ఉరకలేసే యువత, ఉత్సాహం నిండిన కార్యకర్తలే తెలుగుదేశం శక్తి, ఆస్తి.. చంద్రబాబు
posted on May 27, 2025 9:43AM

తెలుగుదేశం పెద్ద పండుగ మహానాడు సందర్భంగా పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. ఉరకలేసే ఉత్సాహం. ఉత్తుంగ తరంగంలా ఎగసిపడే యువశక్తి తెలుగుదేశం ఆస్తి అని పేర్కొన్న ఆయన తరతరాల తెలుగు ఖ్యాతిని జగద్విదితం చేయడం తెలుగుదేశం కర్తవ్యమన్నారు. ప్రపంచ దేశాలలో తెలుగువారు ఎక్కడ ఉన్నా నంబర్ వన్ గా, వారు ఉన్న దేశానికే తలమానికంగా మారాలన్నదే మన సంకల్పమని, అందుకోసమే నిరంతరం శ్రమస్తున్నామనీ పేర్కొన్నారు.
ఎన్ని కష్టాలు, అవరోధాలు, అడ్డంకులూ ఎదురైనా తెలుగుదేశం ముందడుగు వేస్తూనే ఉందనీ, ప్రతి పరీక్షా సమయంలోనూ వజేతగానే తెలుగుదేశం పార్టీ నిలిచిందని చెప్పిన చంద్రబాబు అందుకు కార్యకర్తల దీక్షాదక్షతలు కారణమన్నారు. ముఖ్యంగా గత ఏడాది జరిగిన ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ విశ్వరూప సందర్శనం చరిత్రలో నిలిచిపోతుందన్నారు.
తెలుగుదేశం ఆవిర్భావం తరువాత తొలి సారిగా కడపలో మహానాడు నిర్వహించుకుంటున్నామని చంద్రబాబు అన్నారు. మహానాడు సందర్భంగా ప్రజాసేవకు పునరంకితం అవుతూ, యువగళానికి ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు. అలాగు అన్నదాతకు అండగా నిలుస్తూ, స్త్రీశక్తికి పెద్ద పీట వేయాలని, పేదల సేవకు నిరంతరం శ్రమించాలని, తెలుగు జాతి విశ్వఖ్యాతి లక్ష్య సాధన దిశగా కార్యాచరణ ఉండాలని చంద్రబాబు ఉద్భోదించారు.