వివేకా హత్య కేసు.. ఇక వైఎస్ అవినాష్ ముందస్తు బెయిలు రద్దేనా?
posted on Aug 5, 2025 3:43PM

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు పూర్తయ్యింది. ఈ విషయాన్ని సీబీఐ దేశ సర్వోన్నత న్యాయస్థానానికి తెలియజేయడంతో.. ఇప్పడు చర్చ ఈ కేసులో కీలక నిందితుడుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ అవినాష్ రెడ్డిపైకి మళ్లింది. దర్యాప్తు పూర్తయ్యిందని సీబీఐ సుప్రీం కోర్టుకు నివేదించడంతో.. ఇక ఇప్పుడు అవినాష్ రెడ్డి ముందస్తు బెయిలు, అలాగే ఈ కేసులో బెయిలుపై బయటకు వచ్చిన ఇతర నిందితుల బెయిళ్ల రద్దు అవుతాయా అన్న కోణంలో ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ఇక సీబీఐ సుప్రీం కోర్టుకు వివేకా హత్య చేసులో దర్యాప్తు ముగిసిందని తెలియజేయడమే కాకుండా.. సుప్రీం ఆదేశిస్తే తదుపరి విచారణ కొనసాగిస్తామని పేర్కొంది. అంతే కాకుండా దర్యాప్తుకు సంబంధించిన పూర్తి నివేదికను కూడా కోర్టుకు సమర్పించింది. అలాగే వైసీపీ హయాంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఆ దేశం మేరకే కడప పోలీసులు సునీతా రెడ్డి, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి, సీబీఐ విచారణాధికారి రామ్ సింగ్‌లపై కేసులు నమోదు చేశారని సీబీఐ న్యాయవాది సుప్రీం కోర్టుకి తెలిపారు. వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడుగా ఉన్న అవినాష్ రెడ్డి సాక్షులను ప్రభావితం చేస్తున్నారనడానికి దీనిని తిరుగులేని నిదర్శనంగా సీబీఐ సుప్రీం కోర్టుకు తెలిపింది. అలాగే అవినాష్ సహా ఇతర నిందితుల బెయిళ్లు కూడా రద్దు చేయాలని కోరింది.
అయితే అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సునీతా రెడ్డి తరపు వాదిస్తున్న సిద్ధార్ధ లుద్రా అభ్యర్థన మేరకు ఈ కేసు విచారణను మధ్యాహ్నం తరువాత చేపడతామని జస్టిస్ ఎంఎం సుదరేశ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. దీంతో అవినాష్ ముందస్తు బెయిలు రద్దు పిటిషన్ విచారణ ఈ మధ్యాహ్నం తరువాత హియరింగ్ కు వచ్చే అవకాశం ఉంది. సీబీఐ అవినాష్ రెడ్డి సాక్షులను ప్రభావితం చేస్తున్నారని బలంగా చెప్పడంతో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిలు రద్దయ్యే అవకాశాలే మెండుగా ఉన్నాయని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒక వేళ అవినాష్ బెయిలు రద్దు కావడం అంటూ జరిగితే వివేకా హత్య కేసు ముగింపునకు వచ్చినట్లే అవుతుందనీ, ఈ కేసులో సూత్రధారులు, పాత్రధారులకు చట్ట ప్రకారం శిక్ష పడే అవకాశాలు ఎంతో దూరంలో లేవనీ అంటున్నారు.