నా పట్టించుకోవడం లేదు. వివేకా హత్య జరిగిన నాలుగేళ్ల తరువాత ఒక సారి విషయావలోకన చేస్తే.. జగన్ సొంత కుటుంబ సభ్యులెవరూ జగన్ కు మద్దతుగా నిలబడటం లేదని విస్ఫష్టంగా తేలిపోతోంది. అంతే కాకుండా వారు సునీతకు అండగా నిలిచారనీ,  వివేకా హత్య కేసు విషయంలో సునీతకు మద్దతుగా నిలవడమే కాదు.. జగన్ కాపాడటానికి ప్రయత్నిస్తున్నవారు చేస్తున్న నిందారోపణలలోని డొల్లతనాన్ని బయటపెడుతూ.. అసలు వాస్తవాలు బహిరంగంగా, మీడియా ముఖంగా చెబుతూ బయటకు వస్తున్నారు.  

వైఎస్ వివేకాపై కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డి చేస్తున్నవన్నీ అసత్య ఆరోపణలేనని కుండ బద్దలు కొడుతున్నారు. ఈ విషయంలో జగన్ కు తోడబుట్టిన సోదరి  షర్మిల అవినాష్ ప్రభృతులు చేస్తున్నవన్నీ తప్పుడు ఆరోపణలేనని కుండ బద్దలు కొట్టారు. ఆ  ఆరోపణలను నిర్ద్వంద్వంగా ఖండించారు.  

దీంతో వైఎస్ కుటుంబం మొత్తం సునీతకు అండగా ఉంటే.. జగన్ ఒక్కడూ కుటుంబానికి దూరమై.. ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులవైపు నిలిచారన్నది విస్పష్టంగా తేలిపోతున్నది.  ఇక తాజాగా బుధవారం (ఏప్రిల్ 26) మీడియాతో మాట్లాడిన వైఎస్ షర్మిల తన బాబాయ్ వివేకానందరెడ్డి హత్య ఆస్తి కోసం చేసిందనడంలో ఏ మాత్రం వాస్తవం లేదని కుండబద్దలు కొట్టారు.   ఆస్తికోసమే అయితే.. సునీతను హత్య చేస్తారు కానీ బాబాయ్ వివేకానందను కాదని చెప్పారు.  

అలాగే..  వివేకా గొప్ప వ్యక్తి అని, మంచి ప్రజా నాయకుడని అన్నారు. ప్రజలందరికీ  సదా అందుబాటులో ఉంటూ ప్రజాసేవ చేశారని చెప్పారు.  అలాంటి వ్యక్తి గురించి కొందరు వ్యక్తులు, కొన్ని విూడియా సంస్థలు, వైసీపీ సోషల్ మీడియా విషప్రచారం చేయడం దారుణమన్నారు. మన మధ్య లేని వ్యక్తి గురించి తప్పుడు ప్రచారం చేయడం దుర్మార్గమన్నారు.  హత్యకు ఆస్తులు కారణం కాదని.. కడప ఎంపీ సీటు కోసమే హత్య జరిగిందనీ షర్మిల అన్నారు. ఒకవేళ ఆస్తులే హత్యకు కారణమైతే వివేకాను కాకుండా సునీతను చంపేవాళ్లని చెప్పారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu